ఓఆర్ఆర్ సైక్లింగ్ ట్రాక్​కు యమ క్రేజ్

ఓఆర్ఆర్ సైక్లింగ్ ట్రాక్​కు యమ క్రేజ్
  • నాలుగు స్టేషన్లలో పెరుగుతున్న సైక్లిస్టుల తాకిడి 
  • సరిపోని 240 సైకిళ్లు   మరిన్ని కావాలంటున్న సిటిజన్స్​
  • మరో ఏజెన్సీకి అవకాశం

హైదరాబాద్​సిటీ, వెలుగు:  ఔటర్ రింగ్ రోడ్డును ఆనుకొని హెచ్ఎండీఏ నిర్మించిన సైక్లింగ్ ట్రాక్ కు క్రేజ్​పెరుగుతోంది. సైక్లింగ్​చేసే ఔత్సాహికుల సంఖ్య రోజు రోజుకూ అధికమవుతోంది. రెండేండ్ల కింద 24 కిలోమీటర్ల మేర ట్రాక్‌‌‌‌‌‌‌‌ ఏర్పాటు నిర్మించిన హెచ్ఎండీఏ.. తెలంగాణ పోలీస్ అకాడమీ జంక్షన్, నానక్‌‌‌‌‌‌‌‌రాంగూడ, నార్సింగి, కొల్లూరు ప్రాంతాలను కలుపుతూ ఆయా చోట్ల సైకిల్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. 

ప్రతి స్టేషన్​లో సుమారు 100 వరకు ఎలక్ట్రిక్, ఇతర సైకిళ్లను అందుబాటులో ఉంచింది. ఒక్కో సైకిల్​అద్దె గంటకు రూ.50 తీసుకుంటున్నారు. ఆరోగ్యంతో పాటు, ఆహ్లాదం కోసం పిల్లలు, యువతీ, యువకులు, మధ్య వయస్కులు వీకెండ్, సెలవు రోజులు, పండగ రోజుల్లో సైక్లింగ్​చేసేందుకు వస్తున్నారు. మిగతా రోజుల్లో సాఫ్ట్​వేర్​ఎంప్లాయీస్​తాకిడి ఉంటోంది. ప్రతి రోజూ పెద్ద సంఖ్యలో వస్తుండడంతో ఉన్న సైకిళ్లు చాలడం లేదు. చాలామంది గంటల తరబడి ఎదురుచూడాల్సి వస్తున్నది. సమస్యను గుర్తించిన అధికారులు మరో ఏజెన్సీకి అవకాశం ఇవ్వాలని నిర్ణయించారు. 

మరో ఏజెన్సీకి బాధ్యతలు 

హెచ్‌‌‌‌‌‌‌‌ఎండీఏ సైకిల్ స్టేషన్ల నిర్వహణను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించింది. నాలుగు సైకిల్ స్టేషన్లలో కలిపి 240 సైకిళ్లను అందుబాటులో ఉంచారు. ఇవి సరిపోకపోవడంతో త్వరలో ఇప్పుడున్న స్టేషన్లకు సమీపంలోనే మరిన్ని స్టేషన్లను ఏర్పాటు చేస్తామని అధికారులు చెప్తున్నారు. ఇందుకోసం హెచ్ఎండీఏకు సంబంధించిన హైదరాబాద్​గ్రోత్​కారిడార్​కార్పొరేషన్(హెచ్ జీసీఎల్) ఆధ్వర్యంలో మరో ఏజెన్సీని నియమించాలని నిర్ణయించారు. 

ఇప్పుడు రెండు చోట్ల.. 

ప్రతిపాదనల్లో భాగంగా నానక్​రామ్​గూడ –తెలంగాణ పోలీస్ అకాడమీ (8.50 కి.మీ.) మార్గంలో ఒకచోట, నార్సింగి నుంచి కొల్లూరు వైపు (14.50 కి.మీ.) మార్గంలో మరో సైకిల్​స్టేషన్​ఏర్పాటు  చేయనున్నారు. ఈ స్టేషన్లను 4.5 మీటర్ల వెడల్పు, త్రీ సైకిల్​ లేన్​తో రెండు వైపులా ఒక మీటర్​ గ్రీనరీ ఉండేలా తీర్చిదిద్దనున్నారు. ఇక్కడ 100 నుంచి 300 సైకిళ్లను అందుబాటులో ఉంచనున్నారు. వీటి ఏర్పాటుకు ఇప్పటికే వివిధ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించారు. 

ఎంపికైన వారు ఏం చేయాలంటే..

ఎంపికైన సంస్థ ట్రాక్​ నిర్వహణ, చూసుకోవడంతోపాటు సైకిళ్లను అందుబాటులో ఉంచాలి. కొత్తగా ఏర్పాటు చేసే స్టేషన్లలో టికెట్​కౌంటర్లను, వెయిటింగ్​ఏరియాల్లో ఇన్​ఫర్​మేటివ్​సైన్​బోర్డులను ఏర్పాటు చేయాలి. మూడేండ్ల పాటు నిర్వహణ చూడాల్సి ఉంటుంది. రెండో ఏజెన్సీ కోసం పిలిచే టెండర్లలో ప్రస్తుత ఏజెన్సీ పాల్గొనేందుకు అనుమతి ఇవ్వరు. పూర్తిగా కొత్త వారికే కేటాయిస్తారు. ఒక్కో స్టేషన్​లో 300 వరకూ సైకిళ్లను ఏర్పాటు చేసుకోవచ్చు. లైనెన్స్​ఫీజుగా హెచ్ఎండీఏ ఏడాదికి రూ.4,500 వసూలు చేయాలని నిర్ణయించింది. 

సైకిళ్ల అద్దె ఇలా..

సైకిల్ స్టేషన్లలో అద్దెకు ఇచ్చే సైకిళ్లకు ధరలను కూడా నిర్ణయించారు. సాధారణ రోజుల్లో పెడల్ బైక్ అయితే గంటకు రూ.50, టెండర్​బైక్​అయితే గంటకు రూ.100, ఎలక్ట్రిక్​ బైక్ అయితే గంటకు రూ.80 తీసుకుంటారు. వీకెండ్​, పబ్లిక్​హాలిడేస్​లో అరగంటకు ఈ ధరలు ఉంటాయి. రెగ్యులర్​గా సైక్లింగ్​కు వచ్చే వారి నుంచి డిపాజిట్(రిఫండబుల్) రూ.500 వసూలు చేస్తారు. కేవలం గంట సేపు తొక్కుకునే వారైతే రూ.300 డిపాజిట్​చేయాలి. రోజూ సైక్లింగ్​కు వచ్చేవారు రూ.99 కట్టి అన్​లిమిటెడ్​గా తొక్కుకోవచ్చు. వీక్లీ వచ్చే వారు రూ. 349, నెలకు అన్​లిమిటెడ్​గా అయితే రూ. 699 చెల్లించాల్సి ఉంటుంది.