- గాలివాన బీభత్సం
- ఉమ్మడి పాలమూరు జిల్లాలో తీవ్ర నష్టం
- తడిసిన పంట దిగుబడులునేలకొరిగిన వరి పైరు
- పిడుగుపాటుతో మూగజీవాల మృత్యువాత
చిన్నచింతకుంట/జడ్చర్ల టౌన్: ఉమ్మడి పాలమూరు జిల్లాలో మంగళవారం రాత్రి కురిసిన వర్షం బీభత్సం సృష్టించింది. 3 గంటల పాటు ఏకధాటిగా వర్షం కురవడంతో వరి, మక్క రైతులకు తీరని నష్టం కలిగింది. కోతలకు సిద్ధంగా వరి పైర్లు నేలకు ఒరిగిపోగా, మార్కెట్ యార్డులకు తీసుకొచ్చిన మక్కలు వర్షపు నీటిలో కొట్టుకుపోయాయి. కల్లాల వద్ద ఆరబెట్టిన వడ్లు తడిసి ముద్దయ్యాయి. మహబూబ్నగర్ జిల్లాలో 500 ఎకరాల్లో వరి పంట దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 567.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా మిడ్జిల్ మండలంలో 78.2, భూత్పూర్లో 71.0, జడ్చర్లలో 48.2, మూసాపేటలో 47.6, చిన్నచింతకుంటలో 33.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్, కొల్లాపూర్ మార్కెట్ యార్డుల్లో ఆరబోసిన మక్కజొన్న, వడ్లు తడిసిపోయాయి. బిజినేపల్లి, తాడూరు, తిమ్మాజీపేట్, బల్మూరు, పెద్దకొత్తపల్లి, కోడేరు, కొల్లాపూర్ మండలాల్లో రోడ్ల మీద ఆర బోసుకున్న వడ్లు వాన నీటిలో కొట్టుకుపోయాయి. మూడు ఆవులు, ఐదు బర్రెలు చనిపోయాయి. నాగర్ కర్నూల్ వ్యవసాయ మార్కెట్ కు తెచ్చిన మొక్కజొన్న తడిసి ముద్దయింది. ఈ సారి మక్కల దిగుబడి బాగుందని సంబరపడ్డ రైతులు వర్షంతో నష్టపోయారు.
కొల్లాపూర్, కల్వకుర్తి నియోజకవర్గాల్లో మామిడి, సపోట తోటలు దెబ్బతిన్నాయి. పెంట్లవెల్లి మండలంలో 120 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదుకాగా, కల్వకుర్తి, ఊర్కోండ, వెల్దండ, నాగర్ కర్నూల్, బిజినేపల్లి మండలాల్లో 50 మి.మీ వర్షపాతం నమోదైంది.
వనపర్తి: జిల్లాలో గాలివానతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లోని వడ్లు తడిసి ముద్దయ్యాయి. పొలాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంట ఈదురు గాలులు, వర్షంతో నేలకొరిగింది. మామిడికాయలు రాలిపోయాయి. తడిసిన వడ్లను ఆరబెట్టుకోలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వీపనగండ్ల, చిన్నంబావి, పానగల్, వనపర్తి, కొత్తకోట, పెబ్బేరు మండలాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
నారాయణపేట: జిల్లాలోని దామరగిద్దలో 7, నర్వలో 2, నారాయణపేట లో 7.6, మక్తల్ లో 6.9, మద్దూరులో 5.8, ధన్వాడలో 4.2, ఉట్కూర్ లో 3.2, మగనూర్, కోస్గిలో 3, నర్వా లో 2.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. నారాయణపేట, ధన్వాడ మండలాల్లో వరి పంట నేలకొరిగింది. ఉట్కూర్ మండలంలోని అమ్మపూర్ గ్రామంలో పిడుగు పడి ఎద్దు చనిపోయింది. మక్తల్ గురుకుల పాఠశాలలోకి నీళ్లు రాగా, ఎమ్మెల్యే దగ్గరుండి మున్సిపల్ సిబ్బందితో నీళ్లను తీయించారు.
గద్వాల: జిల్లాలో మక్కలు, వడ్లు, ఎండుమిర్చి తడిసిపోగా, పిడుగు పాటుకు పశువులు చనిపోయాయి. అయిజ, వడ్డేపల్లి, మానవపాడు, అలంపూర్, ఇటిక్యాల మండలాల్లో వర్షం కురిసింది. మానవపాడు మండల కేంద్రంలో కల్లాల్లో ఆరబెట్టిన మిర్చి పూర్తిగా తడిసి పోయింది. ధరూర్ మండలం కొండాపూర్ గ్రామంలో వర్షం ధాటికి వరి పైరు నేలకొరిగింది. కేటీ దొడ్డి మండలంలో గాలి వాన బీభత్సానికి విద్యుత్ ట్రాన్స్ ఫార్మర్ వద్ద ఏబీ స్విచ్ పోల్ విరిగిపడింది. 2 గంటల పాటు ఏకధాటిగా కురిసిన వర్షంతో వాగులు పొంగి పొర్లాయి.