ఉరుములు.. మెరుపుల వాన సిటీ ఆగమాగం.. అత్యధికంగా హిమాయత్​నగర్​లో 9.60 సెం.మీ వర్షం

 ఉరుములు.. మెరుపుల వాన సిటీ ఆగమాగం.. అత్యధికంగా హిమాయత్​నగర్​లో 9.60 సెం.మీ వర్షం
  • ఈదురు గాలులకు రోడ్లపై కూలిన చెట్లు
  •  స్తంభించిన ట్రాఫిక్.. లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లలోకి వరద

హైదరాబాద్​సిటీ నెట్​వర్క్, వెలుగు: గ్రేటర్​వ్యాప్తంగా గురువారం భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఉరుములు, మెరుపులతో దంచికొట్టింది. ఈదురు గాలులకు చాలాచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. అత్యధికంగా హిమాయత్​నగర్​లో 9.60 సెంటీమీటర్ల వాన పడింది. మిగిలిన అన్ని ప్రాంతాల్లో సెంటీమీటర్లకుపైగా వర్ష పాతం నమోదైంది. ఇర్రంమంజిల్ సమీపంలోని మెర్క్యూర్​ హోటల్ వద్ద భారీ చెట్టు కూలి రోడ్డుపై పడడంతో దాదాపు గంట పాటు ట్రాఫిక్​కు అంతరాయం ఏర్పడింది. ట్రాఫిక్​పోలీసులు చేరుకుని పంజాగుట్ట, అమీర్​పేట, కూకట్​పల్లి, సికింద్రాబాద్​వైపు వెళ్లే వాహనాలను తాజ్​కృష్ణ వైపు మళ్లించారు. 

రద్దీ పెరగడంతో ఆ రూట్​మొత్తం బ్లాక్​అయింది. హైడ్రా సిబ్బంది వచ్చి 40 నిమిషాల్లో చెట్టును తొలగించారు. రాజ్​భవన్, ఖైరతాబాద్, సైదాబాద్ స్టేట్ బ్యాంక్ కాలనీ, బషీర్ బాగ్, నెక్లెస్ రోడ్, ముషీరాబాద్, అసెంబ్లీ, బంజారాహిల్స్ ప్రాంతాల్లో రోడ్లకు అడ్డంగా చెట్లు కూలడంతో భారీగా ట్రాఫిక్ నిలిచింది. ఓల్డ్ అల్వాల్, ఎల్బీన గర్, బేగంపేట, అమీర్​పేట, మాదాపూర్, మెహిదీపట్నంలో రోడ్లపై మోకాళ్ల లోతున నీరు నిలిచింది. చెట్లు కూలిన, నీరు నిలిచిన ప్రాంతాలను హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ పరిశీలించారు. 

మూసీలో చిక్కుకున్న కూలీలు సేఫ్​

వరద ఉద్ధృతి పెరగడంతో చైతన్యపురి ఫణిగిరి కాలనీ సమీపంలోని మూసీ నదిలో పనులకు వెళ్లిన ఇద్దరు కూలీలు చిక్కుకుపోయారు. సమాచారం అందుకున్న డీఆర్ఎఫ్, బల్దియా, ఫైర్ సిబ్బంది వారిని సేఫ్​గా బయటికి తీసుకొచ్చారు. వీరయ్య, నరేంద్ర కూలీలు అక్కడి శివాలయం వద్ద నంది విగ్రహ నిర్మాణ పనులు చేస్తున్నట్లు తెలిసింది.  మలక్ పేట రైల్వే అండర్​ బ్రిడ్జి వద్ద నడుముల్లోతున వరద నీరు నిలిచింది. ఓ ఆర్టీసీ బస్సు అందులో చిక్కుకుపోయింది.

ఆ ఎఫెక్ట్​తో మలక్​పేట నుంచి ఎల్బీనగర్​ వరకు గంటపాటు ట్రాఫిక్​ స్తంభిచింది. డీఆర్ఎఫ్, పోలీస్​ సిబ్బంది వచ్చి తాళ్ల సాయంతో బస్సును బయటికి తీశారు. స్టేట్​ సెక్రటేరియట్​ ముందున్న రోడ్డు చెరువును తలపించింది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ కింద మోకాళ్ల లోతున వరద చేరింది. హిమాయత్ నగర్ స్ట్రీట్ నంబర్​6 వద్ద రోడ్డుపై నిలిచిన వర్షపు నీటిని నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు తొలగించినా లాభం లేకపోయింది. పంజాగుట్ట ఫ్లై ఓవర్​పై వరద కాల్వను తలపించింది. పద్మారావునగర్​ వెంకటాపురం కాలనీలో నిర్మిస్తున్న తుంగభద్ర మహిళా మండలి కమ్యూనిటీ హాల్​ప్రహరీ కూలింది. చందానగర్, గంగారం వద్ద రోడ్డుపై వర్షపు నీరు చేరింది. బయోడైవర్సిటీ నుంచి జేఎన్​టీయూ వెళ్లే రోడ్డు, గచ్చిబౌలి నుంచి హఫీజ్​పేట్​ రోడ్డు, గచ్చిబౌలి నుండి లింగంపల్లి రోడ్డు, బయోడైవర్సిటీ నుండి షేక్​పేట రోడ్డులో భారీ ట్రాఫిక్ జామ్​ ఏర్పడింది.  

రాత్రి 11 గంటల వరకు నమోదైన వర్షపాతం

రాత్రి 11 గంటల వరకు నమోదైన వర్షపాతం
ప్రాంతం    వర్షపాతం
(సెం.మీ.లలో)
హిమాయత్ నగర్    9.60
డబీర్ పురా              9.45
సరూర్ నగర్           9.35
నాంపల్లి                  9.43
ముషీరాబాద్          9.43
అంబర్ పేట          9.05
రెయిన్ బజార్       8.80
చార్మినార్              8.73
కంచన్ బాగ్          8.53
బంజారాహిల్స్    8.50
బాలానగర్           8.03
మారేడ్ పల్లి        8.13
సైదాబాద్          7.88