కిక్కిరిసిన యాదగిరిగుట్ట

కిక్కిరిసిన యాదగిరిగుట్ట
  • వరుస సెలవులతో భారీగా తరలివచ్చిన భక్తులు
  • ధర్మదర్శనానికి 4, స్పెషల్ దర్శనానికి గంటన్నర సమయం
  • బుధవారం ఒక్కరోజే టెంపుల్‌‌‌‌కు రూ.65.39 లక్షల ఆమ్దానీ

యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం బుధవారం భక్తులతో కిక్కిరిసిపోయింది. వరుస సెలవులు రావడంతో హైదరాబాద్‌‌‌‌ సహా పలు ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. యాత్రీకులు భారీ సంఖ్యలో సొంత వాహనాల్లో రావడంతో పార్కింగ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ పూర్తిగా నిండిపోయింది. దీంతో వెహికల్స్‌‌‌‌ను వాహన పూజల ప్రాంగణానికి తరలించగా అది కూడా నిండిపోవడంతో వైకుంఠ ద్వారం నుంచి పార్కింగ్‌‌‌‌ ప్లేస్‌‌‌‌ సర్కిల్‌‌‌‌ వరకు రోడ్డుకు ఎడమ వైపున కిలోమీటర్ల మేర తాత్కాలికంగా పార్కింగ్‌‌‌‌ చేశారు. 

లక్ష్మీపుష్కరిణి, కల్యాణకట్ట, బస్ బే, క్యూకాంప్లెక్స్, దర్శన, ప్రసాద క్యూలైన్లు భక్తులతో నిండిపోయాయి. రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి 4 గంటలు, ప్రత్యేక దర్శనానికి గంటన్నర టైం పట్టిందని భక్తులు తెలిపారు. భారీ సంఖ్యలో భక్తులు రావడంతో బుధవారం ఒక్కరోజే ఆలయానికి రూ. 65,39,905 ఆదాయం వచ్చింది. ఇందులో అత్యధికంగా ప్రసాద విక్రయం ద్వారా రూ.21,17,780, వీఐపీ దర్శనాలతో రూ.16.20 లక్షలు, బ్రేక్‌‌‌‌ దర్శనాల ద్వారా రూ.7,50,600, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.8 లక్షలు వచ్చినట్లు ఆఫీసర్లు తెలిపారు. మరో వైపు ఆలయంలో జరుగతున్న ధనుర్మాసోత్సవాలు బుధవారంతో పదో రోజుకు చేరుకున్నాయి. 

నారసింహుడి దర్శనానికి వీఐపీల క్యూ

నారసింహుడి దర్శనం కోసం బుధవారం పలువురు ప్రముఖులు క్యూ కట్టారు. మాజీమంత్రి శ్రీనివాస్‌‌‌‌గౌడ్‌‌‌‌, కంటోన్మెంట్‌‌‌‌ ఎమ్మెల్యే గణేశ్‌‌‌‌, ఉప్పల్‌‌‌‌ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, ఎండోమెంట్ అడిషనల్‌‌‌‌ కమిషనర్‌‌‌‌ జ్యోతి, ట్రైబల్‌‌‌‌ వెల్ఫేర్‌‌‌‌ ప్రిన్సిపల్‌‌‌‌ సెక్రటరీ శరత్, ఐఏఎస్‌‌‌‌ ఆఫీసర్ శశాంక్‌‌‌‌ గోయల్‌‌‌‌ వేర్వేరుగా వారి ఫ్యామిలీలతో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీఐపీలకు అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అనంతరం ప్రత్యేక పూజలు, ఆశీర్వచనం చేయగా, ఆఫీసర్లు స్వామివారి ప్రసాదం అందజేశారు.