
ఆదివాసుల ఆత్మబంధువు యాడికెళ్ళెనే...అడవి బిడ్డల తోడునీడ ఏమైపోయెనే... జనప్రియుడేడమ్మా...జనార్దన్ ఏడమ్మా...తన గుండెలాగిపోయినా...మన గుండె చప్పుడాయన...ఈ పాట మన ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్సార్ జీవనశైలిని, తాను ఆదివాసీల కోసం తపించిన తీరును మన కళ్ళకు కడుతుంది. 23 ఏళ్ళ క్రితం సరిగ్గా ఇదేరోజున యావత్ తెలంగాణ ప్రజలను, ముఖ్యంగా ఆదివాసీ సమాజాన్ని అనాథను చేసి మన జనార్దన్ సార్ వెళ్ళిపోయాడు.
ఆదివాసుల ఆత్మబంధువుగా..
1955 అక్టోబర్ 12న మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలోని మునిగలవీడు గ్రామంలో కిషన్‌రావు, అంజనమ్మలకు జన్మించాడు. 1983లో కాకతీయ విశ్వవిద్యాలయంలో చదువును పూర్తిచేసి గిరిజన భూముల పరాయికరణ అనే అంశంపై పరిశోధన చేసి 1985లో పీహెచ్‌డీ పట్టాపొందిన తొలి గిరిజనేతర వ్యక్తిగా నిలిచాడు. ఆదివాసుల ఆపద్బాంధవుడిగా గోదావరి నదీ పరివాహక ప్రాంతంలో అండగా మారాడు.
కాకతీయ విశ్వవిద్యాలయం నుంచి బయలుదేరి అడవంతా కలియతిరుగుతూ ఆదివాసుల హక్కుల కోసం నిరంతరం కొట్లాడాడు. అటవీ సంపదంతా ఆదివాసీలకే దక్కాలని, అవి పరాయీకరణ కాకుండా 1/70 చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలన్నాడు. అధ్యాపకుడిగా ఉంటూనే ఆదివాసీలపై అత్యంత మమకారాన్ని పెంచుకున్నాడు. ఆదివాసీ జీవితానికి సంబంధించిన వివిధ సామాజిక, ఆర్థిక అంశాలపై అనేక ఏళ్ళుగా గిరిజన ప్రాంతాల్లో, గూడాల్లో తిరుగుతూ వారి సమస్యలను ఒక్కొక్కటిగా ఆధ్యయనం చేస్తూ నిరంతరం పరిశోధనను కొనసాగించాడు.
ఆదివాసీల జీవితాలపై థీసిస్
అంతర్జాతీయ సదస్సులలో ఆదివాసీల జీవితాలపై థీసిస్ సమర్పించాడు. కాకతీయలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూనే మలిదశ తెలంగాణ ఉద్యమకారుడిగా, ఆదివాసీల భూసమస్యలు, స్వయంపాలన ఉద్యమాలపై పరిశోధన చేసి వారి సంక్షేమానికి కృషి చేశాడు. 62 జాతీయ సదస్సులలో అమెరికా, జర్మనీ, స్వీడన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో జరిగిన 11అంతర్జాతీయ సెమినార్లలో పాల్గొని పరిశోధనా పత్రాలను సమర్పించాడు. 1993–95లో ‘ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్’న్యూఢిల్లీ పోస్ట్ డాక్టోరల్ ఫెలోగా ఎంపికయ్యాడు.
మలిదశ ఉద్యమకారుడిగా...
తెలంగాణ నీళ్లు, నిధులు, వనరులు, ఉద్యోగాలు తెలంగాణ ప్రజలకే దక్కాలనే నినాదంతో ప్రత్యేక తెలంగాణకు ఆనాడే పోరాటం చేయమన్నాడు. తాను సైతం అందులో భాగమయ్యాడు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో ప్రొఫెసర్ జయశంకర్ సార్‌తో కలిసి అమెరికాలో జరిగిన తానా సభల్లో పాల్గొని ప్రత్యేక తెలంగాణ ఆవశ్యకతను వివరించారు.
సమస్యలన్నీ పరిష్కారం కావాలంటే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఒక్కటే మార్గమని బలంగా నమ్మిన జనార్దన్ సార్.. మేధావులు ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ముందుండాలని, ఆ దిశగా ప్రయత్నం చేశాడు. తెలంగాణపై వివక్ష, అణచివేతలపై అనేక రచనలు చేశారు. మూడుతరాల ప్రతినిధి కాళోజీ, జయశంకర్ సార్‌లతో కలిసి తెలంగాణ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు.
2001లో తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పాటులో కీలకపాత్ర పోషించాడు. 2002 ఫిబ్రవరి 27న జనార్దన్ సార్ కన్నుమూశారు. ఆయనకు స్వరాష్ట్రంలో ఇప్పటివరకు సముచిత స్థానం దక్కలేదు. ఇకనైనా సార్ సేవలను గుర్తించి వరంగల్ జిల్లా కేంద్రంలో స్మారక చిహ్నం, భవిష్యత్తు తరాలకు సార్ చరిత్ర తెలిసేలా ప్రభుత్వం చొరవ చూపాలి.
- కలువకొలను హరీశ్,జర్నలిస్ట్