- హైదరాబాద్, నల్గొండతోపాటు పలు జిల్లాల్లో దంచికొట్టిన వాన
- మరో మూడ్రోజుల పాటు భారీ వర్షాలుంటాయన్న ఐఎండీ
హైదరాబాద్, వెలుగు: అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. మంగళవారం నల్గొండ, జనగామ జిల్లాల్లో పలు చోట్ల అతిభారీ వర్షాలు కురిశాయి. యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్ జిల్లాల్లో భారీ వర్షాలు కురవగా.. మరికొన్ని జిల్లాల్లో మోస్తరు వర్షాలు పడ్డాయి.
అత్యధికంగా నల్గొండ జిల్లా కామారెడ్డిగూడెంలో 12.5 సెంటీమీటర్ల అతిభారీ వర్షపాతం నమోదైంది. జనగామ జిల్లా దేవరుప్పలలో 11.6 సెంటీమీటర్లు, ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో 10, నల్గొండ జిల్లా తిమ్మాపూర్‌లో 10, మహబూబ్‌నగర్ జిల్లా ఉడిత్యాల్లో 9.3, నల్గొండ జిల్లా శాలిగౌరారంలో 9.2, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండలపల్లిలో 8.8, సిద్దిపేట జిల్లా ములుగులో 8.8, యాదాద్రి భువనగిరి జిల్లా దత్తప్పగూడలో 8.4, భద్రాద్రి జిల్లా నాగుపల్లిలో 8.1, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా డీపీపల్లిలో 8 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్‌లోనూ దంచింది..
హైదరాబాద్ సిటీలోనూ పలు చోట్ల భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచే సిటీ అంతటా మబ్బు పట్టి వర్షం మొదలైంది. సాయంత్రానికి సిటీని నల్లమబ్బులు కమ్మేశాయి. నాగోల్‌లో అత్యధికంగా 9 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. బండ్లగూడలో 7.8, హబ్సిగూడలో 7.2, రామంతాపూర్‌లో 5.2, హయత్‌నగర్‌లో 5.1, ఓయూలో 4.7, వనస్థలిపురంలో 4.5, మధురానగర్‌లో 4.3 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
మరో మూడ్రోజులు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో కేంద్రీకృతమైన ఉపరితల ఆవర్తన ప్రభావంతో మంగళవారం అల్పపీడనం ఏర్పడిందని వాతావరణ శాఖ వెల్లడించింది. దాని ప్రభావంతో రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్‌ను జారీ చేసింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని తెలిపిన ఐఎండీ.. ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగతా జిల్లాల్లో 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.