
- భారీ కేటాయింపులు ఉంటాయని భావిస్తున్న అధికారులు
- మెట్రోపై సీఎం స్పెషల్ ఫోకస్ పెట్టడంతో అంచనాలు
- రూ.3 వేల కోట్లు కేటాయించాలని ప్రతిపాదనలు
- ఇప్పటికీ డీపీఆర్ ఆమోదించని కేంద్ర ప్రభుత్వం
హైదరాబాద్ సిటీ, వెలుగు: అసెంబ్లీలో బుధవారం ప్రవేశపెట్టనున్న బడ్జెట్ పై మెట్రో అధికారులు భారీ ఆశలు పెట్టుకున్నారు. పెద్దమొత్తంలో కేటాయింపులు ఉంటాయని భావిస్తున్నారు. ఇప్పటికే ఫేజ్ –2 పార్ట్– ఏకు సంబంధించిన ఐదు కారిడార్లకు డీపీఆర్‌లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది.
సెకండ్ ఫేజ్ లో భాగంగా నాగోలు-– ఎయిర్ పోర్టు 38.8 కి.మీ, రాయదుర్గం–- కోకాపేట 11.6 కి.మీ, ఎంజీబీఎస్- –- చాంద్రాయణగుట్ట 7.5 కి.మీ., మియాపూర్- – పటాన్చెరు 13.4 కి.మీ, ఎల్బీనగర్-– హయత్ నగర్ 7.1 కి.మీ కలిపి 76.4 కి.మీకు గాను డీపీఆర్‌లను కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపించారు.
ఐదు నెలలు గడుస్తున్నా కేంద్రం నుంచి స్పందన లేదు. కేంద్ర బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని అనుకున్నా నిరాశే మిగిలింది. దీంతో బుధవారం ప్రవేశపెట్టనున్న రాష్ట్ర బడ్జెట్ పైనే మెట్రో అధికారులు ఆశలు పెట్టుకున్నారు.
ఓల్డ్‌సిటీకి మరిన్ని నిధులు
రాష్ట్ర ప్రభుత్వం గత బడ్జెట్ లో మెట్రోకు రూ.1,100 కోట్లు కేటాయించింది. ఓల్డ్ సిటీ మెట్రోకు రూ. 500 కోట్లు, ఎయిర్‌పోర్టు మెట్రోకు రూ. 100 కోట్లు, హెచ్ఎంఆర్ఎల్ కు మరో రూ. 500 కోట్లు కేటాయించింది. ఓల్డ్ సిటీలో భూసేకరణ, టెండర్లకే దాదాపు రూ. వెయ్యికోట్ల దాకా ఖర్చవుతుందని అధికారుల అంచనా. ఈ బడ్జెట్ లో ఓల్డ్ సిటీ మెట్రోకు సుమారు రూ. వెయ్యి కోట్లు, మిగతా నాలుగు కారిడార్లకు సంబంధించి మరో 2,000 కోట్లు వివిధ టెండర్ల కోసం కేటాయించాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తున్నది.
అయితే, సీఎం మెట్రోపై స్పెషల్ ఫోకస్ పెట్టడంతో బడ్జెట్ లో అధిక నిధులు కేటాయించే అవకాశం ఉందని మెట్రో అధికారులు భావిస్తున్నారు. ఓల్డ్ సిటీ మెట్రోను నాలుగేండ్లలో పూర్తి చేయాలని నిర్ణయించడంతో ఓల్డ్ సిటీ మెట్రోకు మరిన్ని నిధులు కేటాయించే అవకాశం కూడా ఉందంటున్నారు.
కేంద్రం ఎప్పుడు ఆమోదిస్తుందో..
మెట్రో సెంకడ్ ఫేజ్ ను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్ గా రూ.24,289 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం 30శాతం వాటాగా రూ.7,313 కోట్లు, కేంద్రం 18శాతం వాటాగా రూ.4.230 కోట్లు భరిస్తుండగా, మిగతా 48 శాతం కింద కేంద్ర ప్రభుత్వం పూచీకత్తుతో సావరిన్ గ్యారంటీతో జైకా, ఏడీబీ, ఎన్డీబీ వంటి మల్టీలేటరల్ సంస్థల నుంచి రూ.11,683 కోట్ల రుణాలను సేకరించనున్నారు.
మరో 4 శాతం ఇన్వెస్ట్మెంట్రూ.1,033 కోట్లను పీపీపీ విధానంలో సమకూర్చనున్నారు. అయితే, కేంద్ర ప్రభుత్వ వాటా, సావరీన్ గ్యారంటీల లోన్లు రావాలంటే కేంద్రం డీపీఆర్ లను ఆమోదించాల్సి ఉంటుంది.