
- అత్యధికంగా నిజామాబాద్ జిల్లా సీహెచ్ కొండూరులో 45.3 డిగ్రీలు
- ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాలలో 45 డిగ్రీలకుపైగానే నమోదు
- ఏడు జిల్లాలకు రెడ్అలర్ట్.. రేపటి నుంచి కాస్తంత తగ్గే చాన్స్
- మూడు రోజుల పాటు ఈదురుగాలులతో కూడిన వర్షాలు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎండలు మంట పుట్టిస్తున్నాయి. టెంపరేచర్లు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ ఎండాకాలంలో తొలిసారిగా గురువారం 45 డిగ్రీల మార్కును దాటేశాయి. నాలుగు జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా, మరో 9 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా నిజామాబాద్ జిల్లా సీహెచ్ కొండూరులో 45.3 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లా తాంసి, నిర్మల్ జిల్లా కుబీర్‌లో 45.2 డిగ్రీలు, మంచిర్యాల జిల్లా బీమినిలో 45 డిగ్రీల టెంపరేచర్లు నమోదయ్యాయి. జగిత్యాల జిల్లా మారేడుపల్లి, కుమ్రంభీం ఆసిఫాబాద్‌జిల్లా తిర్యాణీల్లో 44.9, జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్, కామారెడ్డి జిల్లా సోమూరు, నల్గొండ జిల్లా కామారెడ్డిగూడెంలో 44.8 డిగ్రీలు, కరీంనగర్ జిల్లా నుస్టులాపూర్లో 44.7, పెద్దపల్లి జిల్లా సుగ్లాంపల్లిలో 44.5, మెదక్ జిల్లా పొడిచనపల్లిలో 44.3, రాజన్నసిరిసిల్ల జిల్లా పెద్దూరులో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మరో 9 జిల్లాల్లో 43 నుంచి 43.8 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కాగా.. 11 జిల్లాల్లో 42 నుంచి 42.9 డిగ్రీల టెంపరేచర్లు రికార్డయ్యాయి.
హైదరాబాద్ సిటీలోనూ ఎండ పెరుగుతున్నది. బోయిన్‌పల్లిలో 42.1, బేగంబజార్‌లో 42 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా, రాష్ట్రంలో రాత్రి ఉష్ణోగ్రతలు కూడా పెరుగుతున్నాయి. హైదరాబాద్, మంచిర్యాల జిల్లాల్లో 26 డిగ్రీలకన్నా ఎక్కువ టెంపరేచర్లు నమోదయ్యాయి. జోగుళాంబ గద్వాల, వనపర్తిలో 25 డిగ్రీల మేర రికార్డయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ 21 డిగ్రీలకన్నా ఎక్కువగానే రాత్రి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.
మూడు రోజుల్లో వానలు పడ్తయ్
రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు కాస్తంత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం మాత్రం ఏడు జిల్లాల్లో వడగాడ్పులు తీవ్రంగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. దీంతో ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్నసిరిసిల్ల జిల్లాలకు రెడ్అలర్ట్జారీ చేసింది. రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, యాదాద్రి జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేయగా.. మిగతా జిల్లాలకు ఆరెంజ్అలర్ట్ను ఇష్యూ చేసింది. ఆ తర్వాత రెండు రోజులకుగానూ ఉత్తర తెలంగాణ జిల్లాలకు ఆరెంజ్అలర్ట్.. దక్షిణ తెలంగాణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ వార్నింగ్ఇచ్చింది. అయితే, శుక్రవారం నుంచి మూడు రోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములతో కూడిన మోస్తరు వర్షాలు పడుతాయని తెలిపింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది. శుక్రవారం కొన్ని జిల్లాలు.. శని, ఆదివారాలు రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలుంటాయని పేర్కొంది..