సూర్యాపేట మార్కెట్ చైర్మన్ పదవికి పోటాపోటీ

  •     ఆర్నెళ్లుగా పెండింగ్​లోనే.. పెరుగుతున్న ఆశావహులు
  •     మంత్రి వద్ద పైరవీలు.. పార్టీ మారుతామంటూ బెదిరింపులు      

సూర్యాపేట, వెలుగు: సూర్యాపేట వ్యవసాయ మార్కెట్‌‌‌‌‌‌‌‌కమిటీ చైర్మన్ పదవి కోసం అధికార పార్టీ నాయకులు పోటీ పడుతున్నారు. ఈ పదవి ఆర్నెళ్లుగా పెండింగ్​లోనే ఉంది. దీంతో రోజురోజుకూ ఆశావహులు పెరుగుతున్నారు. ఎవరికివారు మంత్రి వద్ద పైరవీలు చేసుకుంటున్నారు. పదవి ఇవ్వకపోతే పార్టీ మారుతామంటూ కొందరు బెదిరింపులకూ పాల్పడుతున్నారు. దీంతో ఎన్నికలు సమీపిస్తున్న వేళ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మంత్రికి తలనొప్పిగా మారిందంటూ సొంత పార్టీ నేతలు తలలు చెప్పుకుంటున్నారు. 

రాష్ట్రంలోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్...

రాష్ట్రంలోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్ గా పేరొందిన సూర్యాపేట మార్కెట్ కమిటీ పాలక వర్గం పదవీ కాలం గతేడాది అక్టోబర్ 19న ముగిసింది. గతంలో జనరల్ మహిళకు రిజర్వ్​ కాగా  ఉప్పల లలితా ఆనంద్ మార్కెట్ కమిటీ చైర్​పర్సన్​గా బాధ్యతలు చేపట్టారు. పాలకవర్గం గడువు ముగియగా రొటేషన్ పద్ధతిలో మార్కెట్ చైర్మన్ పదవి జనరల్ స్థానంగా మారింది. జనరల్ స్థానం కావడంతో ఈసారి చైర్మన్ పదవి కోసం ఆశావహులు పెద్ద సంఖ్యలో పెరిగారు.ఉద్యమ కాలం నుంచి మంత్రి జగదీశ్​రెడ్డితో ఉన్న వారితోపాటు కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి, పార్టీలోకి రాబోతున్న వారికి చైర్మన్ పదవిని ఆశపెడుతూ వస్తున్నారు. దీంతో ఇప్పుడు చైర్మన్ పదవిపై రాజకీయవేడి రాజుకుంటోంది. 

పదవి ఇవ్వకపోతే.. పార్టీ మారుతాం!

చైర్మన్ పదవి ఇవ్వకపోతే పార్టీ మారేందుకు కొం తమంది నేతలు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 5 రోజుల కింద అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్యనేత పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసు కోగా పార్టీ పెద్దలు అతడిని బుజ్జగించారు. రాష్ట్రంలో చాలా చోట్ల పెండింగ్​లో ఉన్న మార్కెట్ కమిటీ ఎంపిక పూర్తి చేశారు కానీ, సూర్యాపే టలో ఉన్న పోటీ కారణంగా ఇంకా నిర్ణ యం తీసుకోలేదు. పోటీ తీవ్రంగా ఉండడంతో చైర్మన్ పదవిపై ఆచితూచి నిర్ణయం తీసుకొనున్నారు. ఈ క్రమంలో పదవి ఎవరిని వరిస్తుందోఅనే ఆసక్తి నెలకొంది. 

పదవినీ ఆశిస్తున్నది వీరే..! 

మార్కెట్ చైర్మన్ పదవి కోసం గుర్రం సత్యనారాయణరెడ్డి, తుముల భుజంగ రావు కుమారుడు ఇంద్రసేనరావు  మధ్య పోటీ నెలకొంది.  గతంలో భార్యకు మున్సిపల్ చైర్ పర్సన్ పదవి ఆశించి భంగపడ్డ మోరిశెట్టి శ్రీనివాస్, కొనతం సత్యనారాయణ రెడ్డి, డాక్టర్ రామూర్తి యాదవ్, ఆంగిరేకుల నాగార్జున, గండూరి కృపాకర్,  చాంద్ పాషా, సయ్యద్ సలీం కూడా పదవి ఇవ్వాలంటూ పట్టుబడుతున్నారు.  మంత్రి వద్ద పైరవీ చేసుకుంటున్నారు. మరోవైపు మాజీ మార్కెట్ చైర్మన్ భర్త ఉప్పల ఆనంద్ తో పాటు గండూరి ప్రకాశ్​ కూడా రేసులో ఉన్నారు.