ఆగని వానతో హైదరాబాద్‌ ఆగమాగం

ఆగని వానతో హైదరాబాద్‌ ఆగమాగం
  • చెట్లు, వృక్షాలు నేలకూలి వాహనాలు ధ్వంసం..పలుచోట్ల కరెంట్​ సరఫరాకు అంతరాయం
  • రోడ్లపై నీళ్లు నిలవడంతో రాకపోకలకు ఇబ్బందులు వరదతో మునిగిన 
  • సెల్లార్లు, కాలనీలు, రోడ్ల డ్యామేజీ 
  • ఆదివారంతో కావడంతో తప్పిన ట్రాఫిక్ ​తిప్పలు

వెలుగు సిటీ నెట్​వర్క్​: రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలు నగ రాన్ని ఆగమాగం చేశాయి.  క్షణం కూడా ఆగకుండా వాన పడడంతో జనాలు అత్యవసరమైతే తప్పా ఇండ్లల్లో నుంచి బయటకు రాలేదు. వర్షానికి తోడు ఈదురుగాలులు వీయడంతో చెట్లు విరిగిపడ్డాయి. రోడ్డుకు అడ్డంగా పడిన చోట వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడగా, కరెంట్​ వైర్లపై పడడంతో సరఫరా నిలిచిపోయింది. గోడలు కూలి వాహనాలు ధ్వంసమయ్యాయి. అపార్ట్​మెంట్ల సెల్లార్లు, కాలనీల్లోకి వరద చేరడంతో మోటార్లతో తోడి పోయడానికి తిప్పలు పడ్డారు. 

లోతట్టు ప్రాంతాల్లోని ఇండ్లల్లోకి నీళ్లు చేరడంతో సామాన్లు తడిసిపోయాయి. సెలవు రోజు కావడంతో ఎక్కువగా ట్రాఫిక్ ​జామ్​లు కనిపించలేదు. రోడ్లపై నీళ్లు నిలిచిన చోట వాహనాల వేగం మందగించింది. ఇంకా వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో ముందస్తుగా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో సోమవారం స్కూళ్లకు సెలవులు ప్రకటించారు. సోమవారం వర్కింగ్​డే కావడంతో వర్షం వల్ల జనాలకు ఇబ్బందులు కలగకుండా అధికారులు అలర్టయ్యారు. 

సికింద్రాబాద్​లో...

సికింద్రాబాద్​/పద్మారావునగర్​: సికింద్రాబాద్​అడ్డ గుట్టలో మెయిన్​రోడ్డుపై భారీ వృక్షం విరిగి ఆటో, కారుపై పడి ధ్వంసమయ్యాయి. లాలాపేట్ సత్యా నగర్​లో టూవీలర్​పై స్తంభం పడి నాశనమైంది.  కంటోన్మెంట్ జయ నగర్, ఓయూ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ వద్ద, మెట్టుగూడ బస్తీలో, మెట్టుగూడ వాటర్ ట్యాంక్ రోడ్డులో, మల్లాపూర్ ఎన్ఎఫ్​సీ చౌరస్తాలో,కంటోన్మెంట్​సమతానగర్​లో విరిగి రోడ్లపై పడ్డాయి. నేరేడ్​మెట్ మధురానగర్ లో ఓ పాత ఇంటిపై చెట్టు విరిగిపడింది. బౌద్ధనగర్​లోని ఎస్ఎంఆర్​కాంప్లెక్స్​వద్ద భారీ చెట్టు కుప్పకూలింది.  

అల్లాపూర్​లో మునిగిన ఇండ్లు 

కూకట్​పల్లి : అల్లాపూర్​ డివిజన్​పరిధిలోని మైసమ్మ చెరువు సమీపంలోని రాజీవ్​గాంధీనగర్​, సఫ్దర్​నగర్​ బస్తీల్లోని ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. అధికారులు మైసమ్మ చెరువు, కాముని చెరువు మధ్య ఉన్న నాలాని డైవర్ట్​ చేసి వర్షపు నీటిని మళ్లించారు. భాగ్యనగర్​కాలనీలో కరెంట్​స్తంభంపై చెట్టు పడడంతో విద్యుత్​సరఫరా ఆపేశారు. గాయత్రినగర్​లోని జెనసిస్​ స్కూల్​ఎదురుగా ఉన్న చెట్టు కూలి వాహనాల మీద పడడంతో కారు, రెండు ఆటోలు ధ్వంసమయ్యాయి. 

జీడిమెట్ల పారిశ్రామిక వాడలో...

జీడిమెట్ల, వెలుగు: మియాపూర్​-గండి మైసమ్మ రోడ్డు మార్గంలో స్నేక్​పార్క్​వద్ద చెట్టు విరిగి రోడ్డుపై పడడంతో ట్రాఫిక్​కు అంతరాయం కలిగింది. ప్రగతినగర్​ఎన్ఆర్ఐ కాలనీలో మోకాలులోతు వరద వచ్చి చేరింది. నిజాంపేట్​ రేణుకా ఎల్లమ్మకాలనీలోని బృందావనం అపార్ట్​మెంట్​సెల్లార్​లోకి వరద చేరడంతో మోటార్ల సాయంతో నీటిని బయటకు తోడేశారు. చింతల్​లో ఓ విద్యుత్తు స్తంభం విరిగి పక్కనే ఉన్న ట్రాన్స్​ఫార్మర్​పై పడింది.  

వికారాబాద్​జిల్లాలో...

వికారాబాద్/కొడంగల్,  వెలుగు : వికారాబాద్​జిల్లాలోని కోటపల్లి, లక్నాపూర్, జంటుపల్లి ప్రాజెక్టులతో పాటు చెరువులు నిండుకుండలా మారాయి. 32 ప్రాంతాల్లో రోడ్లను మూసివేసినట్లు ఎస్పీ నారాయణ రెడ్ది తెలిపారు. నాలుగు క్విక్ రెస్పాండ్ టీంలను రెడీ గా ఉంచినట్లు చెప్పారు. జిల్లాలో 25 ఇండ్లు పాక్షికంగా కూలినట్లు అడిషనల్​కలెక్టర్ లింగ్యానాయక్ తెలిపారు. జిల్లాలో 84.9 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదైంది. కలెక్టర్​తో పాటు ఎస్పీ నారాయణ రెడ్ది కొడంగల్, పరిగి నియోజకవర్గాల్లో, అడిషనల్​కలెక్టర్ లింగ్యా నాయక్, ఆర్డీవో వాసుచంద్ర వికారాబాద్, తాండూర్ నియోజకవర్గాల్లో పర్యటించారు. కొడంగల్​లో ఎన్​హెచ్​ 167 కోతకు గురి కావడంతో రవాణాకు అంతరాయం ఏర్పడింది. ​ బాలాజీనగర్, వినాయక చౌక్​వద్ద ఇండ్లు, షాపుల్లోకి నీరు చేరింది.  

మేడ్చల్ మల్కాజిగిరి ​జిల్లాలో... 

మేడ్చల్ కలెక్టరేట్:  మేడ్చల్​లో  పెద్ద చెరువు, శామీర్​పేటలోని అలియాబాద్​ చెరువు అలుగు పారడంతో రాకపోకలు బందయ్యాయి. మూడు చింతలపల్లి మం డలంలోని లక్ష్మాపూర్ లో ఓ ఇంటిపై చెట్టు విరిగి పడింది. అల్వాల్ మున్సిపల్ ఆఫీసు సమీపంలో మెయిన్​రోడ్డుపై వృక్షం కూలడంతో కారు ధ్వంసమైంది. ఓల్డ్ అల్వాల్​లోని ప్రభుత్వ స్కూల్ వద్ద  వృక్షం విరిగి ఇంటిపై పడింది. కీసర  ఎస్సీ కాలనీలోని 11వ వార్డులో ఓ వృద్ధురాలి ఇల్లు గోడ కూలిపోయింది

ఉప్పల్​లో ట్రాఫిక్​జామ్​

మేడిపల్లి: పీర్జాదిగూడ కార్పొరేషన్ పరిధిలోని వరంగల్ హైవే ఉప్పల్ డిపో వద్ద రోడ్డుపై నీరు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామయ్యింది. పీర్జాదిగూడ డంపింగ్ యార్డ్ వద్ద డబుల్​బెడ్​రూం ఇండ్లలోకి వరద చేరింది. 26వ డివిజన్​లో భారీ చెట్టు ట్రాన్స్​ఫార్మర్​పై పడిపోయింది.  

 రంగారెడ్డి జిల్లాలో..

రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లాలో చేవెళ్ల డివిజన్​పరిధిలో పొలాలు నీట మునిగాయి. నాగరగూడ ఈసీ నాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. శంకర్​పల్లి మండలం పొద్దటూర్​వద్ద మూసీ బిడ్ర్జిపై నుంచి వరద ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఈసీ వాగు పక్కన ఉన్న పొలాలు జలమమయ్యాయి. శంకర్ పల్లి మండలం పొద్దుటూరు మూసీ వాగు దగ్గర  గుడిసెల నుంచి కూలీలను మోకిలా పోలీసులు మరోచోటికి తరలించారు.

 హైడ్రా గండిపేట ఎఫ్​టీఎల్​ పరిధిలో నిర్మాణాలు కూల్చివేసిన తర్వాత మొదటిసారి భారీగా గండిపేటకు వరద వచ్చి చేరింది. షాద్​నగర్​లో పలు కాలనీలతో పాటు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. అబ్దుల్లాపూర్ మెట్ మండలం తుర్కయాంజాల్ మున్సిపల్​పరిధిలో మాసబ్ చెరువు నిండడంతో చెరువు కింద ఉన్న యాపిల్​ఎవెన్యూలోని ఇండ్లలోకి, డబుల్ బెడ్​రూం ఇండ్ల ప్రాంతానికి వరద చేరింది. 

ఐటీ కారిడార్ సేఫ్​

మాదాపూర్: ఐటీ కారిడార్​లో నాన్​స్టాప్​వర్షం కురిసినా పెద్దగా ఇబ్బందులు కలగలేదు. వీకెండ్​సెలవులతో అంతా ఇండ్లకే పరిమితం కావడంతో మాదాపూర్​,జేఎన్​టీయూ, కొండాపూర్​, చందానగర్​, గచ్చిబౌలి, షేక్​పేట్​రూట్లలో ట్రాఫిక్​ రద్దీ కనిపించలేదు. కొన్ని కాలనీలు జలమయమయ్యాయి. మైండ్​స్పేస్​ నుంచి వరద భారీగా రావడంతో నెక్టార్​గార్డెన్​రోడ్డు నీటితో నిండిపోయింది. 

దీంతో వాహనాల రాకపోకలను నిలిపివేశారు. లింగంపల్లి రైల్వే అండర్​బ్రిడ్జి కూడా నీట మునగడంతో వాహనాలను నల్లగండ్ల ఫ్లైఓవర్​మీదుగా మళ్లించారు. కొండాపూర్, మాదాపూర్, గచ్చిబౌలి ఏరియాల్లో ఉన్న వాటర్​లాగింగ్​పాయింట్ల వద్ద నీరు నిలువకుండా శేరిలింగంపల్లి జోన్​ఇంజినీరింగ్​అధికారులు క్లియర్​ చేశారు. ఫైనాన్షియల్​ డిస్ర్టిక్ట్​ ప్రిజమ్​పబ్​ వద్ద భారీ వర్షానికి రెండు చెట్లు నేలకొరిగాయి.