కరీంనగర్ జైలు దగ్గర భారీగా పోలీసుల మోహరింపు

కరీంనగర్ జైలు దగ్గర భారీగా పోలీసుల మోహరింపు

టెన్త్ పేపర్ లీక్ కేసులో అరెస్టయిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు  బండి సంజయ్   కరీంనగర్ జైలుకి చేరుకున్నారు. భారీ భద్రత నడుమ బండి సంజయ్ ను కరీంనగర్ జైలుకి తరలించారు పోలీసులు.  బీజేపీ  నాయకులు జైలు దగ్గరకు భారీగా చేరుకుంటున్నారు. ఈ క్రమంలో   కరీంనగర్ జైలు వద్ద పోలీసుల భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.  ఎవరిని జైలు వద్దకు రాకుండా ట్రాఫిక్ ను డైవర్ట్ చేస్తున్నారు.  ముందే జైలు దగ్గరికి వచ్చిన  బీజేపీ కార్యకర్తలను అక్కడి నుంచి పంపించేస్తున్నారు.  

మరో వైపు బండి సంజయ్ అరెస్ట్ తో  రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు.  బండి సంజయ్ ను వరంగల్ నుంచి కరీంనగర్ జైలుకు తరలిస్తున్నారని తెలియడంతో ఆయనకు మద్దతు తెలిపేందుకు  పలు జిల్లాల నుంచి వస్తున్న కార్యకర్తలను పోలీసులు ఎక్కడిక్కడ అరెస్ట్ చేస్తున్నారు.  హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో  కార్యకర్తలను బలవంతంగా అరెస్ట్ చేశారు పోలీసులు. వరంగల్ క్రాస్ రోడ్డు సమీపంలో బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డిని తన నివాసంలో పోలీసులు అరెస్టు చేశారు.

బండి సంజయ్ కి రెండు వారాల రిమాండ్

బండి సంజయ్ కి 14 రోజుల రిమాండ్ విధించింది హన్మకొండ ప్రిన్సిపల్  మెజిస్ట్రేట్ కోర్టు. ఏప్రిల్ 19 వరకు బండి సంజయ్ రిమాండ్ లో ఉండనున్నారు. బండి సంజయ్ ని కరీంనగర్   జైలుకి తరలించారు. బండి సంజయ్ తో పాటు మరో ముగ్గురు నిందితులను  కరీంనగర్ తరలించారు.  కస్టడీ పిటిషన్ పై వాదనల సందర్భంగా బండి సంజయ్ అరెస్ట్ అక్రమమని వాదించారు లాయర్లు. ఇరు వైపుల వాదనలు విన్న కోర్టు బండి సంజయ్ కి రెండు వారాల రిమాండ్ విధించింది.   కోర్టు రిమాండ్ పై నిర్ణయం తీసుకోవడంతో బండి సంజయ్ తరపున న్యాయవాదులు ఏప్రిల్ 6న లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు.