పదాంగ్ (ఇండోనేసియా): కుండపోత వర్షాల కారణంగా ఇండోనేసియాలో ఆకస్మిక వరదలు, కొండచరియలు విరిగిపడి దాదాపు 19 మంది మృతి చెందారు. మరో ఏడుగురు గల్లంతయ్యారని అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సుమత్రా ఐల్యాండ్‌లో కురిసిన భారీ వర్షాలకు శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత కొండచరియలు విరిగిపడ్డాయని, బురద, కొండలపై ఉన్న చెట్లు కొట్టుకొని వచ్చాయన్నారు. దీంతో పెసిసిర్ సెలటన్ జిల్లాలోని నదీ తీరంలో, కొండ ప్రాంతాల్లోని నివాసం ఉండే పలువురు కొట్టుకుపోయారని తెలిపారు.
వరదలు తగ్గాక శనివారం పలు ప్రాంతాల్లో 19 డెడ్‌బాడీలను రికవరీ చేసుకున్నామని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ ఏజెన్సీ అధికారులు వెల్లడించారు. దాదాపు 80 వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. సుమత్రా ప్రావిన్స్‌లోని 9 జిల్లాల్లో 20 వేలకు పైగా ఇండ్లు ధ్వంసం అయ్యాయని వెల్లడించారు. భారీ వరదలతో ప్రధాన మార్గాలపై కొండచరియలు పడ్డాయని, రోడ్లు కొట్టుకుపోయాయని చెప్పారు.