
- పోతంశెట్పల్లిలో స్తంభం విరిగిపడి వ్యక్తి కాళ్లు డ్యామేజీ
మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట వెలుగు: జిల్లాలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం సాయంత్రం అకాల వర్షం కురిసింది. పలు చోట్ల సుడిగాలి బీభత్సం సృష్టించింది. మెదక్ పట్టణంతోపాటు, మెదక్రూరల్, పాపన్నపేట, కొల్చారం తదితర మండలాల పరిధిలో వర్షం కురిసింది. మెదక్ పట్టణంలోని జంబికుంట వీధిలో వడ్యారం సిద్దయ్య ఇంటిపై పిడుగు పడింది. ఇంటి స్లాబ్, గోడ స్వల్పంగా డ్యామేజీ అయింది. కొల్చారం మండలం పోతంశెట్పల్లి వద్ద రోడ్డు వెంట ఉన్న చెట్లు కూలిపోయి వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగించాయి.
పోతంశెట్పల్లి చౌరస్తాలో కొన్ని రేకుల షెడ్డులు ఎగిరిపోయి 200 మీటర్ల దూరంలో పడ్డాయి. కిరాణా సామాను చిందర వందర అయ్యాయి. పోతంశెట్టిపల్లి వైన్స్ సమీపంలో కరెంట్ పోలు విరిగి పడి ఓ వ్యక్తికి రెండు కాళ్లు విరిగాయి. అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించారు. ఏడుపాయలకు వెళ్లే దారిలో రేకుల షెడ్డు ఎగిరి అగిఉన్న కారుపై పడింది. ఈదురు గాలికి రోడ్డుపై ఆటో పడిపోయింది. మెదక్ హైదరాబాద్ రోడ్డుపై చెట్టు అడ్డంగా పడడంతో ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసులు చేరుకొని ట్రాఫిక్ క్లియర్ చేశారు. చౌరస్తాలో నేషనల్హైవే జలమయం అయింది.
సంగారెడ్డి జిల్లాలో ..
సంగారెడ్డి జిల్లాలో పలు మండలాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడింది. మునిపల్లి, పుల్కల్, నారాయణఖేడ్, రాయికోడ్ మండలాల్లో 15 నిమిషాల పాటు భారీ వర్షం కురిసింది. సంగారెడ్డి, జహీరాబాద్, సదాశివపేట, పటాన్ చెరు, జోగిపేట మండలాల్లో జోరుగా గాలి వీస్తూ మోస్తారు వర్షం పడింది.
రాయికోడ్ మండలం సింగీతం-మామిడిపల్లి రోడ్డుపై చర్లరాయిపల్లి సమీపంలో బ్రిడ్జి నిర్మాణం కొనసాగుతుండగా వర్షానికి ప్రయాణికుల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. పక్కనే ఉన్న పంట పొలాల నుంచి తాత్కాలికంగా రోడ్డు వేయగా, వర్షానికి ఈ రోడ్డు బురదమయంగా మారి నాగన్ పల్లి, ఇందూర్, కర్చల్, మామిడిపల్లి, మొరటుగా, బొగ్గులంపల్లి ప్రజలు నల్లంపల్లి చౌరస్తా నుంచి పిపడ్ పల్లి మీదగా వెళ్లి ఇబ్బందులు పడ్డారు.
సిద్దిపేట జిల్లాలో..
సిద్దిపేట పట్టణంతో పాటు చేర్యాల, బెజ్జంకి, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక,ములుగు, మర్కుక్ మండలాల్లో చిరు జల్లులు కురిశాయి. బెజ్జంకిలో వడగండ్లు కురియడంతో అరగంటకు పైగా విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.