45 మందిని కాపాడి ప్రాణాలొదిలిండు

  • భద్రాద్రి నుంచి యాదాద్రికి వెళ్తున్న ఏపీ టూరిస్ట్​ బస్సు 
  • వెంకటాపురం మండలంలో డ్రైవర్​కు హార్ట్​ ఎటాక్​ 
  • విలవిల్లాడుతూనే బస్సు బ్రేకులేసి మృతి 

వెంకటాపురం, వెలుగు : తీర్థయాత్రలకు వెళ్తున్న ప్రైవేటు టూరిస్ట్ బస్సు డ్రైవర్ కు గుండెపోటు రాగా నొప్పిని భరిస్తూ బస్సును అతికష్టం మీద కంట్రోల్​చేసి పక్కకు నిలిపాడు. దీంతో 45 మంది ప్రయాణికులకు ప్రమాదం తప్పింది. డ్రైవర్ ను దవాఖానాకు తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. ఈ సంఘటన ములుగు జిల్లా వెంకటాపురం మండలం అంకన్నగూడెం – వీరభద్రవరం మధ్య శుక్రవారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. ఆంధ్రప్రదేశ్​ రాష్ట్రం చిత్తూరు జిల్లాకు చెందిన 45మంది భవాని మాల వేసుకున్న భక్తులను తీసుకొని ప్రైవేటు టూరిస్టు బస్సులో డ్రైవర్ బాబు భద్రాచలం వచ్చారు. అక్కడి నుంచి బయలుదేరి వెంకటాపురం మండలం మీదుగా యాదాద్రి లక్ష్మీనర్సింహ స్వామి దర్శనం కోసం బయలు దేరారు.

ఈ క్రమంలో అంకన్నగూడెం-– వీరభద్రవరం గ్రామాల మధ్యకు రాగానే డ్రైవర్ కు గుండెపోటు వచ్చింది. విపరీతమైన నొప్పితో విలవిల్లాడుతుండగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకెళ్లింది. ప్రాణాపాయ స్థితిలోనూ బస్సును బ్రేకులు వేసి ఆపేశాడు. తర్వాత అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. ప్రయాణికులు గమనించి అతడిని108 అంబులెన్స్​లో వెంకటాపురం దవాఖానాకు తరలించారు. వైద్యులు పరిశీలించి అప్పటికే చనిపోయాడని నిర్ధారించారు. వెంకటాపురం పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు.