- దాదాపు ఐదు గంటల పాటు భీకర కాల్పులు
- సీ60 కమాండోస్ ఎస్సై, ఇద్దరు జవాన్లకు గాయాలు
- హెలికాప్టర్లో నాగ్‌పూర్‌కు తరలించి ట్రీట్మెంట్
- అడవుల్లో కొనసాగుతున్న కూంబింగ్
భద్రాచలం, వెలుగు: మహారాష్ట్రలోని గడ్చిరోలిలో భారీ ఎన్ కౌంటర్ జరిగింది. 12 మంది మావోయిస్టులు మృతి చెందారు. మహారాష్ట్రలోని గడ్చిరోలి, చత్తీస్‌గఢ్ లోని -కాంకేర్ జిల్లాల మధ్య ఉన్న బార్డర్ లో 12 నుంచి 15 మంది మావోయిస్టులు సంచరిస్తున్నారన్న సమాచారంతో భద్రతా బలగాలు బుధవారం కూంబింగ్ ప్రారంభించాయి. గడ్చిరోలి జల్లా డిప్యూటీ ఎస్పీ నేతృత్వంలో ఏడు సీ-60 కమాండోస్ టీమ్స్ రంగంలోకి దిగి, ఉదయం 10:30 గంటలకు జారావండీ పోలీస్‌స్టేషన్‌పరిధిలోని చింద్వెట్టి గ్రామ అడవుల్లో కూంబింగ్ మొదలుపెట్టాయి.
ఈ క్రమంలో వాందోళీ అడవుల్లో నక్సల్స్ జాడను గుర్తించి, భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఇరువర్గాల మధ్య మధ్యాహ్నం 1:30 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు భీకర కాల్పులు జరిగాయి. ఇందులో సీ60 కమాండోస్ ఎస్సై సతీశ్పాటిల్, మరో ఇద్దరు జవాన్లకు బుల్లెట్ గాయాలయ్యాయి. ఈ క్రమంలో చత్తీస్ గఢ్ సర్కార్ ను అలర్ట్ చేయగా, కాంకేర్జిల్లా కేంద్రంలో హెలికాప్టర్సిద్ధం చేశారు. గాయపడిన ముగ్గురిని ఆ హెలికాప్టర్ లో మొదట గడ్చిరోలికి, ఆ తర్వాత నాగ్‌పూర్‌కు తరలించి ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. ఎస్సై సతీశ్ పాటిల్ కుడి భుజానికి బుల్లెట్ దిగింది.
మృతుల్లో దళం కమాండర్..
ఘటనా స్థలంలో 12 మంది మావోయిస్టుల మృతదేహాలను పోలీసులు గుర్తించారు. మూడు ఏకే-47, రెండు ఇన్సాస్, ఒక కార్బైన్, ఒక ఎస్ఎల్ఆర్తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. మృతుల్లో తిపాగఢ్ దళం కమాండర్లక్ష్మణ్ఆత్రం అలియాస్ విశాల్ఆత్రం ఉన్నట్టు గుర్తించారు. మిగిలినోళ్లను గుర్తించేందుకు లొంగిపోయిన మావోయిస్టులు, ఇన్ఫార్మర్లను పిలిపించారు. అడవుల్లో కూంబింగ్ ఇంకా కొనసాగుతున్నది.
బ్యాకప్ బలగాలను హెలికాప్టర్ ద్వారా వాందోళీ అడవుల్లోకి తరలించారు. గాయాలతో పారిపోయిన నక్సల్స్ కోసం వెతుకుతున్నారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందంటున్నారు. భద్రతా బలగాలు అడవుల నుంచి బయటకు వస్తే పూర్తి సమాచారం తెలిసే అవకాశం ఉంది. కాగా, ఈ నెల 28 నుంచి మావోయిస్టు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ టైమ్ లో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ తగిలింది.
కేంద్రం రెడ్ అలర్ట్..
గడ్చిరోలి ఎన్కౌంటర్నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత రాష్ట్రాల్లో కేంద్ర హోంశాఖ రెడ్అలర్ట్ ప్రకటించింది. మావోయిస్టులు ప్రతీకారంతో దాడులకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ఎన్కౌంటర్ ప్రదేశానికి అడిషనల్ టీమ్స్ ను పంపిస్తున్నారు. తెలంగాణ, ఏపీ, చత్తీస్‌గఢ్, మహారాష్ట్ర బార్డర్‌లోని పోలీస్స్టేషన్లకు అప్రమత్తంగా ఉండాలంటూ ఆదేశాలిచ్చారు. కాగా, సీ60 కమాండో టీమ్స్ కు మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఫడ్నవీస్ రూ.51 లక్షల రివార్డు ప్రకటించారు.