దుబాయ్ లో వరదలు.. మునిగిపోయిన మాల్స్, ఎయిర్ పోర్టులు

దుబాయ్.. ఎడారి దేశం.. అలాంటి దేశం ఇప్పుడు వరదలతో మునిగిపోయింది. కేవలం గంటన్నర సమయం.. అంటే 90 నిమిషాల్లో.. రెండు సంవత్సరాలపాటు పడాల్సిన వర్షం పడింది.. 90 నిమిషాల్లో.. 750 రోజుల వర్షం పడటంతో.. దుబాయ్ అల్లకల్లోలం అయ్యింది.. ఈదురుగాలులకు చెట్లు కూలిపోయాయి.. కుండపోత వర్షానికి రోడ్లు జలమయం అయ్యాయి.. మాల్స్ లోకి నీళ్లు వచ్చాయి.. దుబాయ్ ఎయిర్ పోర్టులో నీళ్లు నిలిచాయి. అవి రోడ్లా లేక నదులా అన్నట్లు నీళ్లు పోటెత్తాయి. రైల్వే వ్యవస్థ దెబ్బతిన్నది.. సబ్ వేలు అన్నీ మునిగిపోయాయి.. కార్లు కొట్టుకుపోయాయి.. దుబాయ్ తీరాన్ని తాకిన తుఫాన్ తో ఈ విలయం జరిగింది.

 

 భారీ వర్షాలు, వరదలతో UAEలో జన జీవనం స్తంభించింది. దీంతో స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. ఇండ్ల నుంచి బయటకు వచ్చే పరిస్థితి లేకపోవడంతో ప్రైవేట్ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించారు.  ఫుజైరా ఎమిరేట్ లో దుబాయ్ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. UAE తూర్పు తీరంలోని ఎమిరేట్‌లో మంగళవారం145 మిల్లీమీటర్లు (5.7 అంగుళాలు) భారీ వర్షపాతం కురిసింది. 

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ప్రపంచంలోని అతిపెద్ద షాపింగ్ కేంద్రాలలో ఒకటైన మాల్ ఆఫ్ ఎమిరేట్స్ లోపల సీలింగ్ నుండి వర్షపు నీరు కురవడంతో పైకప్పు భాగాలు ఊడి క్రిందపడిపోయాయి. గత 75 సంవత్సరాలల్లో ఇది దేశంలో అతిపెద్ద వర్షపాతంగా అధికారులు తెలిపారు. ఇక, షార్జా సిటీ సెంటర్, దీరా సిటీ సెంటర్ భారీ వర్షపాతం నమోదైనట్లు వెల్లడించారు.

Also Read:పోటెత్తిన వరద..నీట మునిగిన మెట్రో స్టేషన్

రోడ్లపై నిలిచిపోయిన నీటిని ట్రక్కుల్లో నింపి క్లియర్ చేస్తున్నారు. భారీ వర్షాలు కురుస్తున్న క్రమంలో దేశవ్యాప్తంగా వచ్చే 48 గంటలపాటు జాతీయ వాతావరణ కేంద్రం రెడ్ అలర్ట్ జారీ చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని.. అత్యవసర పరిస్థితుల్లో తప్ప బయటకు రావొద్దని హెచ్చరించింది.మరోవైపు భారీ వర్షాలతో ఒమన్ లో మృతి చెందిన వారి సంఖ్య 18కి చేరింది.