హైదరాబాద్/జయశంకర్ భూపాలపల్లి/భద్రాచలం వెలుగు: మూడ్రోజులుగా రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు.. ప్రాణహిత, ఇంద్రావతి, మానేరు, శబరి నదుల నుంచి భారీగా వస్తున్న వరదతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. దీంతో భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల ఆఫీసర్లు అలర్ట్ అయ్యారు. గురువారం మధ్యాహ్నం 3.19 గంటలకు భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం 43 అడుగులు దాటగానే జిల్లా కలెక్టర్ ప్రియాంక మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. మూడు జిల్లాల్లోనూ గోదావరి తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు ముమ్మరం చేశారు.
గడిచిన 24 గంటల్లో భూపాలపల్లి జిల్లా పలిమెల మండలంలో అత్యధికంగా 8.8 సెంటీమీటర్లు, ములుగు జిల్లా వెంకటాపురం మండలంలో 8.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం రామన్నగూడెం పుష్కర ఘాట్ వద్ద, వాజేడు మండలం పేరూర్ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. కాగా, గోదావరి ఉధృతితో అన్ని ప్రాజెక్టులకు భారీగా వరద వస్తున్నది. కృష్ణా బేసిన్‌లోని ప్రాజెక్టులు మాత్రం వెలవెలబోతున్నాయి. ఆదిలాబాద్, నిర్మల్జిల్లాల్లో కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద కొనసాగుతోంది. ఈ ప్రాజెక్టుకు 9 వేల క్యూసెక్కులకు పైగా ఇన్‌ఫ్లో వస్తుండగా, గేట్లు ఎత్తి 11 వేల క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు.
మన్యంలో డేంజర్ బెల్స్..
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. గోదావరితో పాటు శబరి నదిలో ప్రవాహ ఉధృతి పెరగడంతో భద్రాచలం మన్యంలో డేంజర్‌బెల్స్ మోగుతున్నాయి. మరో 24 గంటల పాటు గోదావరి వరద ఇలాగే ఉంటుందని కేంద్ర జలసంఘం చెప్పడంతో, నీటిమట్టం 50 అడుగుల గరిష్ట స్థాయికి చేరే ప్రమాదం ఉందని ఆఫీసర్లు అంచనా వేస్తున్నారు. గురువారం సాయంత్రం భద్రాచలం వద్ద గోదావరి వరద 9లక్షల 36వేల 996 క్యూసెక్కులుగా ఉంది. దుమ్ముగూడెం మండలం పర్ణశాలలో సీతవాగు పొంగి సీతమ్మవారి నారచీరలు, దుకాణాలు నీటమునిగాయి.
భద్రాచలంలో గోదావరి కరకట్టపై ఉన్న విస్తా కాంప్లెక్స్, అశోక్నగర్కొత్తకాలనీ స్లూయిజ్‌ల మూసివేతతో పట్టణంలోని రామాలయం, అశోక్‌నగర్ కొత్తకాలనీ నీటమునిగాయి. దీంతో ఆయా కాలనీవాలసులను నన్నపునేని మోహన్ హైస్కూల్ పునరావాస కేంద్రానికి తరలించారు. గోదావరిలో మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేయగానే పాపికొండల టూరిజం రద్దు చేశారు. భద్రాచలం, పర్ణశాల క్షేత్రాల్లో గోదావరిలో బోట్షికార్కూడా రద్దు చేశారు.