
హైదరాబాద్: బంగాళాఖాతంలో బలహీన పడిన రెండు ఉపరితల చక్రవాక ఆవర్తనాలు, ద్రోణి కారణంగా తెలంగాణకు వాతావరణ శాఖ వర్ష సూచన చేసింది. తేమ గాలుల వల్ల ఈ రోజు వానలకు అవకాశం ఉందని అయితే నిన్నటి కంటే తీవ్రత తక్కువగా ఉండే అవకాశం ఉందని తెలిపింది. ఈరోజు దక్షిణ, మధ్య జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని, రంగారెడ్డి జిల్లాలో మాత్రం ఈ రోజు ఎక్కువగా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
నేడు తెలంగాణాలో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపిన వాతావరణ శాఖ పలు జిల్లాలకు ఈరోజు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాల పడే అవకాశం ఉందని.. ఈ రోజు ములుగు, సిద్దిపేట, హన్మకొండ, వరంగల్, జనగాం, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, హైదరాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట, నల్గొండ, మహబూబ్ నగర్, నారాయణ్ పేట్, నాగర్ కర్నూల్, వనపర్తి, జోగులాంబ గద్వాల్, ఖమ్మం జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
రేపటి (ఏప్రిల్ 5, 2025) నుంచి మళ్ళీ ఎప్పటిలానే పొడి వాతావారణం ఉంటుందని, గరిష్ట ఉష్ణోగ్రతలు మళ్ళీ అత్యధికంగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. నిన్న (ఏప్రిల్ 4, 2025) భద్రాద్రి కొత్తగూడెంలో అత్యధికంగా 17 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని, దాదాపు 10 జిలాల్లో భారీ వర్షాలు కురిశాయని వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్ సిటీలోని చాలా ప్రాంతాల్లో గురువారం 6 నుంచి 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది.
అత్యధిక వర్షపాతం నమోదైన టాప్100 ప్రాంతాల్లో 90 హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్‌లో 9.8 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా.. ఆ తర్వాత హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో 9.6, డబీర్‌పురాలో 9.45, సరూర్‌నగర్‌లో 9.35, నాంపల్లిలో 9.43, ముషీరాబాద్‌లో 9.43, అంబర్‌పేటలో 9, యాకుత్‌పురాలో 8.7, శారదామహల్‌లో 8.6, కంచన్‌బాగ్‌లో 8.53, బంజారాహిల్స్‌లో 8.5, బోయిన్‌పల్లి వార్డ్ ఆఫీస్ వద్ద 8, మెట్టుగూడలో 7.8, ఎల్బీ నగర్‌లో 7.8, సైదాబాద్‌లో 7.7, ఓయూ క్యాంపస్‌లో 7.7, అల్వాల్‌లో 7.4, ఖైరతాబాద్‌లో 7.3, ఉప్పల్‌లో 7.1, సికింద్రాబాద్‌లో 6.2సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది.
హైదరాబాద్‌లో గురువారం మధ్యాహ్నం భారీ వర్షం కురిసిన సంగతి తెలిసిందే. ఒక్కసారిగా ఈదురుగాలులతో కుండపోత వాన పడింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దంచికొట్టింది. 5 గంటల్లోనే 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మెయిన్‌రోడ్లు మొదలుకొని కాలనీలు కూడా జలమయమయ్యాయి. బండ్లు కొట్టుకుపోయాయి. పలుచోట్ల ఇండ్లలోకి వరద చేరింది. ఈదురుగాలులకు చెట్లు కూలడంతో పాటు రోడ్లు, ఫ్లైఓవర్లపై పెద్ద ఎత్తున వరద నిలవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్ అయింది. భారీ వర్షానికి చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. భాగ్యలక్ష్మి దేవాలయం వైపు ఉన్న మినార్‌లో పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది.