
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమలకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. వీకెండ్ తోపాటు వేసవి సెలవులు రావడంతో శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తిరమలకు చేరుకుంటున్నారు. ఆలయ పరిసరాలు, అన్నదానం కాంప్లెక్స్, షాపింగ్ కాంప్లెక్స్, లేపాక్షి సర్కిల్, CRO ప్రాంతాలలో భక్తులు కిటకిటలాడుతున్నారు. ఎలాంటి దర్శన టికెట్లు లేని భక్తులను సర్వదర్శనానికి నేరుగా అనుమతిస్తున్నారు.
దీంతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్లు నిండి, భక్తులు బయట క్యూలైన్లలో బారులు తీరారు. భక్తులకు ఉచిత దర్శనానికి సుమారు 30 గంటల సమయం పడుతుండగా, ఇక టైమ్ స్లాట్ టోకన్, దివ్యదర్శనం భక్తులకు సుమారు 5 గంటలు, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 4 గంటల సమయం పడుతోంది. మరోవైపు శనివారం 75,652 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. 37,027 మంది స్వామి వారికి తలనీలాలు సమర్పించగా, హుండీ ఆదాయం 3.21 కోట్ల రూపాయలు వచ్చినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు వెల్లడించారు.