జెంటిల్‌మెన్ గేమ్‌గా పిలవబడే క్రికెట్ లో వివాదాలు, ఆటగాళ్ల మద్య గొడవలు కొత్తేమీ కాదు, కాకపోతే, గతంలో అవి ఏస్థాయి వరకు ఉండాలో.. అక్కడికే పరిమితమయ్యేవి. కానీ, ఇప్పటి క్రికెటర్లు పరిధి దాటిపోతున్నారు. నోరుంది కదా అని ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లపై కయ్యానికి కాలు దువ్వుతున్నారు. స్లెడ్జింగ్ అనే పేరుతో మైదానంలోనే ప్రత్యర్ధిపైకి దూసుకెళ్లి బాహీ బాహీకి దిగుతున్నారు. గత నాలుగైదేళ్లలో వెలుగు చూసిన అలాంటి ఘటనలు కోకొల్లలు.
టీ20 ప్రపంచకప్ 2024లో భాగంగా సోమవారం(జూన్ 17) బంగ్లాదేశ్- నేపాల్ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఆటగాళ్లు మైదానంలో మాటల యుద్ధానికి దిగారు. తొలుత బ్యాటింగ్ బంగ్లాదేశ్ 106 పరుగులకు పరిమితమవ్వగా.. ఛేదనలో నేపాల్ ఆదిలోనే తడబడింది. బంగ్లాదేశ్ వర్ధమాన స్పీడ్‌స్టర్ తాంజిమ్ హసన్ నిప్పులు చేరగడంతో 4.2 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయింది. అదే ఇరు జట్ల ఆటగాళ్ల మధ్య గొడవకు కారణమైంది.
గుడ్ లెంగ్త్ బాల్స్‌తో నేపాల్ బ్యాటర్లను బెంబేలెత్తించిన తాంజిమ్ హసన్.. కాస్త అత్యుత్సాహం ప్రదర్శించాడు. కంటి చూపుతు చంపేస్తా అనేలా.. నేపాల్ కెప్టెన్ రోహిత్ పాడెల్‌తో మాటల యుద్ధానికి తెరదీశాడు. అందుకు నేపాల్ సారథి ధీటుగానే బదులిచ్చాడు. బంగ్లా బౌలర్ మీదకు దూసుకెళ్లాడు. ఆ సమయంలో లిట్టన్ దాస్, అసిఫ్ షేక్, ఆన్-ఫీల్డ్ అంపైర్లు సామ్ నోగాజ్‌స్కీ, అహ్సన్ రజా జోక్యం చేసుకొని గొడవను శాంతింపజేయశారు. ఈ ఘటనతో స్టేడియంలో కాస్త ఉద్రిక్త వాతావరణం కనిపించింది.
ఇక ఈ మ్యాచ్ విషయానికొస్తే, బంగ్లా నిర్ధేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని నేపాల్ చేధించలేకపోయింది. 19.2 ఓవర్లలో 85 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది.