పేదోళ్లకే గుండెజబ్బుల ముప్పు ఎక్కువ
ఉన్నోళ్ల కంటే.. లేనోళ్లకు 50 శాతం ఎక్కువ రిస్క్
రోజూ 6 గంటల కంటే తక్కువ నిద్రపోయినా డేంజరే
స్విట్జర్లాండ్ సైంటిస్టుల రీసెర్చ్
అసలే పేదోళ్లు. ఆపై ఎన్నో సమస్యలు. లేనోళ్లకు ఎప్పుడూ పైసలకు సంబంధించిన ఇబ్బందులే ఎక్కువగా వస్తుంటయి. అందుకే.. ఎంతో మంది పేదోళ్లు రాత్రిపూట కంటి నిండా నిద్రపోయే పరిస్థితి కూడా ఉండటంలేదట. దీనివల్ల వారికి గుండెజబ్బులు వచ్చే ప్రమాదం కూడా పెరుగుతోందని స్విట్జర్లాండ్ సైంటిస్టులు అంటున్నారు. ధనవంతులతో పోలిస్తే.. పేదోళ్లకు గుండెజబ్బుల ముప్పు 50% ఎక్కువగా ఉంటుందని తమ రీసెర్చ్ లో తేలినట్లు వారు చెప్తున్నారు.
6 గంటల కన్నా నిద్ర తగ్గితే డేంజర్..
ధనవంతులు, పేదోళ్లకు గుండెజబ్బుల ముప్పులో తేడా ఉందా? అన్నది తేల్చేందుకు గాను స్విట్జర్లాండ్ లోని ‘యూనివర్సిటీ సెంటర్ ఆఫ్ జనరల్ మెడిసిన్ అండ్ పబ్లిక్ హెల్త్’ సైంటిస్టులు స్విట్జర్లాండ్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, పోర్చుగల్ దేశాలకు చెందిన110,000 మంది వాలంటీర్ల జీతభత్యాలు, వారి నిద్ర సమయం, ఆరోగ్య పరిస్థితులపై పరిశోధన చేశారు. దీంతో ఉన్నోళ్లు, బాగా సంపాదిస్తున్నోళ్లతో పోలిస్తే.. లేనోళ్లు అరకొర సంపాదన ఉన్నోళ్లకు గుండెజబ్బుల రిస్క్ 50% ఎక్కువని తేలింది. తక్కువగా సంపాదిస్తున్న మగవాళ్లలో 48%, ఆడవాళ్లలో 53% ఈ రిస్క్ ఎక్కువని పేర్కొన్నారు. ఇక ప్రతిరోజూ ఆరు గంటల కన్నా తక్కువ సమయం నిద్రపోయేవాళ్లకు గుండెజబ్బులు రిస్క్13.4 % ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
కారణాలు ఇవే..
పేదోళ్లు ఎక్కువగా ఆర్థికపరమైన ఆలోచన చేస్తుంటారని, దీనివల్ల రాత్రిళ్లు సరిగ్గా నిద్రపోలేరని సైంటిస్టులు అంటున్నారు. పేదోళ్లు ఎక్కువగా ఇరుకైన చోట్లలో ఉండటం వల్ల చుట్టుపక్కల శబ్దాల వల్ల నిద్ర పట్టకపోవడం, తరచూ మేలుకోవడం జరుగుతాయన్నారు. చివరకు నిద్రలేమి (ఇన్ సోమ్నియా) బారినపడి బాడీ రీఫ్రెష్ కాకుండా, రోగాలొస్తున్నాయని చెప్తున్నారు. ఇన్ సోమ్నియా వల్ల ప్రతి ముగ్గురిలో ఒకరికి బాడీ ఫంక్షన్స్ సరిగ్గా జరుగుతలేవని రీసెర్చ్‌లో తేల్చారు.