జవహర్ నగర్ డంపింగ్ యార్డు పై హెవీ లోడ్​

జవహర్ నగర్ డంపింగ్ యార్డు పై హెవీ లోడ్​
  • ఇప్పటికే 14 మిలియన్ టన్నుల చెత్త క్యాపింగ్
  • రోజురోజుకూ పెరుగుతున్న డెబ్రిస్​ 
  • ఇప్పుడు రోజూ 7,500 టన్నులు ఉత్పత్తి
  • రెండు చోట్ల వేస్ట్​టు ఎనర్జీ ప్లాంట్లకు 2 వేల టన్నుల చెత్త 
  • కొత్త ఎనర్జీ ప్లాంట్లు, డంపింగ్​యార్డులతోనే సమస్యకు పరిష్కారం  

హైదరాబాద్ సిటీ, వెలుగు : జవహర్ నగర్ డంపింగ్ యార్డుపై లోడ్ పెరుగుతోంది. సిటీలో రోజురోజుకూ చెత్త పెరుగుతుండడంతో డంపింగ్ యార్డు పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతోంది. ఇప్పటికే ఇక్కడ 14 మిలియన్​టన్నుల చెత్తను క్యాపింగ్ చేశారు. యార్డు నిర్వహణ పనులు స్టార్ట్​ చేసినప్పుడు  గ్రేటర్‌‌‌‌ నుంచి రోజుకు 2,500 -నుంచి 3 వేల  టన్నుల చెత్త వచ్చేది. అప్పట్లో దానికి తగ్గట్లు నిర్వహణ ఉండేది.

ప్రస్తుతం గ్రేటర్​లో రోజుకు 7,500  టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా..అదంతా జవహర్​నగర్​డంపింగ్ యార్డుకే తరలిస్తుండడంతో సమస్య పెరిగిపోతున్నది. ఇక్కడున్న 24 మెగావాట్ల కెపాసిటీతో కొనసాగుతున్న వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ కు 1200 టన్నుల చెత్త మాత్రమే వెళ్తుండడంతో ప్రయోజనం లేకుండా పోతున్నది. మిగతా చెత్తను రీసైక్లింగ్ చేసి ఎనర్జీ ప్లాంట్ కు పంపేంత వరకు స్టోర్​చేస్తున్నామని అధికారులు చెప్తున్నారు. మరో 24 మెగావాట్ల ప్లాంట్ ఏర్పాటు కావాల్సి ఉండగా, త్వరలోనే పనులు పూర్తవుతాయని బల్దియా అధికారులు చెబుతున్నా..దానికి టైం పట్టేలా ఉంది.  

ముందుకు సాగని కొత్త ప్లాంట్ల పనులు 

జవహర్ నగర్ యార్డు సమస్యను పరిష్కరించేందుకు కొత్తగా వేస్ట్​టు ఎనర్జీ ప్లాంట్స్​ఏర్పాటు చేసి సమస్య పరిష్కరిద్దామనుకున్నా పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం దుండిగల్ లో మాత్రమే ప్లాంట్ నడుస్తోంది. మిగతాచోట్ల ప్రతిపాదనకే పరిమితమయ్యాయి. దుండిగల్​లో 14.5 మెగావాట్ల సామర్థ్యంతో ప్లాంట్ కొనసాగుతోంది. ఇక్కడకు రోజూ 800 టన్నుల చెత్త వస్తోంది. దీంతో పాటు సంగారెడ్డి జిల్లా ప్యారానగర్‌‌‌‌లోని 152 ఎకరాల స్థలంలో 15 మెగా వాట్ల కెపాసిటీతో వేస్ట్ -టు -ఎనర్జీ ప్లాంట్‌‌ ఏర్పాటు ప‌‌నులు కొనసాగుతున్నాయి. 

స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తుండడంతో వారికి నచ్చజెప్పి ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఇలా గ్రేటర్ లో ఉత్పత్తి అవుతున్న చెత్తలో కేవలం 2వేల టన్నుల చెత్త మాత్రమే జవహర్ నగర్ తో పాటు దుండిగల్ ఎనర్జీ ప్లాంట్ కు వెళ్తోంది. ఇంకా రోజూ 5500 టన్నుల చెత్త మిగులుతోంది. దాన్ని రీస్లైక్లింగ్ చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నా నిర్వహణ లోపాలతో పాటు కెపాసిటీ సరిపోక సగం చెత్తను డంపింగ్‌‌‌‌ ఫ్లోర్‌‌‌‌ పై పడేస్తున్నట్లు తెలుస్తోంది. 

15 నుంచి 18 ప్రాంతాలకు దుర్వాసన 

డంపింగ్​యార్డు విస్తీర్ణం 351 ఎకరాలు కాగా, చుట్టు పక్కల 15 నుంచి 18 ప్రాంతాలకు దుర్వాసన వస్తోంది.  జవహర్‌నగర్‌, దమ్మాయిగూడ, కార్మిక నగర్‌, బాలాజీనగర్‌, గబ్బిలాలపేట, అంబేద్కర్‌నగర్‌, మల్కారం, రాజీవ్‌గాంధీ నగర్‌, శాంతి నగర్‌, ప్రగతి నగర్‌, హరిదాసుపల్లి, చెన్నాయిపల్లి, బీజేఆర్‌నగర్‌, అహ్మద్‌గూడ, తిమ్మాయపల్లి, నాగారం, బండ్లగూడ, రాంపల్లి ప్రాంతాలతో పాటు సాయంత్రమైతే యాప్రాల్, సైనిక్ పురి, ఈసీఎల్ ప్రాంతాల వరకు దుర్గంధం వెదజల్లుతోంది. చెత్త నుంచి దుర్వాసన రాకుండా కెమికల్  స్ప్రే చేస్తుండడంతో అది సమస్యను కొంత వరకు మాత్రమే పరిష్కరించగలిగింది.  

కొత్తగా డంపింగ్​యార్డు కోసం ప్రతిపాదనలు 

జవహర్ నగర్ డంపింగ్ యార్డుపై భారం తగ్గించేందుకు బల్దియా ప్రత్యామ్నాయాలను అన్వేషిస్తోంది. సిటీని ఆనుకుని ఉన్న మేడ్చల్, యాదాద్రి, రంగారెడ్డి, సంగారెడ్డి జిల్లాల్లో డంపింగ్​యార్డుల కోసం స్థలాలను గుర్తించింది. రంగారెడ్డి జిల్లా తలకొండపల్లి మండలం ఖానాపూర్ లో 42.22 ఎకరాలు, సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరువు మండలం లక్డారంలో 100 ఎకరాలు, మేడ్చల్​జిల్లాలోని దుండిగల్​లో 85 ఎకరాలు, చౌటుప్పల్ మండలం మల్కాపూర్ వద్ద 200 ఎకరాలను గుర్తించింది. ప్రతిపాదిత స్థలాల్లో చెత్త ప్రాసెసింగ్​యూనిట్ల ఏర్పాటుకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని ఆయా జిల్లాల కలెక్టర్లను జీహెచ్ఎంసీ కోరింది. 

ఖర్చు పెట్టినా మారలే..

జవహర్​నగర్ డంపింగ్ యార్డులో ఏండ్లుగా పేరుకుపోయిన చెత్తకు ఐదేండ్ల కిందట రూ.147 కోట్లతో క్యాపింగ్ ​చేశారు. ఆ చెత్తను పదేండ్ల పాటు అలాగే ఉంచాలి. ఈ క్రమంలో క్యాపింగ్ చేసిన చెత్తనుంచి వచ్చే నీటిని శుద్ధి చేసి బయటకు పంపేందుకు 2023లో రూ.251 కోట్లతో లీచెట్ ట్రీట్​మెంట్ ప్లాంట్​ను అప్పటి మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 2 వేల కేఎల్​డీ సామర్థ్యం కలిగిన ఈ లీచెట్ ట్రీట్​మెంట్ ప్లాంట్​నిర్వహణ బాధ్యతలను పదేండ్ల పాటు రాంకీ సంస్థకు అప్పగించారు. అయితే, క్యాపింగ్​చేసిన చోటి నుంచి వచ్చే నీళ్లు మల్కారం చెరువులో కలుస్తుండడంతో కలుషితమైపోయింది.

ట్రీట్​మెంట్ ప్లాంట్​తో డంపింగ్​యార్డ్ వద్ద సమస్య పోలేదు.  యార్డు పరిసర ప్రాంతాల్లో  భరించలేని దుర్గంధం వస్తోంది. చలికాలం కావడంతో  ఊపిరిపీల్చుకునేందుకు కూడా ఇబ్బందులు పడుతున్నారు. డంపింగ్​యార్డులో పేరుకుపోయిన చెత్తకి సరిగ్గా క్యాపింగ్​చేయకపోవడం, రోజురోజుకూ వస్తున్న చెత్త అలాగే పేరుకుపోతుండటంతో సమస్య మరింత జఠిలమవుతున్నది. ఇతర ప్రాంతాల్లో డంపింగ్ యార్డులు ప్రారంభిస్తే తప్ప ఈ సమస్యకు పరిష్కారం శాశ్వత పరిష్కారం దొరకదంటున్నారు.