31 మంది మృతి.. 43 మంది గల్లంతు
బీజింగ్/కాబూల్: అఫ్గానిస్తాన్, చైనాలో ఆదివారం కుండపోత వర్షాలతో భారీ వరదలు ముంచెత్తాయి. అఫ్ఘాన్ లోని వివిధ ప్రాంతాల్లో 26 మంది చనిపోగా, 40 మంది గల్లంతయ్యారు. చైనాలో ఐదుగురు మృతిచెందగా, ముగ్గురు గల్లంతు అయ్యారు. అఫ్గానిస్తాన్‌లో సీజనల్ వర్షాలతో వరదలు పోటెత్తాయి. ఫ్లాష్ ఫ్లడ్స్కారణంగా 26 మంది ప్రాణాలు కోల్పోయారు. సుమారు 40 మంది గల్లంతయ్యారని తాలిబన్ అధికార ప్రతినిధి, స్థానిక అధికారులు తెలిపారు. ప్రభుత్వ ప్రతినిధి జుబిహుల్లా ముజాహిద్ఆదివారం మాట్లాడుతూ.. వెస్ట్ కాబుల్ లో ఆకస్మిక వరదలతో 40 మందికిపైగా గల్లంతయ్యారని చెప్పారు. వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజలకు అవసరమైన సహాయం అందించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించిందని తెలిపారు. వరదల వల్ల వందలాది ఇండ్లు దెబ్బతిన్నాయని, కుప్పకూలిన ఇండ్ల శిథిలాల్లో పలువురు చిక్కుకున్నట్లు భావిస్తున్నామని వార్దాక్ గవర్నర్ కార్యాలయం ప్రకటించింది.
ఇక చైనాలో పోటెత్తిన వరదల ధాటికి ఐదుగురు మృతిచెందగా, ముగ్గురు గల్లంతయ్యారు. సుమారు1500 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఫుయంగ్ జిల్లాలో భారీ వరదలు పోటెత్తినట్లు చైనా నేషనల్ రేడియో తెలిపింది. ఎడతెరిపిలేని వర్షాలతో జిల్లాలోని 1600కు పైగా ఇండ్లలో కరెంటు నిలిచిపోయింది. కాగా, ప్రతి ఏటా చైనాలోని చాలా ప్రాంతాలు భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్నాయి. ఈ సారి ఉత్తర చైనాలో గత 50ఏండ్లలో లేనివిధంగా భారీ వరదలు వచ్చాయి.