హైదరాబాద్: ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై జోరుగా బెట్టింగులు సాగుతున్నాయి. హైదరాబాద్ కేంద్రంగా ఈ పందాలు కొనసాగాయి. ఏపీ వాసులు అధికంగా నివాసం ఉండే కూకట్ పల్లి, కేపీహెచ్ బీ, మియాపూర్, శేరిలింగంపల్లి, వనస్థలిపురం, దిల్ సుఖ్ నగర్, గచ్చిబౌలి, హైటెక్ సిటీ, నిజాంపేట్, ప్రగతినగర్, ఉప్పల్ ఏరియాల్లో ఈ బెట్టింగ్స్ జోరుగా సాగుతున్నాయి. అదే విధంగా ఆన్ లైన్ లోనూ బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి. వందకు వంద ఇస్తామని కొందరు పందాలు కాస్తుంటే.. మరికొందరు.. వందకు నూటా యాభై ఇస్తామని పందాలు కాస్తున్నారు. పార్టీ పరంగానే కాకుండా నియోజకవర్గాల స్థాయిలోనూ గెలుపోటములపై బెట్టింగ్స్ కొనసాగుతున్నాయి.
ఇందులో పల్నాడు, గుంటూరు, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాల్లో నియోజకవర్గాల స్థాయిలో అభ్యర్థుల గెలుపోటములపై పందాలు కాస్తున్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత ఈ పందాలు జోరందుకున్నాయి. ఇప్పటి వరకు ఏపీలో పల్నాడు, కృష్ణా, గుంటూరు జిల్లాలు పందాల్లో టాప్ ప్లేస్ లో ఉన్నాయి. ఈ మూడు జిల్లాల్లో అభ్యర్థులు వందలు, వేల కోట్ల ఆస్తి పరులు కావడం, గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగడం, పోటా పోటీగా ఖర్చు చేయడంతో స్టేట్ వైడ్ హైప్ క్రియేట్ అయ్యింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో అత్యంత తక్కువగా బెట్టింగ్స్ సాగుతున్నాయి. వీటితోపాటు ఎన్ ఆర్ ఐలు బరిలోకి దిగిన సెగ్మెంట్లలో ఇప్పటికే వందల కోట్ల రూపాయలు చేతులు మారినట్టు తెలుస్తోంది. పల్నాడు ప్రాంతంలో ఎకరాలకు ఎకరాల భూములు బెట్టింగ్ కింద అగ్రిమెంట్ చేసుకున్నట్టు సమాచారం. బెట్టింగ్స్ లో బుకీల హవా నడుస్తోంది.
గెలిచిన సొమ్ములో కనీసం పది శాతం నుంచి 20 శాతం వరకు కమీషన్ తీసుకుంటూ భరోసా ఇస్తున్నారు. నగదు , స్వైపింగ్ మెషిన్ల ద్వారా హైదరాబాద్ కేంద్రంగానే ఎక్కువ బెట్టింగ్స్ సాగుతున్నాయి. బెట్టింగ్స్ లో వివిధ మార్గాలను కూటమి అధికారంలోకి వస్తుందని, వైసీపీ విజయం సాధిస్తుందని ఒక తరహా బెట్టింగ్ కొనసాగుతోంది. వైసీపీ 120 సీట్లు వస్తాయని ఓ వర్గం, రావని మరో గ్రూపు.. జగన్ కు అరవై సీట్లు మించవని ఒక వర్గం బెట్టింగ్ ఆడుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు పోటీ చేస్తున్న కుప్పం, లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరి, పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురం, బాలకృష్ణ పోటీలో ఉన్న హిందూపురం సెగ్మెంట్లలో గెలుపోటములతో పాటు మెజార్టీల విషయంలోనూ ప్రత్యేక బెట్టింగ్స్ సాగుతున్నాయి.
పార్లమెంట్ విషయానికొస్తే.. విశాఖపట్నం, గుంటూరు, ఒంగోలు, రాజమండ్రిపై బెట్టింగ్స్ జరుగుతున్నాయి. విశాఖ పట్నం నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు భరత్, బొత్స ఝాన్సీ, గుంటూరులో దేశంలోనే అత్యంత ఆస్తిపరుడైన అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్, కిలారీ రోశయ్య బరిలో ఉండటంతో జోరుగా పందాలు కాస్తున్నారు. ఒంగోలులో మాగుంట శ్రీనివాసులు రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రాజమండ్రి లో పురంధేశ్వరి, ముత్యాల నాయుడు, పోటీలో నిలవడంతో ఈ సీట్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఆసక్తి కాస్తా బెట్టింగుల దాకా వెళ్లింది.