యాదగిరిగుట్ట, వెలుగు: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ పెరిగింది. సంక్రాంతి సెలవులకు తోడు ఆదివారం కలిసి రావడంతో పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కొండ కింద, కొండపైన ఎక్కడ చూసినా భక్తుల కోలాహలమే కనిపించింది. భక్తులు భారీగా రావడంతో.. పార్కింగ్ ఏరియా, వ్రత మండపాలు, పుష్కరిణి ప్రాంతాలు, బస్ బే, దర్శన, ప్రసాద క్యూలైన్లు రద్దీగా మారాయి. రద్దీ కారణంగా స్వామివారి ధర్మదర్శనానికి మూడు గంటలు, స్పెషల్ దర్శనానికి గంట పట్టిందని భక్తులు తెలిపారు.
మరోవైపు ఆలయంలో నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. ఉదయం సుప్రభాతంతో మొదలై రాత్రి పవళింపుసేవతో ముగిశాయి. ఆలయంలో నిర్వహించిన స్వామివారి కల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు జరిపించిన పలు రకాల పూజలు, నిత్య కైంకర్యాల ద్వారా ఆదివారం ఆలయానికి రూ.45,52,569 ఆదాయం సమకూరింది. ప్రసాద విక్రయం ద్వారా రూ.18,87,700, కొండపైకి వాహనాల ప్రవేశంతో రూ.7 లక్షలు, వీఐపీ దర్శన టికెట్ల ద్వారా రూ.6.90 లక్షలు, బ్రేక్ దర్శనాలతో రూ.3,84,900 ఆదాయం వచ్చిందని ఆలయ ఆఫీసర్లు వెల్లడించారు.
యాదగిరీశుడి సేవలో డీజీపీ రవిగుప్తా
యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామిని ఆదివారం రాష్ట్ర డీజీపీ రవిగుప్తా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అద్దాల మండపంలో ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యులు వేదాశీర్వచనం చేయగా.. ఈవో రామకృష్ణారావు, డిప్యూటీ ఈవో దోర్బల భాస్కర్ శర్మ లడ్డూప్రసాదం, స్వామివారి శేషవస్త్రాలు అందజేశారు. అంతకుముందు డీజీపీకి భువనగిరి డీసీపీ రాజేష్ చంద్ర, ఈవో స్వాగతం పలికారు. డీజీపీతో పాటు ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ చిరంజీవి చౌదరి కూడా ఫ్యామిలీతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. అదేవిధంగా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి, అడిషనల్ డీజీ శివధర్ రెడ్డి వారి వారి ఫ్యామిలీలతో వేర్వేరుగా స్వామివారిని దర్శించుకున్నారు. యాదగిరిగుట్ట ఏసీపీ శివరాంరెడ్డి, సీఐలు రమేశ్, సురేందర్ రెడ్డి, ఏఈవో రామ్మోహన్, సూపరింటెండెంట్ రాజన్ బాబు ఉన్నారు.
యాదగిరిగుట్టలో వైభవంగా 'గోదా' కల్యాణం
ధనుర్మాస ఉత్సవాల్లో భాగంగా శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి గోదాదేవి-పాండురంగనాథుల కల్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. గుట్టకు అనుబంధ ఆలయమైన పాతగుట్ట నరసింహుడి క్షేత్రంలో ఉదయమే కల్యాణాన్ని నిర్వహించారు. డిసెంబర్ 17న మొదలైన ధనుర్మాస ఉత్సవాలు సోమవారం నిర్వహించే ‘ఒడిబియ్యం’ సమర్పణతో ముగియనున్నాయి. ఆదివారం ఉదయం 4:30 నుంచి 5:15 గంటల వరకు.. ఆండాళ్ అమ్మవారికి తిరుప్పావై పూజలు నిర్వహించారు. రాత్రి ప్రధానాలయంలో గోదా కల్యాణాన్ని జరిపారు. పూలు, వజ్ర వైఢూర్యాలతో స్వామి, అమ్మవార్లను అలంకరించారు. అమ్మవారిని ప్రధానాలయ ముఖ మండపంలో పెళ్లి కుమార్తెగా ముస్తాబు చేసి యాదగిరీశుడిని రంగనాథుడిగా తీర్చిదిద్ది కల్యాణ తంతు నిర్వహించారు. ప్రధానార్చకులు నల్లంథీగల్ లక్ష్మీనరసింహాచార్యుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.