ఇన్ ఫ్లో 3 లక్షల 25 వేల క్యూసెక్కులు
డ్యామ్ కెపాసిటీ: 885 అడుగులు.. 215.807 టీఎంసీలు..
ప్రస్తుతం డ్యామ్ నీటిమట్టం: 877.10 అడుగులు.. 172 టీఎంసీలు
ఔట్ ఫ్లో: 40, 25 క్యూసెక్కులు (తెలంగాణ పరిధిలోని ఎడమగట్టు విద్యుత్ కేంద్రం ద్వారా)
కర్నూలు: కృష్ణా నదిలో వరద పరవళ్లు తొక్కుతోంది. ఓ వైపు తుంగభద్ర.. మరో వైపు జూరాల రెండు వైపుల నుండి భారీగా వస్తోంది. దీంతో ఈ సీజన్లోనే తొలిసారిగా శ్రీశైలం డ్యామ్ ఇన్ ఫ్లో 3 లక్షల క్యూసెక్కులు దాటింది. డ్యామ్ నీటిమట్టం కూడా వేగంగా పెరుగుతోంది. నిన్న మొన్నటి వరకు నెమ్మదిగా పెరిగిన నీటిమట్టం రెండు రోజులుగా వరద ఉధృతి వల్ల వడివడిగా పెరుగుతోంది.
ఎగువన కర్నాటక, మహారాష్ట్ర లోని ఆల్మట్టి.. నారాయణ పూర్ ల మదుగా జూరాలకు 3 లక్షల 10 వేల క్యూసెక్కులు వస్తోంది. దీంతో అధికారులు మరో మూడు వేల క్యూసెక్కులు ఎక్కువగా అంటే 3 లక్షల 13 వేల క్యూసెక్కులు దిగువన శ్రీశైలం డ్యాంకు విడుదల చేస్తున్నారు. జూరాల ప్రాజెక్టు పూర్తిగా నిండిపోవడంతో మొత్తం 39 గేట్లు ఎత్తేశారు.
మరో వైపు తుంగభద్ర డ్యాం నుండి విడుదల చేస్తున్న వరద ఆర్డీఎస్.. సుంకేశుల మీదుగా శ్రీశైలం డ్యాంకు చేరుకుంటోంది. ప్రస్తుతం తుంగభద్ర డ్యాం వద్ద 20 గేట్లు రెండు అడుగుమేర ఎత్తి 61 వేల 464 క్యూసెక్కులు దిగువన నదిలోకి విడుదల చేస్తున్నారు. ఈ వరదకు స్థానిక వర్షాలు కూడా తోడవడంతో తుంగభద్ర నదిలో వరద పరవళ్లు తొక్కుతోంది. కర్నూలు సమీపంలోని సుంకేశుల వద్ద 7 గేట్లు ఎత్తి దిగువన శ్రీశైలంకు 22 వేల 554 క్యూసెక్కులు.. కర్నూలు-కడప కాలువకు మరో 1200 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
శ్రీశైలం డ్యాం వద్ద తాజా పరిస్థితి….
జూరాల నుండి 39 గేట్ల ద్వారా 3 లక్షల 13 వేల 777 క్యూసెక్కులు.. విద్యుత్ ఉత్పత్తి ద్వారా మరో 23వేల 531 క్యూసెక్కులు శ్రీశైలం డ్యామ్ కు విడుదల చేస్తున్నారు. మరో వైపు తుంగభద్ర నది వరద సుంకేశుల మీదుగా.. మరో 22 వేల క్యూసెక్కులు శ్రీశైలం డ్యామ్ కు తోడవుతోంది. మొత్తం 3 లక్షల 25 వేల 173 క్యూసెక్కుల ఇన్ ఫ్లో శ్రీశైలం చేరుకుంటోంది. ఔట్ ఫ్లో విషయానికి వస్తే.. తెలంగాణ ప్రభుత్వ పరిధిలోని ఎడమ గట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి ద్వారా దిగువకు 40 వేల 259 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. శ్రీశైలం డ్యామ్ పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు… 215.807 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం శ్రీశైలం డ్యామ్ నీటిమట్టం 876 అడుగులతో.. 172 టీఎంసీలకు చేరుకుంది. మరో 43 టీఎంసీలు వస్తే శ్రీశైలం డ్యామ్ పూర్తి గా నిండిపోతుంది.
అలర్ట్ అయిన అధికారులు
నారాయణపేట జిల్లాలో కృష్ణా నదిలో పుట్టి మునిగి నలుగురు గల్లంతైన ఘటన చోటు చేసుకోవడంతో అధికారులు అలర్టయ్యారు. కృష్ణా నదితోపాటు.. తుంగభద్ర రెండు నదుల్లో వరద పరవళ్లు తొక్కుత్తుండడంతో కర్నూలు జిల్లా అధికారులు అలర్టయ్యారు. తుంగభద్ర నది తీరం వెంబడి జిల్లా కలెక్టర్ వీర పాండియన్ స్వయంగా సందర్శించారు. సుంకేశుల బ్యారేజీ వద్దకు చేరుకుని వరద ప్రవాహంపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. జాయింట్ కలెక్టర్ రవి పఠన్ షెట్టి ఇరిగేషన్ ఎస్. ఈ రామచంరమూర్తితో కలసి వరద సహాయక చర్యలపై చర్చించారు. శ్రీశైలం డ్యాం కు వరద కొనసాగుతుండడంతో నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలను అప్రమత్తం చేయాల్సిందిగా ఆయా గ్రామాల్లోని అధికారులు.. సిబ్బందికి ఆదేశించారు. వర్షాలు తగ్గుముఖం పడుతున్నా.. అప్రమత్తంగానే వ్యవహరించాలని హెచ్చరించారు. శ్రీశైలం డ్యామ్ కు ఇంకా ఎన్ని రోజులు వరద కొనసాగుతుంది.. డ్యామ్ నిండుతుందా.. ఎప్పట్లోగా నిండే అవకాశం ఉందన్న వివరాలతో నిరంతరం అప్రమత్తంగా వ్యవహరించాలని.. రాత్రి పూట కూడా నది తీర ప్రాంతాల్లో గస్తీ తిరగాలని ఇరిగేషన్ అధికారులకు జిల్లా కలెక్టర్ వీర పాండియన్ ఆదేశాలిచ్చారు.