తెలంగాణలో మండే ఎండలు: ఈ జిల్లాల్లో అవసరం అయితేనే జనం బయటకు రండి..!

తెలంగాణలో మండే ఎండలు: ఈ జిల్లాల్లో అవసరం అయితేనే జనం బయటకు రండి..!

హైదరాబాద్: మార్చి 13 నుంచి తెలంగాణలో ఎండలు కాక పుట్టించనున్నాయి. వేడి గాలులతో, వడగాల్పులతో వాతావరణం మార్చిలోనే మే నెల ఎండలను తలపించనుంది. హైదరాబాద్ నగరంలో పగటి పూట ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకూ నమోదు కానున్నాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, యాదాద్రి, మెదక్, సిద్ధిపేట్, సిరిసిల్ల, కామారెడ్డి, జనగామ, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, సూర్యాపేట జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 39 డిగ్రీల నుంచి 41 డిగ్రీల వరకూ నమోదు కానుంది.

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, నిజామాబాద్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, నారాయణ్ పేట్, వనపర్తి, గద్వాల్ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీల నుంచి 43 డిగ్రీల సెల్సియస్ వరకూ నమోదవుతుందని వాతావరణ శాఖ వర్గాలు తెలిపాయి.
 

ఇప్పటికే ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఎండలు మండుతున్నాయి. వేసవికాలం ప్రారంభమైన మొదట్లోనే టెంపరేచర్ 40 డిగ్రీలకు చేరువలో ఉంది. మరో రెండు నెలలు వేసవి కాలం ఉండడంతో ప్రస్తుత ఉష్ణోగతలను చూసి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి ఎండలు ఎక్కువగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. గత మూడునాలుగు రోజుల నుంచి సూర్యాపేట జిల్లాలో నాలుగు ప్రాంతాల్లో 38 డిగ్రీలకు పైగా, 10 ప్రాంతాల్లో 37 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరోవైపు వర్షాభావ పరిస్థితుల కారణంగా బోరుబావుల్లో నీరు తగ్గిపోయి పంటలు ఎండిపోతున్నాయి.

Also Read:-హైదరాబాద్లో కిరాణా షాపుల్లో నూనె కొంటున్నారా..?

ఏప్రిల్, మే నెలల్లో సాధారణంగా 35 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. కానీ మార్చి రెండో వారంలోనే 35 డిగ్రీలకు చేరుకొని ఆ తర్వాత 40కి అటు ఇటుగా నమోదవుతుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మార్చి 4న 39.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అంతకుముందు వారం రోజులుగా సాధారణ ఉష్ణోగ్రతలు ఉన్నాయి. ఈనెల 1న 33 డిగ్రీలు, 2న 35 డిగ్రీలు, 3న మరో రెండు డిగ్రీలు పెరిగి 37కు చేరింది. ఈనెల 4న ఏకంగా 39.9 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. బుధవారం నాలుగు మండలాల్లో 38.03 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఎండాలను చూస్తున్న జనం రానున్న రోజుల్లో ఎలా ఉంటుందోనని భయపడుతున్నారు.