జిల్లాలతో పాటు హైదరాబాద్ నగరంలోనూ ఉదయం నుంచి ముసురు కంటిన్యూ అవుతోంది. ఆగకుండా కురుస్తున్న వర్షంతో నగరవాసులు ఇబ్బందులు పడుతున్నారు. లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరుతోంది. రోడ్లపై ట్రాఫిక్ సమస్యలతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లే సమయం కావటంతో నగరంలో ట్రాఫిక్ సమస్య ఎదురవుతోంది. హైదరాబాద్ తో పాటు శివారు ప్రాంతాల్లోనూ నిన్న సాయంత్రం నుంచి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి.
హైదరాబాద్ సహా ఖమ్మం, భద్రాద్రి, వరంగల్, ములుగు, జయశంకర్ భూపాలపల్లి, ఆదిలాబాద్ జిల్లాల్లో జోరు వాన పడుతోంది. నదులు, కాలువలు, వాగులు ఉప్పొంగుతున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం సబ్ డివిజన్ పరిధిలోని మహాదేవపూర్, మహాముత్తారం, మలహార్, పలిమేల మండలాల్లో నిన్నటి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాలు కురిశాయి. లోతట్టు ప్రాంతాల్లో వర్షపునీరు నిలిచిపోయింది. వాగులు పొంగిపొర్లుతున్నాయి. కాటారం మండలం పోతులవాయి వాగు ఉదృతంగా ప్రవహించటంతో గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. భూపాలపల్లి కేటీకే 2, కేటీకే 3 ఓపెన్ కాస్ట్ గనుల్లోకి వరద నీరు చేరడంతో 6 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. 2 కోట్ల వరకు నష్టం జరిగింది. గద్వాల జిల్లా జూరాల ప్రాజెక్టుకు వరద పెరగడంతో అధికారులు 5 గేట్లు ఎత్తారు. ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 76,238, ఔట్ ఫ్లో 60,986 క్యూసెక్కులుగా ఉంది. నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి 18,275 క్యూసెక్కుల వరద వస్తోంది. ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులకు గాను 1066 అడుగులకు చేరింది. నల్గొండ, వికారాబాద్, నల్గొండ జిల్లాలో ఎడతెరపి లేని వర్షం పడుతోంది. మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్, ఇందారం, రామకృష్ణాపూర్, మందమర్రిలోని ఉపరితల గనుల్లో నీరు చేరడంతో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది.
31.5 అడుగులకు గోదావరి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భారీ వర్షాలతో భద్రాద్రి కొత్త గూడెం జిల్లా వణికిపోతుంది. భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.ప్రస్తుతం భద్రాచలం వద్ద ఇవాళ ఉదయం గోదావరి నీటి మట్టం 31.5 అడుగులకు చేరింది. గోదావరి నది స్నానఘట్టాల వరకు వరద నీరు చేరింది. తాలిపేరు ప్రాజెక్టు 20 గేట్లను ఎత్తి 66,900 క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేశారు. 43 అడుగులు చేరితే మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. కిన్నెరసాని జలాశయంలోకి 4 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. పగిడివాగు ఉధృతంగాగా ప్రవహిస్తోంది. మన్యంలో వాగులు వంకలు పొంగుతుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. మూడు రోజులుగా రామచంద్రపురం గ్రామం జలదిగ్బంధంలో చిక్కుకుంది.
20 , 21వ తేదీల్లో భారీ వర్షాలు
రాష్ట్రంలో మరో రెండు రోజులపాటు భారీ నుంచి అతి భారీ, అత్యంత భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉందని తెలిపింది వాతావరణశాఖ. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది తీవ్ర వాయుగుండగా మారే అవకాశం ఉంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, పెద్దపల్లి జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వాయుగుండం ప్రభావంతో జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి.
కలెక్టర్లు అలర్ట్ గా ఉండాలె
ఉత్తర తెలంగాణలోని 11 జిల్లాల్లో ఈ నెల 20 , 21వ తేదీల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో రాష్ట్ర సర్కారు అలర్ట్ అయ్యింది. ఆయా జిల్లాల కలెక్టర్లు అలర్ట్ గా ఉండాలని సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. నిన్న రాత్రి టెలికాన్ఫరెన్స్ తో కలెక్టర్లు, జిల్లాల ఉన్నతాధికారులతో మాట్లాడారు.