నిండుకుండలా ఎస్సారెస్పీ

నిండుకుండలా ఎస్సారెస్పీ
  • 89 వేల క్యూసెక్​ల ఇన్​ఫ్లో.. 20 గేట్లు ఖుల్లా.. 
  • పోటెత్తిన పర్యాటకులు.. సెల్ఫీలు, ఫొటోలతో సందడి 

బాల్కొండ,వెలుగు: శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి భారీ వరద కొనసాగుతోంది. మహారాష్ట్రలో గోదావరి పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల వల్ల రెండు రోజులుగా ప్రాజెక్టులోకి ఇన్​ ఫ్లో వచ్చి చేరుతుంది. ప్రాజెక్ట్​లోకి పూర్తి స్థాయిలో నీటి నిల్వలుండడంతో వచ్చిన నీటిని వచ్చినట్టు కిందకు వదులుతున్నారు. ఆదివారం నాడు 24 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. శనివారం ఉదయం 50 వేల క్యూసెక్కుల ఇన్​ ఫ్లో ఉండగా రాత్రివరకు లక్ష క్యూసెక్కులకు చేరింది.

దాంతో మొదట 9 వరద గేట్లు ఎత్తి 28 వేల క్యూసెక్కులు వదిలారు. ఆదివారం ఉదయం 16 గేట్లు కు పెంచి 49 వేల క్యూసెక్కులు వదిలారు. వరద పెరగడంతో మధ్యాహ్నం 24 గేట్లు తెరిచి 1. 26 లక్షల క్యూసెక్కుల జలాలను గోదావరిలోకి విడుదల చేశారు. ఆదివారం రాత్రి 8 గంటలకు 89,377 క్యూసెక్​ల ఇన్​ఫ్లో వస్తుండగా .. 20 గేట్ల ద్వారా 62,480 క్యూసెక్​ల నీటిని వదులుతున్నారు.

వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ ద్వారా 18 వేల క్యూసెక్కులు, కాకతీయ కాలువకు 4 వేల క్యూసెక్కులు,ఎస్కేప్ గేట్ల ద్వారా 4 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు(80.50టీఎంసీలు)కాగా ఆదివారం సాయంత్రానికి 1090.90 అడుగులు,(80.05టీఎంసీల)నీరు నిల్వ ఉందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. 

 పర్యాటకుల సందడి

 ప్రాజెక్టు గేట్లు ఎత్తడం, సెలవు కావడంతో ఆదివారం పర్యాటకులు ప్రాజెక్టుపై సందడి చేశారు. డ్యాం పైకి సందర్శకులను అనుమతించలేదు. ప్రాజెక్టు కింది నుంచి ఆటోలకు తప్ప వేరే వాహనాలను కూడా పైకి రానివ్వలేదు. కాలినడకన వెళ్లి ప్రాజెక్టు ఆనకట్టపై పర్యాటకులు ఫోటోలు, సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. 

గోదావరిలో ముంబాయి యువకుడు గల్లంతు

శ్రీరాంసాగర్ ప్రాజెక్టు దిగువన గోదావరిలో ముంబాయి కి చెందిన మహమ్మద్ ఫిరోజ్ ఖాన్(28) గల్లంతయ్యాడు. ముంబాయి కి చెందిన ఫిరోజ్ ఖాన్ మూడు రోజుల కింద మెట్ పల్లి లోని అత్తమ్మ ఇంటికి వచ్చాడు. ఆదివారం తన బావమరిది సయ్యద్ అష్రాఫ్, ఫ్రెండ్స్ అబ్దుల్ సల్మాన్,సిరిసివల్ రోహిత్ లతో కలిసి ప్రాజెక్ట్​ను చూసేందుకు వచ్చాడు. డ్యామ్ కింద గేట్ల దగ్గర బండ రాయిపై కూర్చుని చేపలు పడుతున్న ఫిరోజ్ ఖాన్ కు అల వచ్చి బలంగా కొట్టడంతో నీటిలో జారిపడ్డాడు.

పక్కనే ఉన్న రోహిత్ కాపాడే ప్రయత్నం చేసినా అప్పటికే ప్రవాహంలో మునిగి గల్లంతయ్యాడు. గాలింపు చేపట్టినా అతని ఆచూకీ దొరకలేదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నారాయణ తెలిపారు. ప్రాజెక్టు అందాలను చూసేందుకు వస్తున్నవారు ప్రమాదాలకు గురవుతున్నా గుణపాఠం నేర్వడం లేదు. నదిలో సెల్ఫీలు దిగుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. డ్యాం కింద పోలీస్ బందోబస్తు లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. 

 నిజాంసాగర్​కు భారీగా వరద

కామారెడ్డి​: నిజాంసాగర్​ ప్రాజెక్టుకు వరద ఉధృత్తి పెరిగింది. ఎగువన కురుస్తున్న వర్షాలతో పాటు సింగూర్, పోచారం ప్రాజెక్టుల నుంచి వరద నిజాంసాగర్​కు వస్తోంది. ఆదివారం సాయంత్రం ప్రాజెక్టులోకి 39వేల క్యూసేక్కుల ఇన్​ఫ్లో వచ్చింది. ప్రాజెక్టు నీటి మట్టం 1405 అడుగులకు గాను ప్రస్తుతం 1404 అడుగుల వరకు నీరు ఉంది. పూర్తి సామర్థ్యం 17.802 టీఎంసీలకు గాను ఇప్పుడు 17.252 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. 5 గేట్లు ఎత్తి దిగువకు 39వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు.