
- 1500 క్వింటాళ్ల పత్తి దగ్ధం
నేరడిగొండ, వెలుగు : నిర్మల్‌జిల్లా నేరడిగొండ మండల కేంద్రంలోని ఓ జిన్నింగ్ మిల్లులో శనివారం రాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. మిల్లులో నిల్వ ఉంచిన 1500 క్వింటాళ్లకు పైగా పత్తి దగ్ధమైంది. కాలిపోయిన పత్తి విలువ దాదాపు రూ.1 కోటి ఉంటుందని తెలుస్తోంది. అయితే, ఈ అగ్ని ప్రమాదం ప్రమాదవశాత్తూ జరిగిందా? లేక ఎవరైనా కావాలని చేశారా అని స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
ఈ విషయంపై సీసీఐ అధికారులను వివరణ కోరగా దగ్ధమైన పత్తి తమకు సంబంధించినది కాదని, అది ప్రైవేటుకు సంబంధించినది అని తెలిపారు. ఈ విషయంపై జిన్నింగ్ వారిని సంప్రదించగా అగ్ని ప్రమాదంపై తమకు ఎలాంటి సమాచారం అందలేదని చెప్పారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.