హార్ట్​ఫుల్ మెట్రో .. పైసా తీసుకోకుండా ఫ్రీగా ఆర్గాన్​ ట్రాన్స్​పోర్టేషన్​

హార్ట్​ఫుల్ మెట్రో .. పైసా తీసుకోకుండా ఫ్రీగా ఆర్గాన్​ ట్రాన్స్​పోర్టేషన్​

 ఇప్పటికి ఏడు సార్లు మెట్రోలో గుండె తరలింపు
రోడ్డు మార్గంతో పోలిస్తే సగం సమయం ఆదా
ఎక్కడికి చేరవేయాలో ముందు చెప్తే చాలంటున్న మెట్రో 

హైదరాబాద్ సిటీ, వెలుగు: హైదరాబాద్ మెట్రో.. ప్రయాణికులను వేగంగా, సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే కాదు మనుషుల ప్రాణాలను కాపాడడంలోనూ కీలకపాత్ర పోషిస్తున్నది. అత్యవసర సమయంలో అవయవాల తరలింపు కోసం గ్రీన్ చానెల్(ఏ స్టేషన్​లో ఆగకుండా) ఏర్పాటు చేసి హృదయమున్న మెట్రోగా పేరు తెచ్చుకుంటోంది. ఐదేండ్లలో ఇలా ఏడుసార్లు హృదయాలను తరలించి ఏడుగురు వ్యక్తుల ప్రాణాలను కాపాడింది. ఇదంతా కూడా ఒక్కరూపాయి తీసుకోకుండానే చేసింది. అవయవాలను వేగంగా గమ్యస్థానాలకు చేర్చడంతోపాటు, సామాజిక సేవ చేస్తూ మన్ననలు అందుకుంటోంది. 

చెప్తే చాలు.. చేరవేస్తుంది 

బ్రెయిన్​డెడ్​అయిన వ్యక్తి అవయవాలను జీవన్ దాన్ ద్వారా సేకరించి మరో వ్యక్తికి అమర్చి ప్రాణాలు కాపాడుతూ ఉంటారు. బ్రెయిన్ డెడ్ కేసుల్లో ఎక్కువగా గుండెను దానం చేయడానికి ముందుకు వస్తుంటారు. బ్రెయిన్ డెడ్ అయిన హాస్పిటల్ కు చెందిన వారు ముందస్తు సమాచారం ఇస్తే మెట్రో అధికారులు అరేంజ్​మెంట్స్​ చేసుకుంటారు. స్టార్ట్ అవ్వాల్సిన సమయం, స్టేషన్, చేరుకోవాల్సిన సమయం, స్టేషన్​ తదితర వివరాలు ముందే చెప్పాల్సి ఉంటుంది. 

ఇందులో భాగంగా హాస్పిటల్ కు సమీపంలో ఉన్న మెట్రో స్టేషన్ వరకు అంబులెన్స్ ద్వారా గుండెను తరలించి మెట్రోలోకి చేరుస్తారు. అక్కడి నుంచి గ్రీన్​చానెల్​ద్వారా చేరాల్సిన మెట్రో స్టేషన్ కు వెళ్తారు. అక్కడ రెడీగా ఒక అంబులెన్స్ ను ఏర్పాటు చేసి దిగగానే హాస్పిటల్ కు తరలిస్తారు. డాక్టర్లు, మెట్రో అధికారుల పర్యవేక్షణలో ఆర్గాన్స్​ తరలింపు ​ఉంటుంది. ఆ టైంలో ఒక్క ప్రయాణికుడు కూడా మెట్రోలో ఉండడు. కావాల్సిన ఖర్చునంతా మెట్రోనే భరిస్తుంది.  

రోడ్డు మార్గంలో ట్రాఫిక్ జామ్స్​

రోడ్డు మార్గంలో గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి అవయవాలను తీసుకెళ్లాలంటే 30 కిలోమీటర్లకు 45 నిమిషాల నుంచి గంట వరకు పడుతుంది. పైగా ప్రతి చౌరస్తాలో ట్రాఫిక్​ను ఆపాల్సి ఉంటుంది. సిగ్నల్స్​ దగ్గరే కాకుండా దారి పొడవునా ట్రాఫిక్, సాధారణ పోలీసుల అవసరం ఉంటుంది. దీంతో కిలోమీటర్ల పొడవునా ట్రాఫిక్ ​జామ్ ఏర్పడిన సందర్భాలు ఉన్నాయి. దీనివల్ల అత్యవరసర పనులపై వెళ్లేవారు ఇబ్బందులు పడాల్సి వస్తుంది. ప్రాణాపాయ స్థితిలో ఉండి అంబులెన్స్ లో ఉన్నట్టయితే ట్రాఫిక్​లో ఇరుక్కుపోక తప్పదు. 

మెట్రోనే బెస్ట్​ ఆప్షన్​

మెట్రో రైలులో ఆర్గాన్స్​తీసుకువెళ్తే ట్రాఫిక్​కు సంబంధించిన ఇబ్బందులేమీ ఉండవు. సిగ్నల్స్​, దారి పొడవునా ట్రాఫిక్, సివిల్​పోలీసుల అవసరం ఉండదు. కేవలం మెట్రో లైన్​లో మిగతా రైళ్లను స్లో చేసి, సర్వీసులను అడ్జస్ట్ చేస్తే సరిపోతుంది. రోడ్డు మార్గంతో పోలిస్తే మెట్రోలో వెళ్లడం వల్ల 50 శాతంపైనే టైమ్ సేవ్ చేయవచ్చు. ప్రస్తుతం సిటీలో మెట్రో69 కిలోమీటర్లు అందుబాటులో ఉండగా, ఈ పరిధుల్లో ఎక్కడినుంచి ఎక్కడికైనా ఈజీగా వెళ్లొచ్చు. ఆర్గాన్స్​ట్రాన్స్​పోర్ట్​చేసే ట్రైన్​లో ప్రయాణికులు ఎవరూ ఉండరు. కేవలం డాక్టర్లు, మెట్రో అధికారులు మాత్రమే సహాయంగా ఉంటారు.  

2021లో మెట్రోలో తరలింపు మొదలు

  • మెట్రో గ్రీన్ చానెల్ ఏర్పాటు చేసి హృదయాలను తరలించడం 2021లోనే మొదలైంది. 2021లో ఒకసారి, 2022లో ఒకసారి, 2024లో రెండుసార్లు , 2025లో మూడు సార్లు మెట్రలో గుండెను తరలించారు. 
  •  2021- ఫిబ్రవరిలో ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ నుంచి జూబ్లీహిల్స్ అపోలో హాస్పిటల్ కు 21 కిలోమీటర్ల దూరాన్ని 25 నిమిషాల్లోనే చేరుకుంది. ఇదే రోడ్డు మార్గాన గ్రీన్ చానెల్​ఏర్పాటు చేసి తరలిస్తే 23 కిలోమీటర్లకు కనీసం 40 నుంచి 45 నిమిషాలు పడుతుంది.  


    ఈ ఏడాది జనవరి 17న 13 నిమిషాల్లో ...

 

  • ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ నుంచి లక్డీకాపూల్ లోని గ్లినిగల్స్ హాస్పిటల్​కు తరలించారు. రోడ్డు మార్గాన అయితే 15 కిలోమీటర్లు ఉంటుంది. 25 నిమిషాల టైం పడుతుంది.  
  • మార్చి7న.. ఎల్బీనగర్ కామినేని హాస్పిటల్ నుంచి రసూల్ పురాలోని కిమ్స్ హాస్పిటల్​కు(13కి.మీ.) 12 నిమిషాల్లోనే గుండెను చేర్చారు. రోడ్డు మార్గాన అయితే 18 కిలోమీటర్లు ఉంటుంది. కనీసం 20 నుంచి 25 నిమిషాలు పడుతుంది.

ఆ 5 గంటలే కీలకం..


ఒక వ్యక్తి గుండెను బయటకు తీసి దాన్ని 5 గంటల్లోపే మరో వ్యక్తికి అమర్చాలి. బ్రెయిన్ డెడ్ అయిన వ్యక్తి గుండెను బయటికి తీసే టైంలో ఇంజక్షన్ ఇచ్చి గుండెను ఆఫ్ చేయాల్సి ఉంటుంది. ఏ హాస్పిటల్​లో అయితే గుండెను అమర్చాలో ఆ హాస్పిటల్​కు తరలించిన తర్వాత బ్లడ్ ను పంప్​చేసి మళ్లీ గుండెను రీస్టార్ట్ చేయాల్సి ఉంటుంది. 

– డాక్టర్ అమరేశ్​రావు, కార్డియోథోరాసిక్ హెచ్​వోడీ, నిమ్స్-