- జాతీయ రహదారులపై సెకనుకో వెహికల్..
- 36 గంటల్లో 1.24 లక్షల వెహికల్స్
- గ్రామాల వైపు 90 వేలు, హైదరాబాద్ వైపు 34 వాహనాలు
- రద్దీగా మారిన విజయవాడ, వరంగల్ హైవేలు
- బతుకమ్మ, దసరా నేపథ్యంలో పట్నం నుంచి పల్లె బాట పట్టిన ప్రజలు
యాదాద్రి, వెలుగు: బతుకమ్మ, దసరా పండుగ నేపథ్యంలో లక్షలాది మంది పట్నం నుంచి పల్లె బాట పట్టారు. గురువారం సద్దుల బతుకమ్మ జరగడంతో బుధవారం రాత్రి నుంచే గ్రామాలకు తరలడం మొదలుపెట్టారు. గురువారం ఉదయం 8 గంటల నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు 36 గంటల్లో యాదాద్రి జిల్లాలోని రెండు హైవేల మీదుగా 1.24 లక్షల వెహికల్స్ రాకపోకలు సాగించినట్లు చౌటుప్పల్‌లోని పంతంగి, బీబీనగర్ టోల్‌గేట్ లెక్కలు చెబుతున్నాయి. ఇందులో హైదరాబాద్ నుంచి గ్రామాల వైపు వెళ్లేవారే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
పల్లె వైపు 90 వేల వెహికల్స్...
గురువారం ఉదయం నుంచి శుక్రవారం రాత్రి 8 గంటల వరకు హైదరాబాద్ నుంచి గ్రామాల వైపు 90 వేల వెహికల్స్ ప్రయాణించాయి. గ్రామాల నుంచి హైదరాబాద్ వైపు 34 వేల వెహికల్స్ మాత్రమే వచ్చాయి. హైదరాబాద్ – విజయవాడ హైవేపై 63 వేల వెహికల్స్ రాకపోకలు సాగించగా, విజయవాడ వైపు నుంచి హైదరాబాద్ వైపు 16 వేల వాహనాలు వచ్చాయి.
హైదరాబాద్ – వరంగల్ హైవేపై 36 గంటల్లో 61 వేల వాహనాలు రాకపోకలు సాగించగా వరంగల్ వైపు 43 వేలు, హైదరాబాద్ వైపు 18 వేల ప్రయాణించాయి. వీటిలో కార్లే ఎక్కువగా ఉండడం గమనార్హం. 36 గంటలకు 1,29,600 సెకండ్లు కాగా సెకనుకో వెహికల్ చొప్పున 1.24 లక్షల వెహికల్స్ రహదారిపై ప్రయాణించాయి.