- భువనగిరి పార్లమెంట్లో ఏడు అసెంబ్లీ స్థానాలు
- వాటిలో రెండు ఇవ్వాలంటున్న బీసీ లీడర్స్
- కానీ ఒక్కటైనా వస్తదా? లేదా? అనే అనుమానాలు
యాదాద్రి, వెలుగు: కాంగ్రెస్‌లో బీసీలకు టికెట్లపై యాదాద్రి జిల్లాలో జోరుగా చర్చ నడుస్తోంది. భువనగిరి లోక్‌సభ నియోజకవర్గంరంగారెడ్డి, నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, జనగామ జిల్లాల్లో విస్తరించి ఉంది. ఈ పార్లమెంట్ పరిధిలోని ఏడు స్థానాల్లో తుంగతుర్తి, నకిరేకల్ ఎస్సీ రిజర్వు స్థానాలు కాగా ఇబ్రహీంపట్నం, మునుగోడు, భువనగిరి, ఆలేరు, జనగామ జనరల్ సీట్లు. ప్రస్తుతం ఈ పార్లమెంట్ పరిధిలోని అన్ని స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. కాగా కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి తిరిగి కాంగ్రెస్‌లో చేరడంతో భువనగిరి పార్లమెంట్లో బీసీలకు రెండు సీట్లు ఇస్తారా? మారిన పరిస్థితుల్లో ఒక్కటైనా దక్కుతుందా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఆయా చోట్ల ఇది పరిస్థితి..
రంగారెడ్డి జిల్లాలోని ఇబ్రహీంపట్నంలో కాంగ్రెస్ తరపున మల్రెడ్డి రంగారెడ్డి కీలకంగా ఉన్నారు. 2018 ఎన్నికల్లో మహాకూటమిలో భాగంగా టీడీపీకి చెందిన సామ రంగారెడ్డికి టికెట్ దక్కడంతో కాంగ్రెస్ లీడర్ మల్రెడ్డి రంగారెడ్డి బీఎస్పీ తరపున పోటీ చేసి రెండో స్థానంలో నిలిచారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరిన మల్రెడ్డి రంగారెడ్డి టికెట్ఆశిస్తున్నారు.
నల్గొండ, యాదాద్రి జిల్లాలోని మునుగోడులో గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పోటీ చేసి గెలిచారు. అనంతరం బీజేపీలో చేరిన ఆయన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. ఆ తర్వాత జరిగిన ఉప ఎన్నికలో కాంగ్రెస్ తరపున పాల్వాయి స్రవంతి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు ఈ స్థానం కోసం పాల్వాయి స్రవంతితో పాటు చల్లమల్ల కృష్ణారెడ్డి పోటీ పడుతున్నారు. అయితే కాంగ్రెస్‌తో కమ్యూనిస్టులు పొత్తు కుదుర్చుకుంటే ఈ సీటు సీపీఐ ఖాతాలోకి వెళ్లే అవకాశముంది. ఏదేమైనా మునుగోడులో బీసీలకు టికెట్ ఇచ్చే అవకాశం కనిపించడం లేదు.
యాదాద్రి జిల్లాలోని భువనగిరిలో గడిచిన రెండు నెలల్లో తలెత్తిన రాజకీయ పరిస్థితుల కారణంగా రెడ్డి సామాజిక వర్గానికే టికెట్ దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. భువనగిరి టికెట్ బీసీలకే ఇస్తారని ప్రచారం జరగడం, ఎంపీ కోమటిరెడ్డితో ఉన్న విభేధాల కారణంగా డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి బీఆర్ఎస్లో చేరారు. ఆ తర్వాత బీజేపీ నుంచి బహిష్కరణకు గురైన జిట్టా బాలక్రిష్ణారెడ్డి కాంగ్రెస్‌లో చేరడంతో టికెట్ ఆయనకే ఇస్తారంటూ ప్రచారంలోకి వచ్చింది. అనంతరం పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఇతర ముఖ్య లీడర్లు రంగంలోకి దిగి కుంభం అనిల్‌కుమార్ రెడ్డికి నచ్చజెప్పి తిరిగి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. దీంతో భువనగిరి టికెట్‌ను బీసీ సామాజిక వర్గాలకు చెందిన పలువురు లీడర్లు ఆశిస్తున్నా.. చివరకు అనిల్ కుమార్‌రెడ్డికే దక్కే అవకాశం కనిపిస్తోంది.
ఆలేరు, జనగామ అసెంబ్లీ స్థానాల్లో బీసీ లీడర్లతో పాటు ఎస్సీ, రెడ్డి సామాజిక వర్గానికి చెందిన లీడర్లు పోటీ పడుతున్నారు. ఆలేరులో గడిచిన మూడు ఎన్నికల్లో అప్పుడు కాంగ్రెస్‌లో ఉన్న బీసీ సామాజిక వర్గానికి చెందిన బూడిద భిక్షమయ్య గౌడ్‌కు టికెట్ ఇవ్వగా ఒక్కసారి గెలిచి రెండుసార్లు ఓడిపోయారు. ఇప్పుడు కూడా బీసీ లీడర్లలో ఎంపీ కోమటిరెడ్డి ఆశీస్సులున్న బీర్ల అయిలయ్య, డీసీసీ అధ్యక్షుడు అండెం సంజీవరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేశ్, పీసీసీ అధికార ప్రతినిధి బోరెడ్డి అయోధ్యరెడ్డి, కల్లూరి రాంచంద్రారెడ్డి, బండ్రు శోభారాణి పోటీ పడుతున్నారు. వీరిలో ఎవరికి వారే తాము బీ ఫారం తెచ్చుకుంటామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.
జనగామలో గడిచిన రెండు ఎన్నికల్లో మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య, ఆయన కోడలు వైశాలి పోటీ చేసి ఓడిపోయారు. ఇప్పుడు పొన్నాల లక్ష్మయ్యతో పాటు డీసీసీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి పోటీ పడుతున్నారు. ఢిల్లీ స్థాయిలో తనకున్న పలుకుబడితో టికెట్ తెచ్చుకుంటానని పొన్నాల ధీమా ఉండగా, పీసీసీ ముఖ్యుల సహకారంతో డీసీసీ సాధించినట్టుగానే టికెట్ తెచ్చుకుంటానని కొమ్మూరి ధీమా వ్యక్తం చేస్తున్నారు.
రెండింటిలో ఒక్కటైనా..
ఇప్పుడున్న పరిస్థితుల ఆధారంగా నల్లగొండ పార్లమెంట్ పరిధిలో రిజర్వుడ్ స్థానాలు పోగా బీసీలకు అవకాశమే లేకుండా పోయింది. భువనగిరి పార్లమెంట్పరిధిలోని రిజర్వుడ్ స్థానాలు పోగా మిగిలిన ఐదింటిలోని మూడు స్థానాల్లో అవకాశమే కనిపించడం లేదు. ఆలేరులో తాను బీ ఫారం తెచుకుంటానని మాజీ ఎమ్మెల్యే కుడుదుల నగేశ్(ఎస్సీ) ధీమాగా చెబుతున్నారు. జనగామలో డీసీసీ అధ్యక్ష పదవి సాధించిన కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి తానే టికెట్ తెచ్చుకుంటానని చెబుతున్నారు. ఈ పరిణామాలు గమనిస్తుంటే బీసీలకు టికెట్ దక్కడం అంత ఆషామాషిగా లేదని పలువురు కాంగ్రెస్ లీడర్లు అభిప్రాయపడుతున్నారు. రెండు టికెట్ల సంగతేమో కానీ ఒక్కటైనా దక్కుతుందా? అని అనుమానపడుతున్నారు.