నిరుపేద మహిళకు గుండె మార్పిడి

నిరుపేద మహిళకు గుండె మార్పిడి
  •     సక్సెస్​ఫుల్​గా ఆపరేషన్ చేసిన నిమ్స్ డాక్టర్లు
  •     బ్రెయిన్ డెడ్​ అయిన వ్యక్తి నుంచి గుండె సేకరణ

పంజగుట్ట, వెలుగు: నిమ్స్ ఆస్పత్రి డాక్టర్లు విజయవంతంగా గుండె మార్పిడి ఆపరేషన్ నిర్వహించారు. రెండేండ్లుగా హార్ట్ ప్రాబ్లమ్​తో బాధపడుతున్న 29 ఏండ్ల పేందింటి మహిళకు దాత నుంచి సేకరించిన గుండెను సక్సెస్​ఫుల్ గా అమర్చారు. ములుగు జిల్లా ఏటూరునాగారానికి చెందిన షేక్​షానాజ్​కు​గుండె ఎడమ వైపు డైలే టెడ్ కార్డియో మయోపతి సమస్య ఏర్పడింది. దీంతో రక్తాన్ని పంప్ చేయడంలో గుండె పనితీరు మందగించింది.

 గుండె మార్పిడి తప్పనిసరి కావడంతో ఆమె పేరును డాక్టర్లు జీవన్​దాన్​లో నమోదు చేయించారు. సికింద్రాబాద్​లోని యశోదా ఆస్పత్రిలో బ్రెయిన్​ డెడ్​ అయిన ఓ వ్యక్తిని జీవన్​దాన్​ బృందం గుర్తించింది. షానాజ్​ రక్త నమూనాలు అతడి బ్లడ్ శాంపిల్స్ తో సరిపోవడంతో గుండె మార్పిడి చేసేందుకు నిమ్స్ డాక్టర్లు ఏర్పాట్లు చేశారు. కార్డియోథొరాసిక్​ విభాగాధిపతి డాక్టర్ అమరేశ్వరరావు సారథ్యంలో నిమ్స్ డాక్టర్ల టీమ్ గురువారం సక్సెస్​ఫుల్ గా గుండె మార్పిడి చికిత్స పూర్తి చేసింది. 

ఖరీదైన ఆపరేషన్ ఆరోగ్య శ్రీ ద్వారా.. 

దాదాపు రూ.30 లక్షల ఖర్చయ్యే ఈ ఆపరేషన్​ను ఆరోగ్యశ్రీ కింద పూర్తి చేశారు. షానాజ్ భర్త అక్బర్​ స్థానిక సోలార్​ కంపెనీలో పనిచేస్తున్నాడు. వీళ్లకు పాప, బాబు ఉండగా.. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది. ఖరీదైన ఆపరేషన్​ను ఆరోగ్యశ్రీ ద్వారా అందించడంతో వారు నిమ్స్ డాక్టర్లకు కృతజ్ఞతలు తెలిపారు. ఎంతో కష్టంతో కూడిన  గుండె మార్పిడి చికిత్సను విజయవంతంగా పూర్తిచేసిన డాక్టర్లు అమరేశ్వరరావు, గోపాల్, నర్మదా, అర్చన టీమ్​ను నిమ్స్​ డైరెక్టర్​ ప్రొఫెసర్​ ఎన్​.బీరప్ప అభినందించారు.