జూరాలకు భారీ వరద.. 22 గేట్లు ఎత్తిన అధికారులు

జూరాలకు భారీ వరద..  22 గేట్లు ఎత్తిన అధికారులు

గద్వాల,వెలుగు : జూరాల ప్రాజెక్టుకు కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్ తో పాటు కృష్ణానదికి ఉపనది అయిన భీమా నది నుంచి భారీగా వరద వస్తున్నది. దీంతో జూరాల ప్రాజెక్టు దగ్గర శుక్రవారం 22 గేట్లు ఎత్తివేసి శ్రీశైలం ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నారు. జూరాల హైడల్ ప్రాజెక్టు దగ్గర 6 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తున్నారు. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యాం నుండి1,75 వేల క్యూసెక్కుల నీరు నారాయణపూర్ డ్యామ్ కు వదులుతున్నారు. నారాయణపూర్ డ్యామ్ నుంచి 26 గేట్లను ఎత్తి జూరాల ప్రాజెక్టుకు 1,57,500 క్యూసెక్కులను రిలీజ్​చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల దగ్గర 316.910 మీటర్ల వరకు నీటిని నిల్వ ఉంచుకొని 22 గేట్లను ఎత్తి 83,138 వేల క్యూసెక్కులు, విద్యుత్ ఉత్పత్తి చేసిన తర్వాత 37,252 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నెట్టెంపాడు లిఫ్ట్ కు 750 క్యూసెక్కులు, బీమా లిఫ్ట్-–1కి 650 క్యూసెక్కులు, లెఫ్ట్​కెనాల్ కు 390 క్యూసెక్కుల నీటిని వదిలేస్తున్నారు. మొత్తంగా జూరాల ప్రాజెక్టు నుంచి 1,22,282 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు.

శ్రీశైలానికి కొనసాగుతున్న వరద  

శ్రీశైలం : భారీ వర్షాల కారణంగా శుక్రవారం శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతంగా వస్తోంది.  ఇన్ ఫ్లో 1,24,818 క్యూసెక్కులుగా ఉంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు ఉండగా, ప్రస్తుతం 825.90 అడుగులకు చేరింది.