కిటకిటలాడిన మేడారం.. భారీగా తరలివచ్చిన భక్తులు

కిటకిటలాడిన మేడారం.. భారీగా తరలివచ్చిన భక్తులు
  • రెండోరోజు మేడారం జాతరలో జనసందోహం
  • గద్దెల వద్ద భక్తుల ప్రత్యేక పూజలు
  • మొక్కులు చెల్లించుకున్న మంత్రి సీతక్క

జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు: వనదేవతలు కొలువుదీరిన మేడారం మినీ జాతరలో రెండో రోజు (గురువారం) భక్తిభావం ఉప్పొంగింది. భక్తుల రాకతో ఆలయం, జంపన్నవాగు పరిసరాలు కిటకిటలాడాయి. మేడారం, రెడ్డిగూడెం,  కొత్తూరు, నార్లాపూర్, ఊరట్టం తదితర ప్రాంతాలు సందడిగా మారాయి. మండ మెలిగే పండుగ సందర్భంగా మొక్కులు తీర్చుకోవడానికి వచ్చిన భక్తులు తల్లుల గద్దెలను చూసి పులకించిపోయారు. 

వన దేవతల గద్దెల ముందు పొర్లు దండాలు పెట్టారు. సారె చీరలు, ఎత్తుబెల్లం సమర్పించి అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. జంపన్నవాగు వద్ద కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించారు. రెండు రోజుల్లో 6 లక్షల మందికి పైగా భక్తులు మేడారం అమ్మవార్లను దర్శించుకున్నట్లు ఆఫీసర్లు ప్రకటించారు. రాష్ట్ర మంత్రి సీతక్క గురువారం ఉదయం గద్దెల వద్ద వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించారు. 

గద్దెల వద్ద ప్రత్యేక పూజలు

మినీ మేడారం జాతర సందర్భంగా గిరిజన పూజారులు(వడ్డెలు) సమ్మక్క, సారలమ్మ గద్దెల వద్ద  ప్రత్యేక పూజలు చేశారు. మహిళలు ఇంటి నుంచి పసుపు కుంకుమలు, కొత్త చీర సారెతో గద్దెల వద్దకు చేరుకున్నారు. పూజారులతో కలిసి గద్దెలను అందంగా అలంకరించి  పూజలు చేశారు. బుధవారం రాత్రి మేడారంలోని గద్దెల వద్ద జాగారం చేసిన ఆదివాసీ పూజారులు తెల్లవారే దాకా రహస్య పూజలు నిర్వహించారు. అక్కడే సమ్మక్క, సారలమ్మకు ఆదివాసీ గిరిజనుల సంప్రదాయాల ప్రకారం నైవేద్యం పెట్టి ఆరగించారు. 

పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు, సిద్దబోయిన మునేందర్‌‌‌‌, సమ్మక్క పూజారులు కొక్కెర కృష్ణయ్య, సారలమ్మ పూజారులు కాక సారయ్య, కిరణ్‌‌‌‌  ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. మేడారం, కన్నెపల్లి గ్రామస్తులు కోళ్లు, మేకలు బలిచ్చి అమ్మవార్లకు నైవేద్యం పెట్టారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు.

6 లక్షల మంది దర్శించుకున్నారు: మంత్రి సీతక్క

మినీ మేడారం జాతర సందర్భంగా రెండు రోజుల్లో 6 లక్షల మందికి పైగా భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నారని మంత్రి సీతక్క తెలిపారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా భక్తులను గద్దెల వద్దకు అనుమతించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఐలాపూర్, కొండాయి, మల్యాల, గద్దెల వద్ద భక్తులకు ఇబ్బంది కలగకుండా ఏర్పాట్లు చేశామని తెలిపారు. మేడారం గ్రామం నుంచి మూడు కిలోమీటర్ల వరకు నిత్యం పారిశుధ్య పనులు చేపడుతున్నామని చెప్పారు.