- జూరాలకు 1.11 లక్షలు.. శ్రీశైలానికి లక్ష క్యూసెక్కులు
- భద్రాచలం వద్ద ఉధృతంగా గోదారి.. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
- కుంటాల జలపాతానికి మూడ్రోజుల పాటు నో ఎంట్రీ
- రాష్ట్రవ్యాప్తంగా ముసురు.. మరో రెండ్రోజులు భారీ వర్షాలు
హైదరాబాద్/నెట్ వర్క్, వెలుగు : భారీ వర్షాలతో కృష్ణా, గోదావరి బేసిన్లలోని ప్రాజెక్టులకు వరద పోటెత్తుతున్నది. కృష్ణా బేసిన్లో ముఖ్యమైన ఆల్మట్టి, నారాయణపూర్ రిజర్వాయర్ల నుంచి లక్షన్నర క్యూసెక్కులకు పైగా కిందికి విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి డ్యామ్‌కు 1.24 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, లక్షన్నర క్యూసెక్కులు రిలీజ్ చేస్తున్నారు. నారాయణపూర్‌కు 1.25 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 1.45 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
జూరాలకు 1.11 లక్షల క్యూసెక్కుల ఫ్లో వస్తుండగా, 1.19 లక్షల క్యూసెక్కులను కిందికి వదులుతున్నారు. దీంతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పెరుగుతున్నది. ప్రస్తుతం శ్రీశైలానికి లక్ష క్యూసెక్కుల వరద వస్తుండగా, నీటి నిల్వ 42.73 టీఎంసీలకు పెరిగింది. ఇక తుంగభద్రకు కూడా వరద ఎక్కువే వస్తున్నది. ప్రస్తుతం ఆ ప్రాజెక్టుకు 1.17 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది.
మొన్నటిదాకా తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వ 40 టీఎంసీల వరకే ఉండగా.. ఇప్పుడు 78.67 టీఎంసీలకు చేరింది. మరో 27 టీఎంసీలు వస్తే ఆ ప్రాజెక్ట్ నిండుతుంది. వరద ఇలాగే కొనసాగితే తుంగభద్ర మరో నాలుగైదు రోజుల్లో నిండే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వరద కొనసాగితే మరో మూడ్రోజుల్లో తుంగభద్ర నుంచి కూడా నీటి విడుదల మొదలయ్యే అవకాశం ఉందంటున్నారు.
గోదావరి వరద సముద్రంలోకి..
గోదావరి బేసిన్ లోని ప్రాజెక్టులకు కూడా వరద పోటెత్తుతున్నది. వచ్చిన వరద వచ్చినట్టే సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. మేడిగడ్డకు 5.52 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, వచ్చిన వరదను వచ్చినట్టే దిగువకు విడుదల చేస్తున్నారు. తుపాకులగూడెం వద్దనున్న సమ్మక్కసాగర్ బ్యారేజీకి 8.23 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, అక్కడ కూడా వచ్చిన వరదను వచ్చినట్టు సముద్రంలోకి వదులుతున్నారు.
దుమ్ముగూడెంలోని సీతమ్మసాగర్ ప్రాజెక్టుకు 9 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా, అంతే మొత్తాన్ని కిందికి రిలీజ్ చేస్తున్నారు. ఇక శ్రీరాంసాగర్, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులకు కూడా వరద క్రమంగా పెరుగుతున్నది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు 18,518 క్యూసెక్కులు, శ్రీపాద ఎల్లంపల్లికి 42,314 క్యూసెక్కుల వరద వస్తున్నది. తాలిపేరు ప్రాజెక్టు 25 గేట్లు ఎత్తి 83,013 క్యూసెక్కులను గోదావరిలోకి వదులుతున్నారు.
ఇడ్వని వానలు..
రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం అన్ని జిల్లాల్లోనూ వానలు పడ్డాయి. ములుగు, హనుమకొండ, కరీంనగర్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిశాయి. సిద్దిపేట, జనగామ, వరంగల్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు కురిశాయి. హైదరాబాద్‌లో ఉదయం నుంచి మబ్బులు కమ్మేసి ముసురు పట్టింది.
ములుగు జిల్లా ఏటూరునాగారంలో అత్యధికంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. అదే జిల్లా మల్లంపల్లిలో 11.7, ఆలుబాకలో 9.9, హనుమకొండ జిల్లా కమలాపూర్‌లో 8.2, నాగారంలో 7.9, ములుగు జిల్లా వెంకటాపూర్‌లో 7.6, మేడారంలో 7.5, హనుమకొండ జిల్లా పాలకుర్తిలో 7.1, శాయంపేటలో 7.1, కరీంనగర్ జిల్లా బోర్నపల్లిలో 6.9, భద్రాద్రి జిల్లా సత్యనారాయణపురంలో 6.3, హనుమకొండ జిల్లా నడికుడలో 6.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్జారీ చేసింది.
సింగరేణిలో 60 కోట్ల విలువైన బొగ్గు ఉత్పత్తికి బ్రేక్..
ఎడతెరిపిలేని వానలతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి బ్రేక్ పడింది. ఓపెన్ కాస్ట్ గనుల్లో ఉత్పత్తి నిలిపివేశారు. గురు, శుక్ర, శనివారాల్లో దాదాపు రూ.60 కోట్ల విలువైన 1,87,939 టన్నుల బొగ్గు ఉత్పత్తి ఆగిపోయిందని అధికారులు తెలిపారు.
రెండేండ్ల తర్వాత శ్రీశైలానికి భారీ వరద
దాదాపు రెండేండ్ల తర్వాత శ్రీశైలం ప్రాజెక్టుకు భారీ వరద వస్తున్నది. నిరుడు కేవలం 2 వారాలు మాత్రమే వరద రావడంతో శ్రీశైలం నిండలేదు. ప్రాజెక్టు ఫుల్ కెపాసిటీ 215.18 టీఎంసీలు కాగా, కేవలం 97.61 టీఎంసీలకే చేరుకుంది. దీంతో పోయినేడాది నాగార్జున సాగర్‌కు నీటిని విడుదల చేయలేదు. 2022లో భారీగా వరద రావడంతో జులై 23న గేట్లు ఎత్తి సాగర్‌కు నీటి విడుదల చేశారు.
విలీన మండలాలు విలవిల..
భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ప్రస్తుతం వరద 43 అడుగులకు చేరుకున్నది. 6.29 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతున్నది. దీంతో కలెక్టర్ జితేశ్ వి పాటిల్ ఆదివారం సాయంత్రం మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో నీటిమట్టం 50 అడుగులకు పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. గోదావరి కరకట్ట వద్ద వరద పరిస్థితిని కలెక్టర్, ఎస్పీ పరిశీలించారు.
సెక్టోరియల్ ఆఫీసర్లు తక్షణమే కేటాయించిన మండలాలకు వెళ్లాలని కలెక్టర్ ఆదేశించారు. ముంపు ప్రాంతాల ప్రజలను రీహాబిలిటేషన్ సెంటర్లకు తరలించేందుకు ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గజ ఈతగాళ్లను, నాటు పడవలను సిద్ధం చేయాలన్నారు. గోదావరితో పాటు ఉపనదులు, వాగుల వద్ద పర్యాటకుల రాకపై నిషేధాజ్ఞలు విధించారు. మత్స్యకారులు గోదావరి, వాగుల్లోకి చేపలు పట్టేందుకు వెళ్లొద్దని హెచ్చరించారు.
కలెక్టరేట్, ఐటీడీఏ, భద్రాచలం ఆర్డీవో ఆఫీసుల్లో కంట్రోల్‌రూమ్స్ ఏర్పాటు చేశారు. కాగా, ఏపీలో విలీనమైన ఎటపాక, చింతూరు, కూనవరం, వీఆర్ పురం, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలు విలవిల్లాడుతున్నాయి. శబరి, సీలేరు నదులు ఉప్పొంగుతుండడంతో పాటు పోలవరం బ్యాక్ వాటర్గ్రామాలను ముంచెత్తుతోంది. చింతూరు మండలం చట్టి వద్ద జగదల్పూర్–-విజయవాడ హైవే పైకి వరద చేరడంతో ఆంధ్రా, చత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాలకు రాకపోకలు నిలిచిపోయాయి. కూనవరం, చింతూరు, వీఆర్‌పురం మండలాల్లోని పలు గ్రామాల ప్రజలు ఊళ్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు.
కడెం వద్ద హైఅలర్ట్..
నిర్మల్ జిల్లాలోని కడెం, స్వర్ణ ప్రాజెక్టుల పరీవాహక ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు. ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావొద్దని హెచ్చరించారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు 10,175 క్యూసెక్కుల ఇన్ ఫ్లో ఉండగా.. మూడు గేట్లు తెరిచి 14,533 క్యూసెక్కులను కిందికి విడుదల చేస్తున్నారు. అలాగే స్వర్ణ ప్రాజెక్టులోకి వరద క్రమంగా పెరుగుతున్నది. ప్రస్తుతం 1,300 క్యూసెక్కుల ఇన్ ఫ్లో వస్తున్నది.
కుంటాలకు నో ఎంట్రీ..
ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం ఉప్పొంగి ప్రవహిస్తున్నది. దీంతో మూడ్రోజుల పాటు పర్యాటకులకు అనుమతి లేదని ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ గణేశ్ తెలిపారు. అలాగే ఆసిఫాబాద్‌జిల్లా తిర్యాణి మండలంలోని చింతల్ మాదర, చెచ్చెర జలపాతాల వద్దకు మూడ్రోజుల పాటు అనుమతి లేదని ఇన్చార్జ్ రేంజర్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు.