ఇటీవల దేశవ్యాప్తంగా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. ఢిల్లీ వంటి నగరాలలో దాదాపు 50 డిగ్రీలకు చేరాయి. ఇవి సగటు ఉష్ణోగ్రతలు. ఆయా ప్రాంతాలలో స్థానిక పరిస్థితులను బట్టి ఉష్ణోగ్రతలు ఇంకా ఎక్కువ ఉండవచ్చు. కనీసం 55 డిగ్రీల వరకు ఉండొచ్చు అని అంచనా. సిమెంటు నిర్మాణాలు, అధిక సాంద్రతతో కట్టడాలు, ఖాళీ ప్రదేశాలు లేనిచోట స్థానికంగా వేడి ఎక్కువగా ఉంటుంది.
ఎయిర్ కండిషనర్లు, మెషినరీలు, బాయిలర్లు ఎక్కువగా ఉన్న చోట కూడా పరిసర ప్రాంతాల్లో వేడి ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా ఉష్ణోగ్రత పగలు ఎక్కువగా, రాత్రి తక్కువగా ఉంటుంది. అయితే ఈ మధ్య రాత్రి కూడా ఉష్ణోగ్రతలు పెరిగాయి.
రాత్రి వేళకి వేడి నుంచి ఉపశమనం కలిగే పరిస్థితులు తగ్గుతున్నాయి.
చా లా కుటుంబాలు ఫ్యాన్లు, కూలర్లు, ఎయిర్ కండిషనర్లు వాడుతున్నారు. అయితే, ఆర్థిక స్తోమత, వసతులు లేని కుటుంబాలు మన దేశంలో అసంఖ్యాకంగా ఉన్నాయి. వారికి ఇటీవలి అధిక ఉష్ణోగ్రతలు పెనుప్రమాదంగా మారినాయి. వాతావరణంలో ఏర్పడుతున్న విపరీత మార్పుల వల్ల గత 9 ఏండ్లలో ప్రతి ఏటా వేడి పెరుగుతున్నది. అధిక వేడితో ఉండే రోజుల సంఖ్య పెరుగుతున్నది.
అధిక ఉష్ణోగ్రత మరణాల లెక్కల్లో తేడాలు
నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (NCRB), భారత వాతావరణ విభాగం (IMD), కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖలు అధిక ఉష్ణోగ్రతల వల్ల మరణాలను లెక్కిస్తాయి. అయితే, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సమర్పించిన 2015-– -2023 నుంచి అధికారిక డేటాను నిశితంగా పరిశీలిస్తే, ఈ సంస్థల మరణాల సమాచారం మధ్య వ్యత్యాసాలు కనిపిస్తాయి. ఆరోగ్య మంత్రిత్వ శాఖ జులై 23, 2023న లోక్‌సభకు ఇచ్చిన డేటా ప్రకారం, జూన్ 30, 2023 నాటికి 14 రాష్ట్రాల్లో కనీసం 264 మంది మరణించారు.
ఇందులో 120 మరణాలు కేరళలో నమోదు అయ్యాయి. గుజరాత్‌లో కూడా 35 మరణాలు రికార్డు అయ్యాయి. అయితే, 2015-–2023 కాలానికి సంబంధించిన మరణాల సంఖ్య NCRB, IMD, మీడియా నివేదికలలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఇచ్చిన డేటాకు విరుద్ధంగా ఉన్నాయి.
ఈ ఏడాది మరింతగా పెరిగిన మరణాలు
ఈ సంవత్సరం జూన్ నెలలోనే 1,643 పైగా మరణాలు, 25 వేల మందికి పైగా ఆసుపత్రిలో చేరిన విషయం పెరుగుతున్న సమస్య తీవ్రతకు అద్దం పడుతోంది. ఢిల్లీలో ఆసుపత్రులు బాధితులతో నిండిపోయినాయి. నిజమైన మరణాల సంఖ్య వేలల్లో ఉండవచ్చు. మరణ ధృవీకరణ పత్రంలో వేడిని ఒక కారణంగా చూపే వ్యవస్థ లేనందున, అనేక ఉష్ణ మరణాలు అధికారిక గణాంకాలలో లెక్కించరు.
పెరుగుతున్న ఉష్ణోగ్రతపై కేంద్ర ప్రభుత్వంగానీ, మీడియాగానీ ఇది ఒక విపత్తుగా, సమీప భవిష్యత్తులో ఉత్పాతంగా పరిగణించకపోవటం, మరణించిన పేదల పట్ల కించిత్తు సానుభూతి ప్రకటించకపోవటం శోచనీయం.
శ్రామికులపై ప్రభావం
శ్రామికులకు పుడమి మీద పెరుగుతున్న కాలుష్యంతో పాటు వేడి వాతావరణం మోయలేని భారంగా మారుతోంది. వారి ఆరోగ్యం మీద, సంపాదన మీద, సాధారణ జీవనం సాగించగలిగే సామర్థ్యంపై దీర్ఘకాలిక ప్రభావం అధిక ఉష్ణోగ్రతలు కలుగజేస్తున్నాయి. అసంఖ్యాక అసంఘటిత కార్మికుల వర్గాల మీద పెరుగుతున్న వేడి, తాగునీటి సంక్షోభం వల్ల కష్టాలు రెట్టింపు అవుతున్నాయి. మే 2018లో విడుదల చేసిన ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం 2050 నాటికి భారతదేశం పట్టణ ప్రాంతాలకు 41.60 కోట్ల మంది వలస వెళ్లాల్సి వస్తుంది.
కొరవడిన కార్మికవర్గ సంక్షేమం
2047 నాటికి అమృత కాలంగా ప్రచారం చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అప్పటికి ప్రస్తుతం ఉన్నవారితో పాటు, పట్టణాలకు చేరే కార్మికులు అధిక ఉష్ణోగ్రతల పట్టణ వాతావరణంలో ఎట్లా నివసిస్తారు అనే ప్రశ్న మీద ఆలోచన చేయడం లేదు. త్వరలోనే 2027నాటికి 5 ట్రిలియన్ డాలర్ల జాతీయ స్థూల ఆదాయం గురించి కలలు కంటున్న ఆర్థికవేత్తలు, దానిలో సగం అందించే కార్మిక వర్గం సంక్షేమం గురించి కిక్కురుమనటం లేదు.
ఇప్పుడు జాతీయ స్థూల ఆదాయం దాదాపు 4 బిలియన్ డాలర్లు. దీనిలో సగం అందించే శ్రామిక శక్తి అధిక ఉష్ణోగ్రతల నేపథ్యంలో అనారోగ్యంపాలై, ఉత్పాదక శక్తిని కోల్పోతుంటే, వారి గురించి పట్టించుకోకుండా 2047 నాటికి 35 ట్రిల్లియన్ డాలర్ల జాతీయ స్థూల ఆదాయం చేరుకుంటామని చొంగలు కార్చడం ఆశ్చర్యం వేస్తోంది. .
శ్రామిక శక్తి కుదేలైతే.. ఆర్థిక రంగం బలహీనం
అధిక ఉష్ణోగ్రతలు ఎదుర్కోవడానికి తయారు చేసే ప్రణాళికలలో కార్మికులతో సహా నగరవాసుల జీవిత అనుభవాలను దృష్టిలో పెట్టుకోవాలని నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను. అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కోవడానికి ఒక సమగ్ర ప్రణాళిక తయారు చేయమని సుప్రీం కోర్టు చెప్పినా కూడా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కదలిక లేదు. ఆ తరువాత కోర్టు ఒత్తిడి మేరకు తయారుచేసినా అవి మొక్కుబడి పత్రాలుగానే ఉన్నాయి.
ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కదిలి అధిక ఉష్ణోగ్రతల బారిన పడుతున్న జీవాలు, ప్రాణులు, కార్మికుల శ్రేయస్సు దృష్ట్యా యుద్ధప్రాతిపదికన ఉపశమన చర్యలు, సంక్షోభ నివారణ పథకాలు, దీర్ఘకాలిక ప్రణాళికలు చేపట్టాల్సిన అవసరం ఉన్నది. శ్రామిక శక్తి పని చేయలేని పరిస్థితులు తీవ్రతరం అయితే భారత ఆర్థికరంగం కుదేలు అవుతుంది. దేశం బలహీనపడుతుంది. ప్రకృతి వినాశనాన్ని అరికట్టే చర్యలు తక్షణమే తీసుకోవాలి.
హీట్ వేవ్ సమస్యను పరిష్కరించాలి
అధిక ఉష్ణోగ్రతలను ఎదుర్కొనే మార్గాలను అన్వేషించే పనిని అధికారులు చేపట్టడం లేదు. ఉష్ణోగ్రత సంబంధిత మరణాలపై డేటా లేకపోవడం దాని పట్ల దేశం ప్రతిస్పంద నను ప్రభావితం చేస్తున్నది. మున్ముందు పెరగబోయే తీవ్రమైన వేడి సంఘటనలకు సిద్ధం కావడం కష్టమని ప్రజారోగ్య నిపుణులు అంటున్నారు. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం, భారతదేశంలోని శ్రామిక శక్తిలో 75 శాతం మంది ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే ప్రాంతాలలో పని చేస్తారు. కొన్నిసార్లు ప్రాణాంతక ఉష్ణోగ్రత వాతావరణంలో పని చేస్తారు.
భారతదేశ స్థూల ఆదాయంలో (GDP) దాదాపు సగానికి దోహదపడే ఈ శ్రామికశక్తి పెరుగుతున్న ఉష్ణోగ్రతల భారాన్ని కూడా మోస్తున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల భారం ఈ అసంఘటిత కార్మిక శక్తి మీద ఇతరుల కన్నా ఎక్కువగా ఉంటుంది.
ప్రభుత్వాల రొటీన్ సూచనలు
అధిక ఉష్ణోగ్రతల వల్ల సగటు కార్మికుడు పని చేసే శారీరక సామర్థ్యం తగ్గుతోంది. భౌతికంగా విధులు నిర్వహించలేని పరిస్థితి ఉత్పన్నం అవుతోంది. ఉత్పాదకతను పరిమితం చేస్తోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల ఉష్ణోగ్రతల పెరుగుదల నేపథ్యంలో ఆరోగ్య సూచనలు జారీ చేశాయి. ప్రభుత్వం అనాలోచితంగా, రొటీన్‌గా విడుదల చేసే ఈ సూచనలు చాలా వరకు లక్షలాది మంది కార్మికులకు అందుబాటులో లేనివి.
ఈ సంవత్సరం దాదాపు ప్రతి నగరంలో ఉష్ణోగ్రతలు పెరిగాయి. దాంతో తాగునీటి సంక్షోభం ఏర్పడింది. బెంగళూరు, ఢిల్లీ వంటి నగరాలలో అది తీవ్రతరమైంది. పుడమి మీద ఉష్ణోగ్రతలు పెరిగిన సందర్భంలో నీటి కొరత ఏర్పడుతుంది అని అనేక సంవత్సరాలుగా నిపుణులు, పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలలో చలనం లేదు.
- డా. దొంతి నరసింహారెడ్డి, పాలసీ ఎనలిస్ట్