
- బీఆర్ఎస్ సర్వేలో ఓసీలు 21%.. మా సర్వేలో 15 శాతానికి తగ్గింది
- 2014లో బీసీ జనాభాను 51 శాతంగా చూపితే.. కులగణన సర్వేలో ఆ సంఖ్య 56 శాతానికి పెరిగింది
- అనుమానాలు ఉంటే నివృత్తి చేయడానికి రెడీ
- ప్రజల్లో అనవసరంగా అపోహలు సృష్టించొద్దు
- సర్వే రిపోర్ట్ను అందరికీ అందుబాటులో ఉంచుతామని వెల్లడి
హైదరాబాద్, వెలుగు: కులగణన సర్వేపై బీఆర్ఎస్ , బీజేపీ తప్పుడు ప్రచారం చేస్తున్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ మండిపడ్డారు. 2014లో బీఆర్ఎస్ చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీ జనాభా 51 శాతం వచ్చిందని, కానీ తమ ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేలో 56 శాతంగా ఉందని తెలిపారు. బీఆర్ఎస్ చేసిన సర్వే కంటే తాము చేసిన సర్వేలో బీసీ జనాభా పెరిగిందన్నారు.
బీఆర్ఎస్ సర్వేతో పోలిస్తే తాము చేపట్టిన కులగణనలో ఓసీల సంఖ్య తగ్గిందని వివరించారు. ‘‘అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేలో ఓసీలు 21 శాతం. అది ఇప్పుడు 15 శాతానికి తగ్గింది. గణాంకాలు ఇంత స్పష్టంగా ఉంటే ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయి” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం కులగణన సర్వేపై అసెంబ్లీలో ప్రతిపక్షాలకు ఆయన కౌంటర్ ఇచ్చారు.
మీరా విమర్శించేది?
సద్విమర్శలను హుందాగా స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, తప్పులు గుర్తిస్తే సరిదిద్దుకోవడంలో వెనక్కిపోమని మంత్రి ఉత్తమ్ తెలిపారు. ప్రతిపక్షాలకు అనుమానాలు ఉంటే ప్రజెంటేషన్ ద్వారా నివృత్తి చెయ్యడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ఈ తరహా సామాజిక ఆర్థిక, విద్య, ఉద్యోగ, రాజకీయ, కులగణన సర్వే యావత్ భారతదేశంలో ఎక్కడా జరగలేదని ఆయన తెలిపారు. ఓటర్ల సంఖ్యతో సర్వే సంఖ్యను పోల్చలేమని, ఓటర్ల లిస్టు ప్రకారం గ్రామాల్లో ఉన్నవారే హైదరాబాద్‌లోనూ ఉంటారని అన్నారు.
‘‘కేసీఆర్ హయాంలో సర్వే రిపోర్ట్ వచ్చినట్లు ఎమ్మెల్యేగా ఉన్న నాకే తెలియలేదు. ఇక ప్రజలకు ఎలా తెలుస్తుంది? బీజేపీ ఏ రాష్ట్రంలోనూ ఇప్పటివరకూ కులగణన చేయలేదు. అలాంటి వారు ఇక్కడ విమర్శలు చేస్తున్నారు” అని మండిపడ్డారు. తాము చేపట్టిన కులగణన సర్వే ఒక జిరాక్స్ లాగా ఉపయోగపడుతుందని, అన్ని రకాల సంక్షేమ పథకాల అమలుకు ఈ రిపోర్ట్ వినియోగించుకోవచ్చని తెలిపారు. కులగణన క్రెడిట్ అంతా సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకే ఇవ్వాలని అన్నారు. సర్వే రిపోర్టును అందరికీ అందుబాటులో ఉంచుతామని ఉత్తమ్ వివరించారు.
‘‘సామాజిక న్యాయానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. కాంగ్రెస్ పార్టీ అధినేత, లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ స్ఫూర్తితో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం సామాజిక ఆర్థిక,విద్య, ఉద్యోగ,రాజకీయ కులగణన సర్వే నిర్వహించింది. సర్వే భారీ స్థాయిలో జరిగిన కసరత్తు. క్రమశిక్షణతో, నిబద్దతతో నిర్వహించాం. ప్రతిపక్షాలు అంకెల గారడీతో అనవసరంగా ప్రజల్లో అపోహలు, అనుమానాలు సృష్టించొద్దు” అని ఆయన సూచించారు.