హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్లకు భారీగా వరద.. పరిసర ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక

భాగ్యనగరాన్ని భారీ వర్షాలు ముంచెత్తుతున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలతో చాలా ప్రాంతాలు నీటమునిగాయి. అనేక కాలనీలు  జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.  రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని వర్ష బీభత్సం సృష్టించింది. గండిపేట,అత్తాపూర్,మణికొండ తదితర ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. దీంతో మణికొండ మున్సిపాలిటీ పరిధి పంచవటి కాలనీలో పలు అపార్ట్ మెంట్ల సెల్లార్లలోకి వరద నీరు చేరింది. 

భారీ వర్షాలకు  ఉస్మాన్‌సాగర్‌, హిమాయత్‌సాగర్‌ జంట జలాశయాల్లోకి భారీగా వరద ప్రవాహం వచ్చి చేరుతోంది. దీంతో  హిమాయత్ సాగర్ జలాశయం 6 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే ఉస్మాన్ సాగర్ జలాశయం 2 గేట్లను ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు. 

హిమాయత్ సాగర్‌కు 1,300 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. జలాశయం నుంచి మూసీలోకి 1350 క్యూసెక్కులు వదులుతున్నారు.  హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా.. ప్రస్తుత నీటిమట్టం 1761.45 అడుగులకు చేరింది. ఉస్మాన్ సాగర్‌కు 700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ఉస్మాన్ సాగర్  జలాశయం రెండు గేట్ల ద్వారా 216 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1790 అడుగులు కాగా.. ప్రస్తుత నీటి మట్టం 1787.20 అడుగులుగా నమోదైంది.