శ్రీశైలానికి భారీ వరద

శ్రీశైలానికి భారీ వరద
  •     ఓ వైపు జూరాల, మరో వైపు తుంగభద్ర నుంచి ప్రవాహం
  •     ఆల్మట్టి నుంచి 2.75 లక్షలు, నారాయణపూర్‌‌ నుంచి 2.50 లక్షలు.. 
  •     జూరాల నుంచి 2.52 లక్షలు, తుంగభద్ర నుంచి 98 వేల క్యూసెక్కుల వరద
  •     శ్రీశైలానికి 2.54 లక్షల క్యూసెక్కుల ఇన్​ఫ్లో

హైదరాబాద్, వెలుగు : కృష్ణా బేసిన్‌‌లోని నదులకు వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి నీటిని విడుదల చేస్తుండడంతో కృష్ణమ్మ శ్రీశైలం వైపు పరుగులు తీస్తోంది. శ్రీశైలం ప్రాజెక్ట్‌‌లోకి గురువారం 2,54,700 క్యూసెక్కుల భారీ వరద ప్రవాహం నమోదైంది. ఇన్‌‌ఫ్లో క్రమంగా పెరుగుతోంది. ఓ వైపు జూరాల ప్రాజెక్ట్‌‌తో పాటు మరో వైపు తుంగభద్ర ప్రాజెక్ట్‌‌ నుంచి శ్రీశైలంలోకి వరద వస్తోంది. ఆల్మట్టి నుంచి 2.75 లక్షల క్యూసెక్కుల నీరు విడుదల అవుతుండగా, నారాయణపూర్‌‌ నుంచి 2,50,028 క్యూసెక్కులు వస్తోంది. 

ఎగువన మహారాష్ట్రలో భారీ వర్షాలు కురుస్తుండడం, కృష్ణా క్యాచ్‌‌మెంట్‌‌ ఏరియాల్లో భారీ వరద ప్రవాహం నమోదు అవుతుండడంతో ఆల్మట్టి పూర్తిగా నిండకపోయినప్పటికీ నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. వచ్చిన వరద కన్నా ఎక్కువ నీటిని రిలీజ్‌‌ చేస్తున్నారు. జూరాల ప్రాజెక్ట్‌‌లోకి 2.27 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌ఫ్లో ఉండగా 2,48,231 క్యూసెక్కులను బయటకు విడుదల చేస్తున్నారు. తుంగభద్ర ప్రాజెక్ట్‌‌లోకి 98,450 క్యూసెక్కుల ప్రవాహం ఉండగా, 98,404 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. 

మూడు లక్షల క్యూసెక్కులు దాటే ఛాన్స్‌‌

ఆల్మట్టి, నారాయణపూర్‌‌ ప్రాజెక్ట్‌‌ నుంచి దిగువకు మూడు లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని ఆఫీసర్లు చెబుతున్నారు. ప్రస్తుతం మహారాష్ట్రలో అతి భారీ వర్షాలు కురుస్తున్నందున వరదలు మరో వారం పాటు కొనసాగొచ్చని అంటున్నారు. ఈ క్రమంలోనే కృష్ణా నదులకు వరద ప్రవాహం ఎక్కువయ్యే ఛాన్స్‌‌ ఉందంటున్నారు. తుంగభద్ర నుంచి విడుదల మరింత పెరగొచ్చని చెబుతున్నారు.

 తుంగభద్ర దిగువ ప్రాంతాలకు ఇప్పటికే అలర్ట్‌‌ జారీ చేశారు. ఎప్పుడు ఎంత ఫ్లడ్‌‌ అయినా వదిలే అవకాశం ఉందని, అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు చేశారు. ఈ నేపథ్యంలోనే శ్రీశైలంలోకి మూడు లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రవాహం నమోదయ్యే అవకాశాలు లేకపోలేదని అంటున్నారు. శ్రీశైలం రిజర్వాయర్‌‌ కెపాసిటీ 215.81 టీఎంసీలు కాగా ప్రస్తుతం 92.49 టీఎంసీల నీటి నిల్వ ఉంది. 

దిగువకు 31,784 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నాగార్జునసాగర్‌‌ కెపాసిటీ 312.05 టీఎంసీలు కాగా ప్రస్తుతం 121.87 టీఎంసీల నీరుంది. శ్రీశైలం నుంచి సాగర్‌‌కు 6,500 క్యూసెక్కులు వస్తున్నాయి. 

గోదావరి బేసిన్‌‌లో నిలకడగా వరద ప్రవాహం

గోదావరి బేసిన్‌‌లో వరద ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. శ్రీరాంసాగర్‌‌కు 21,650 క్యూసెక్కులు, కడెంకు 10,536 క్యూసెక్కులు, శ్రీపాద ఎల్లంపల్లికి 20,998 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. మేడిగడ్డ నుంచి 7.71 లక్షల క్యూసెక్కులు, సమ్మక్కసాగర్​ నుంచి 9.5 లక్షల క్యూసెక్కులు, సీతమ్మసాగర్‌‌ నుంచి 11.48 లక్షల క్యూసెక్కులు, భద్రాచలం నుంచి 10.11 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. 

జూరాల 46 గేట్లు ఓపెన్‌‌‌‌‌‌‌‌

గద్వాల, వెలుగు: మహారాష్ట్ర, కర్నాటకలో భారీ వర్షాలు పడుతుండడంతో జూరాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌కు వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో గురువారం జూరాల ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌ 46 గేట్లను ఓపెన్‌‌‌‌‌‌‌‌ చేసి నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల ఫుల్‌‌‌‌‌‌‌‌ కెపాసిటీ 9.657 టీఎంసీలు కాగా ప్రస్తుతం 6.340 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఇక్కడి నుంచి గేట్ల ద్వారా 2,25,354 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తుండగా, విద్యుత్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి కోసం 19,516 క్యూసెక్కులు, నెట్టెంపాడు లిఫ్ట్‌‌‌‌‌‌‌‌కు 1,500, భీమా-1కు 1,300, భీమా-2కి 750, సమాంతర కాల్వకు 300, లెఫ్ట్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌కు 870, రైట్‌‌‌‌‌‌‌‌ కెనాల్‌‌‌‌‌‌‌‌కు 596 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జూరాలకు ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో 2.27 లక్షల క్యూసెక్కులు ఉండగా, అవుట్‌‌‌‌‌‌‌‌ ఫ్లో 2,48,231 క్యూసెక్కులుగా ఉంది.

రాష్ట్రమంతా మళ్లీ ముసురు

రాష్ట్రమంతటా గురువారం ముసురు పట్టింది. అన్ని జిల్లాల్లోనూ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఉమ్మడి మహబూబ్‌‌నగర్‌‌, ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లో మినహా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురిశాయి. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్‌‌ జిల్లా సిర్పూర్‌‌లో 4.9 సెంటీమీటర్ల వాన పడింది. జయశంకర్‌‌ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో 4.6, కుమ్రంభీం జిల్లా లోనవెల్లిలో 4.5, కౌటాలలో 3.8, నిజామాబాద్‌‌ జిల్లా మాగిడిలో 3.6, మంచిర్యాల జిల్లా భీమినిలో 2.8, బాల్కొండలో 2.8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 

హైదరాబాద్‌‌లోనూ ఉదయం నుంచి రాత్రి వరకు ఆగకుండా జల్లులు పడ్డాయి. యూసుఫ్‌‌గూడలో 1.3 సెంటీమీటర్లు, గాజులరామారంలో 1.2, లంగర్‌‌హౌజ్‌‌లో 1.2, కూకట్‌‌పల్లిలో 1.1, గణాంకభవన్‌‌లో 1.1 సెంటీమీటర్ల వర్షం పడింది. మరో రెండు రోజుల పాటు రాష్ట్రంలో ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. రాష్ట్రవ్యాప్తంగా ఈదురుగాలుల ప్రభావం ఉంటుందని వెల్లడించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. 

కృష్ణా, గోదావరి బేసిన్‌‌లోని ప్రాజెక్టుల పరిస్థితి

ప్రాజెక్ట్‌‌            కెపాసిటీ        ప్రస్తుత నిల్వ    ఇన్​ఫ్లో    అవుట్​ఫ్లో
టీఎంసీల్లో)    (టీఎంసీల్లో)    (క్యూసెక్కులు)    (క్యూసెక్కులు)

ఆల్మట్టి             129.72              90.13                   1,98,000    2,75,000
నారాయణపూర్​    37.64            30.77                  2,40,000    2,50,028
జూరాల                9.66               6.34                     2,27,000    2,52,605
తుంగభద్ర          105.79          102.66                    98,450       98,404
శ్రీశైలం                215.81           92.49                     2,54,700    31,784
నాగార్జునసాగర్‌‌    312.05         121.87                      6,500         00

గోదావరి బేసిన్‌‌లో..

సింగూరు                29.917    13.90    1,444       00
నిజాంసాగర్‌‌           17.800       3.45    960          00
శ్రీరాంసాగర్            80.500     26.77    21,650    00
కడెం                          7.600        5.74    10,536    13,082
శ్రీపాద ఎల్లంపల్లి      20.175    14.49    20,998    00
మేడిగడ్డ                     16.170    00    7,71,580    7,71,580
సమ్మక్కసాగర్            6.940    00    9,50,420    9,50,420
సీతమ్మసాగర్‌‌              36.57    00    11,47,940    11,47,940
భద్రాచలం                      00    00    10,11,364    10,11,364