ఇండోనేషియాలో భారీ భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో 35 మంది మరణించగా, వందల మంది గాయపడ్డారని ఆ దేశ విపత్తు సంస్థ శుక్రవారం తెలిపింది. ఇండోనేషియాలోని మజేన్ నగరానికి ఈశాన్యంగా ఆరు కిలోమీటర్లు దూరంలో సులవేసి దీవుల్లో శుక్రవారం 6.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భూకంప కేంద్రం 10 కిలోమీటర్ల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఈ ఘటనలో ఒక హోటల్ మరియు వెస్ట్ సులవేసి గవర్నర్ కార్యాలయం తీవ్రంగా దెబ్బతిన్నాయని, అదేవిధంగా నగరంలో విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోయిందని అధికారులు తెలిపారు. భూకంపం తీవ్రతకు వేల మంది ప్రజలు భయాందోళనకు గురై.. తమ ఇళ్ల నుంచి బయటకు పరిగెత్తారు. భూకంపం దాదాపు ఏడు సెకన్ల పాటు సంభవించినట్లు అధికారులు తెలిపారు. ఇదే జిల్లాలో కొన్ని గంటల ముందు గురువారం కూడా 5.9 తీవ్రతతో భూకంపం సంభవించిందని.. ఈ ఘటనలో అనేక ఇళ్లు దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. వరుస భూకంపాలతో మజేన్ ప్రాంతవాసులు భయాందోళనకు గురవుతున్నారు.
For More News..