
- ఇద్దరు పిల్లలు సహా తండ్రి మృతి
- తల్లిని కాపాడిన స్థానికులు
- వరంగల్ జిల్లా తీగరాజుపల్లి వద్ద ప్రమాదం
వరంగల్ / పర్వతగిరి, వెలుగు: వరంగల్ జిల్లాలో ఘోరం జరిగింది. డ్రైవింగ్ చేస్తుండగా గుండెపోటు రావడంతో కారు అదుపుతప్పి కాల్వలోకి దూసు కెళ్లింది. ప్రమాదంలో ఇద్దరు పిల్లలు సహా తండ్రి చనిపోయారు. తల్లిని స్థానికులు కాపాడారు. ఈ ఘటన పర్వతగిరి, సంగెం మండలాల శివారులో ఉన్న తీగరాజుపల్లి వద్ద జరిగింది. మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్‌కుమార్ (35) ఎల్ఐసీ హౌసింగ్ డిపార్ట్‌మెంట్‌లో మేనేజర్‌గా పనిచేస్తూ హనుమకొండ రాంనగర్‍లోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్నాడు. శనివారం ఉదయం భార్య కృష్ణవేణి, కూతురు చైత్రసాయి (5), కుమారుడు సాయివర్ధన్ (2)తో కలిసి సొంత గ్రామమైన మేచరాజుపల్లికి కారులో బయలుదేరాడు.
తీగరాజుపల్లి జంక్షన్ నుంచి పర్వతగిరి వైపు కెనాల్ మీదుగా వెళ్తుండగా ప్రవీణ్‍కు గుండెనొప్పి వచ్చింది. ఈ విషయాన్ని భార్యకు చెప్పడంతో గ్రామానికి కాకుండా హాస్పిటల్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ప్రవీణ్ నొప్పితోనే కారును వెనక్కి తిప్పేందుకు ప్రయత్నిస్తుండగా, అదుపుతప్పి ఎస్సారెస్పీ కెనాల్‌లోకి దూసుకెళ్లింది. చివరి క్షణంలో కారు డోరు తీసుకొని కృష్ణవేణి బయటకు రాగా, నీటిలో మునిగిపోతున్న ఆమెను స్థానికులు గమనించి కాపాడారు. కారుతో పాటు ప్రవీణ్, చైత్రసాయి, సాయివర్ధన్ నీటిలో గల్లంతయ్యారు. కొద్దిసేపటి తర్వాత సాయివర్ధన్ డెడ్‌బాడీ నీటిపై తేలడంతో స్థానికులు బయటకు తీశారు.
విషయం తెలుసుకున్న పర్వతగిరి పోలీసులు, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. కెనాల్‌లో నీటి ప్రవాహం ఎక్కువగా ఉండడంతో సహాయక చర్యలకు కొంత ఇబ్బంది కలిగింది. పోలీసులు, రెస్క్యూ టీమ్ రంగంలోకి దిగి ప్రవీణ్, చైత్రసాయి ఆచూకీ కోసం నీటిలో గాలించారు. కొద్దిసేపటి తర్వాత ప్రమాదం జరిగిన స్థలం నుంచి 100 మీటర్ల దూరంలో కారును గుర్తించి తాళ్ల సాయంతో ఒడ్డుకు తీసుకొచ్చారు. అందులో నుంచి ప్రవీణ్, చైత్రసాయి డెడ్‌బాడీలను బయటకు తీసి, వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించారు. కాగా, అంతకుముందే సాయివర్ధన్ డెడ్‌బాడీని ఎంజీఎంకు పంపించారు.
ట్రాక్టర్‌లో డెడ్‌బాడీల తరలింపు..
కారులో నుంచి బయటకు తీసిన ప్రవీణ్, అతని కూతురు చైత్రసాయి డెడ్‌బాడీలను పోలీసులు ట్రాక్టర్‌లో వరంగల్ ఎంజీఎం మార్చురీకి తరలించడంపై విమర్శలు వ్యక్తమవు తున్నాయి. తీగరాజుపల్లి నుంచి గ్రేటర్ వరంగల్‌లోని ఎంజీఎం 30 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. జీపు గానీ, అంబులెన్స్ గానీ ఏర్పాటు చేయకుండా.. ట్రాక్టర్‌లో కనీసం దుప్పటి కూడా కప్పకుండా మృతదేహాలను తరలించారు. రోడ్డు మీద ట్రాక్టర్ వెళ్తుండగా, దాని వెనుక వచ్చే వాళ్లంతా చూసి.. డెడ్‌బాడీలను ఇలాగే తరలిస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.