
- అసెంబ్లీలో బీసీ బిల్లుపైవాడీవేడి చర్చ
- బిల్లుపై సందేహాలు ఉన్నాయన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే
- రాజకీయం మళ్లీ చేసుకుందామన్న మంత్రి పొన్నం
- బిల్లుకు మద్దతు ఇవ్వాలని రిక్వెస్ట్
హైదరాబాద్, వెలుగు: బీసీ బిల్లుపై కొన్ని సందేహాలు ఉన్నాయని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద అన్నారు. కుల గణనలో ప్రభుత్వ తొందరపాటు కనిపించిందని తెలిపారు. డెడికేటెడ్ కమిషన్ ఏర్పాటు విషయంలో బీసీ మేధావుల సూచనలు ఎందుకు పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అసెంబ్లీలో బీసీ బిల్లుపై చర్చ సందర్భంగా కేపీ వివేకానంద మాట్లాడారు. మంత్రి పొన్నం ప్రభాకర్ కల్గజేసుకుని బిల్లుకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని రిక్వెస్ట్ చేశారు.
రాజకీయాల గురించి తర్వాత మాట్లాడుకుందాం. బీసీ బిల్లుపై ఏమైనా సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వండి. మీరు మాట్లాడే విధానం చూస్తే ప్రజల్లో అపోహలు, అనుమానాలు తావిచ్చేలా ఉన్నాయి’’అని పొన్నం అన్నారు. అనంతరం కేపీ వివేకానంద స్పందిస్తూ.. ‘‘కేంద్రంలో రాజ్యాంగ సవరణ ద్వారానే అమలు సాధ్యపడుతుంది. ఒక తమిళనాడు మినహా మిగితా రాష్ట్రాల్లో ఆచరణ సాధ్యం కాలేదు. ప్రభుత్వం ముందే అఖిలపక్షం సమావేశం ఏర్పాటు చేసుంటే బాగుండేది. చాలా మంది ప్రొఫెసర్లు, మేధావులు కులగణన శాస్త్రీయంగా లేదని అన్నారు. లోపాలను సవరించే ప్రయత్నం చేయాలి. ఏం చేస్తే బాగుంటుందో న్యాయ నిపుణులతో చర్చించి ముందుకు పోవాలి’’అని కేపీ వివేకానంద అన్నారు. దీంతో మళ్లీ మంత్రి పొన్నం కల్గజేసుకుని..
ఇది ఎంతో ముఖ్యమైన బిల్లు. వినమ్ర పూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్న.. బిల్లుకు మద్దతు తెలిపి సహకరించండి. శాపనార్థాలు, పిల్లి శకునాలు పెట్టకండి. రాజకీయాలు తర్వాత మాట్లాడుకుందాం’’అని తెలిపారు. వివేకానంద స్పందిస్తూ.. ‘‘బిల్లుకు సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాం. ఈ బిల్లు పాస్ కావాలని దేవున్ని ప్రార్థిస్తున్న. కేంద్రంపై కొట్లాడాలంటే అందరూ కలిసికట్టుగా పోవాలి’’అని అన్నారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు బీసీ బిల్లు సందర్భంగా చర్చలో పాల్గొన్నారు.
ఇబ్బందులు తలెత్తకుండా ముందుకుపోతున్నం: మంత్రి పొన్నం
అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు ప్రవేశపెట్టడం చరిత్రాత్మకం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బిల్లుకు కేంద్రం మద్దతు తెలియజేయాలని కోరారు. రాజ్యాంగ సవరణ ద్వారా తమిళనాడులో 68 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని తెలిపారు. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ముందుకు పోతున్నామన్నారు. 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం వచ్చిందని, ఇది ప్రారంభం మాత్రమే అని.. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయని తెలిపారు. రాజకీయ పార్టీలన్నీ బిల్లుకు మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు.
బీఆర్ఎస్ అపరిచితుడు లెక్క ప్రవర్తిస్తున్నది: సీతక్క
బీసీ రిజర్వేషన్ల బిల్లు విషయంలో అపరిచితుడు సినిమాలో మాదిరి బీఆర్ఎస్ తన వైఖరి మారుస్తూ వస్తున్నదని మంత్రి సీతక్క మండిపడ్డారు. ‘‘పొద్దున రాము.. రాత్రి రెమో మాదిరి ప్రవర్తిస్తున్నది. ఉదయం రిజర్వేషన్ల పెంపు బిల్లుకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సాయంత్రానికి సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. మేము చేపట్టిన కుల గణనను బీఆర్ఎస్ నేతలు ముందు నుంచే వ్యతిరేకిస్తున్నారు. పదేండ్లు అధికారంలో ఉండి మైనార్టీ, ఎస్టీ రిజర్వేషన్లను పెంచలేదు. అధికారం కోల్పోయే ముందు ఎస్టీ రిజర్వేషన్లను పెంచినట్లు డ్రామాలు ఆడుతున్నారు’’అని సీతక్క అన్నారు.
కుల గణన సర్వే సక్సెస్ అయింది: బీర్ల అయిలయ్య
కుల గణన సర్వే రాష్ట్రంలో సక్సెస్ అయిందని ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు. యావత్ దేశం తెలంగాణ వైపు చూస్తున్నదని తెలిపారు. ‘‘కుల గణన ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎంతో ఉపయోగపడుతుంది. ఈ బిల్లుతో బీసీలకు మేలు జరుగుతుంది. అందరూ సపోర్ట్ చేయాలి. కల్వకుంట్ల కుటుంబమే బీసీ కుల గణనలో పాల్గొనలేదు. ప్రజలపై ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతున్నది’’అని ఆయన అన్నారు. బీసీలను బీఆర్ఎస్ అణిచి వేసిందని ఫైర్ అయ్యారు.
అన్ని పార్టీలను కలుపుకుని పోతాం: వాకిటి శ్రీహరి
పార్లమెంట్, అసెంబ్లీ, చట్టసభల్లో 90 శాతం వెనుకబడిన వర్గాల ప్రజలు అడుగుపెట్టలేదని ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో అవకాశాలు కల్పించే విషయంలో ఎలాంటి తెగింపుకైనా తాను సిద్ధమన్నారు. ‘‘ప్రతిష్టాత్మకమైన బీసీ బిల్లు ప్రవేశపెట్టడం చారిత్రాత్మక నిర్ణయం. పార్టీలకతీతంగా భేషజాలాలకు పోకుండా బీసీ బిల్లుకు మద్దతు తెలపాలి. రాష్ట్ర ప్రభుత్వం శాస్త్రీయంగా కులగణన చేపట్టింది’’అని ఆయన అన్నారు. బీసీ బిల్లు అమలు కోసం అన్ని పార్టీలను కలుపుకుని పోతామని తెలిపారు. బీసీ బిల్లు కోసం అందరూ సహకరించాలని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ కోరారు.
బిల్లు పెట్టడం వెనుక ఎంతో కసరత్తు చేశాం: భట్టి
బీసీ బిల్లును సాదరంగా స్వాగతిస్తున్నామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు. ఈ బిల్లును ఏకగీవ్రంగా పాస్ చేయడానికి సపోర్ట్ చేశారని తెలిపారు. బిల్లు పెట్టడం వెనుక సుదీర్ఘ ప్రయాణం, కసరత్తు ఉందన్నారు. బడుగు, బలహీనవర్గాలు, వెనుకబడిన తరగతులు, కులాలు, షెడ్యూలు తెగలకు సామాజిక, ఆర్థిక, రాజకీయ అవకాశాలు కల్పించేలా కులగణన చేపట్టినట్లు చెప్పారు. మొదటి సారి సర్వేలో పాల్గొననివారి కోసం మళ్లీ సర్వే చేశామని తెలిపారు.
ఇబ్బందులు తలెత్తకుండా ముందుకుపోతున్నం: మంత్రి పొన్నం
అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ల పెంపు బిల్లు ప్రవేశపెట్టడం చరిత్రాత్మకం అని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. బిల్లుకు కేంద్రం మద్దతు తెలియజేయాలని కోరారు. రాజ్యాంగ సవరణ ద్వారా తమిళనాడులో 68 శాతం రిజర్వేషన్లు అమలవుతున్నాయని తెలిపారు. న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా ముందుకు పోతున్నామన్నారు. 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అవకాశం వచ్చిందని, ఇది ప్రారంభం మాత్రమే అని.. భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు వస్తాయని తెలిపారు. రాజకీయ పార్టీలన్నీ బిల్లుకు మద్దతు తెలపడం సంతోషంగా ఉందన్నారు.