ఫొటోలకు పోజులు, పరామర్శలకే ప్రజాప్రతినిధులు పరిమితం

ఫొటోలకు పోజులు, పరామర్శలకే ప్రజాప్రతినిధులు పరిమితం
  • భారీ వర్షాలతో గోదావరికి ఎన్నడూ లేనంతగా వరదలు
  • ఇంకా నష్టం అంచనా వేయడంలోనే నిమగ్నమైన యంత్రాంగం
  • ఆందోళనలో నిరాశ్రయులు, వరద బాధితులు

గోదావరిఖని, వెలుగు: భారీ వర్షాలతో గోదావరికి ఈ మధ్యకాలంలో ఎన్నడూ లేనంతగా వరదలు వచ్చాయి. నది సమీప ప్రాంతాలు, శివారు కాలనీలు నీటమునిగాయి. ఇండ్లల్లోకి నీరు చేరడంతో బియ్యం, పప్పులు, నూనె, ఇతర నిత్యావసర సరుకులు వరద పాలయ్యాయి. ఈ పరిస్థితుల్లో నిర్వాసిత ప్రజలకు తక్షణ సాయం అందజేయడంలో సర్కారు ఫెయిలైంది. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు ఫొటోలకు పోజులిచ్చి, పరామర్శలకే పరిమితమయ్యారు తప్ప తమకు ఎలాంటి సాయం చేయలేదని వరద బాధితులు వాపోతున్నారు. 

మూడు రోజులు నీళ్లల్లోనే ఇండ్లు 
భారీ వర్షాలకు తోడు ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌‌‌‌ నుంచి లక్షలాది క్యూసెక్కుల వరద నీరు దిగువకు వదలడంతో రామగుండం నియోజకవర్గ పరిధి నది శివారులో ఉన్న సప్తగిరి కాలనీ, రెడ్డి కాలనీ, రఘుపతినగర్‌‌‌‌, మల్కాపురం, నర్రశాలపల్లి, న్యూపోరట్‌‌‌‌పల్లి.. తదితర ఏరియాలు నీట మునిగాయి. దీంతో వందలాది మంది నిరాశ్రయులు కాగా వారిని ఆఫీసర్లు కమ్యూనిటీ, ఫంక్షన్‌‌‌‌ హాళ్లకు తరలించారు. మూడ్రోజుల తర్వాత వరద తగ్గుముఖం పట్టడంతో బాధితులు ఇండ్లకు తిరిగొచ్చారు. బురద నిండిన ఇండ్లను చూసి వారు కన్నీటి పర్యంతమయ్యారు. కొన్ని ఇండ్లు పూర్తిగా మునిగిపోగా, మరికొన్ని దర్వాజ వరకు వరద చేరి ఇంట్లో ఉన్న మంచాలు, పరుపులు, బట్టలు, బియ్యం, నిత్యావసర సరుకులన్నీ మునిగి పాడైపోయాయి. 

వచ్చారు.. వెళ్లారు
వరద ముంపు ప్రాంతాల్లో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్​నేత, స్థానిక ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఇతర అధికార పార్టీ లీడర్లు పర్యటించారు. అధికార యంత్రాంగం నష్టం అంచనా వేస్తోందని, ఆ తర్వాత సర్కారు నుంచి సాయం అందుతుందని చెప్పి వెళ్లారు. ముంపు ఏరియాల్లో బాధితులతో పరామర్శిస్తూ ఫొటోలు దిగారు తప్ప పైసా కూడా సాయం చేయలేదని, కనీసం తక్షణం అందించాల్సిన తిండిగాసాలు, నిత్యావసర సరుకులు కూడా ఇవ్వలేదని ముంపు ప్రాంతవాసులు వాపోయారు. 

సర్కారు ఎలాంటి సాయం చేయలే.. 
వరద నీటిలో మా ఇండ్లు మునిగిపోయి సర్వస్వం కోల్పోయాం. ఎంపీ, ఎమ్మెల్యే, మేయర్‌‌‌‌ వచ్చి మా ఇండ్లను చూసి వెళ్లారే తప్ప వారు గానీ, సర్కారు గానీ తక్షణ సాయం చేయలేదు. మాజీ ఎంపీ వివేక్​ మమ్మల్ని పరామర్శించడానికి వస్తే మా గోడు చెప్పుకున్నాం. ఆయన స్పందించి తెల్లారే బియ్యం, ఇతర సరుకులను పంపించి మమ్మల్ని ఆదుకున్నారు. 
-  కాల్వ సుజాత, సప్తగిరి కాలనీ, గోదావరిఖని