అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

అల్లు అర్జున్ ఇంటి దగ్గర ఉద్రిక్తత..  భారీగా పోలీసుల మోహరింపు

హైదరాబాద్ జూబ్లీహిల్స్‎లోని హీరో అల్లు అర్జున్ ఇంటి వద్ద హై టెన్షన్ నెలకొంది. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన రేవతి కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ ఓయూ జేఏసీ నాయకులు ఆదివారం (డిసెంబర్ 22) అల్లు అర్జున్ ఇంటిని ముట్టడించారు. దీంతో బన్నీ ఇంటి వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా పోలీసులను మోహరించారు. 

ఓయూ జేఏసీ నేతల ఆందోళన నేపథ్యంలో అల్లు అర్జున్ మామ కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి హుటాహుటిన అల్లుడి ఇంటికి చేరుకున్నారు. జేఏసీ నేతల ఆందోళన, దాడి ఘటనపై చంద్రశేఖర్ ఆరా తీశారు. అంతకుముందు బన్నీ ఇంటి గేట్ ముందు కూర్చొని బాధిత ఫ్యామిలీకి న్యాయం చేయాలని ఓయూ జేఏసీ నేతలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని.. రూ. కోటి నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. 

ఆందోళన సమయంలో కొందరు బన్నీ ఇంటి కంపౌండ్ వాల్ ఎక్కి రాళ్లు రువ్వగా.. మరి కొందరు ఇంట్లోకి వెళ్లి పూల కుండీలను ధ్వంసం చేశారు. 
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. బన్నీ ఇంటి ముందు బైఠాయించిన ఓయూ జేఏసీ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఓయూ జేఏసీ నేతల ఆందోళన సమయంలో బన్నీ ఇంట్లో లేరని సమాచారం. ప్రస్తుతం అల్లు అర్జున్ ఇంటి పరిసరాల్లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.