ఆఫ్ఘనిస్తాన్ యువ స్పిన్నర్ వకార్ సలాంఖీల్.. ఐపీఎల్ స్టార్ ప్లేయర్, శ్రీలంక ఆల్‌రౌండర్ వనిందు హసరంగా పట్ల అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఔట్ చేశానన్న ఆనందంలో అతనితో దురుసుగా ప్రవర్తించాడు. కళ్లు పెద్దవి చేస్తూ అతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు.
ఏం జరిగిందంటే..?
ఇంటర్నేషనల్ టీ20 లీగ్ లో భాగంగా ఆదివారం (జనవరి 4) ఎంఐ ఎమిరేట్స్, డెసర్ట్ వైపర్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘన్ స్పిన్నర్ వకార్ సలాంఖీల్.. వైపర్స్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగాతో వాగ్వావాదానికి దిగాడు. పవర్‌ప్లే ముగిసిన అనంతరం బంతిని చేతికందుకున్న సలాంఖీల్.. ఆ ఓవర్ చివరి బంతికి హసరంగాను క్యాచ్ ఔట్ చేశాడు. ఆ ఆనందంలో అతని పట్ల అమర్యాదగా ప్రవర్తించాడు. 'ఆడింది చాలు.. ఇక పెవిలియన్‌కు వెళ్లు..' అన్నట్లుగా కళ్లు పెద్దవి చేస్తూ అతన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. అందుకు హసరంగా కూడా ధీటుగా బదులిచ్చాడు. నా ముందు నువ్వొక బచ్చా.. ఇలాంటివి ఆపితే మంచిది అన్నట్లు మాట్లాడాడు. చివరకు ఎమిరేట్స్ ఆటగాళ్లు కల్పించుకొని సలాంఖీల్ ని పక్కకు తీసుకెళ్లడంతో ఈ వివాదం సద్దుమణిగింది. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
సలాంఖీల్ ప్రవర్తన పట్ల క్రికెట్ అభిమానులు మండిపడుతున్నారు. పులిముందు ఆటలొద్దు.. అతను ఎస్ఆర్‌హెచ్ ప్లేయర్ అంటూ తెలుగు డైలాగులు పేలుస్తున్నారు. ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే.. వైపర్స్ పై ఎమిరేట్స్ 30 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన ఎంఐ 188 పరుగుల భారీ స్కోర్ చేయగా.. ఛేదనలో 158 పరుగులకే పరిమితమైంది.