హైదరాబాద్‌లో వానబీభత్సం..ఇండ్లలోకి వరద..కొట్టుకుపోయిన బండ్లు

హైదరాబాద్‌లో వానబీభత్సం..ఇండ్లలోకి వరద..కొట్టుకుపోయిన బండ్లు
  • ఇండ్లలోకి వరద.. కొట్టుకుపోయిన బండ్లు 
  • కూలిన చెట్లు.. రోడ్లపై నిలిచిన నీళ్లు.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్​జామ్  
  • జిల్లాల్లోనూ భారీ వర్షాలు.. దెబ్బతిన్న పంటలు
  • పిడుగులు పడి ముగ్గురు మృతి.. గోడ కూలి మరొకరు
  • మరో రెండ్రోజులు వర్షాలు.. 27 జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్ / నెట్‌వర్క్, వెలుగు: హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా ఈదురుగాలులతో కుండపోత వాన పడింది. మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు దంచికొట్టింది. 5 గంటల్లోనే 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో మెయిన్​రోడ్లు మొదలుకొని కాలనీలు కూడా జలమయమయ్యాయి. బండ్లు కొట్టుకుపోయాయి. పలుచోట్ల ఇండ్లలోకి వరద చేరింది. 

ఈదురుగాలులకు చెట్లు కూలడంతో పాటు రోడ్లు, ఫ్లైఓవర్లపై పెద్ద ఎత్తున వరద నిలవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్​జామ్ అయింది. భారీ వర్షానికి చార్మినార్ పెచ్చులు ఊడిపడ్డాయి. భాగ్యలక్ష్మి దేవాలయం వైపు ఉన్న మినార్‌‌లో పైకప్పు నుంచి పెచ్చులు ఊడిపడ్డాయి. ఆ సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పింది. మినార్‌‌‌‌కు రిపేర్లు చేస్తామని అధికారులు తెలిపారు. కాగా, పలు జిల్లాల్లోనూ భారీ వర్షాలు కురిశాయి. నిర్మల్, కరీంనగర్, పెద్దపల్లి, వరంగల్, ఖమ్మం మినహా.. మిగతా అన్ని జిల్లాల్లోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడ్డాయి. 

హైదరాబాద్‌‌లోని 90 ప్రాంతాల్లో..

అత్యధిక వర్షపాతం నమోదైన టాప్​100 ప్రాంతాల్లో 90  హైదరాబాద్ పరిధిలోనే ఉన్నాయి. అత్యధికంగా యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపూర్‌‌‌‌లో 9.8 సెం.మీ. వర్షపాతం నమోదు కాగా.. ఆ తర్వాత హైదరాబాద్‌‌లోని హిమాయత్‌‌నగర్‌‌‌‌లో 9.6, డబీర్‌‌‌‌పురాలో 9.45, సరూర్‌‌‌‌నగర్‌‌‌‌లో 9.35, నాంపల్లిలో 9.43, ముషీరాబాద్‌‌లో 9.43, అంబర్‌‌‌‌పేటలో 9, యాకుత్‌‌పురాలో 8.7, శారదామహల్‌‌లో 8.6, కంచన్‌‌బాగ్‌‌లో 8.53, బంజారాహిల్స్‌‌లో 8.5, బోయిన్‌‌పల్లి వార్డ్​ ఆఫీస్ వద్ద 8, మెట్టుగూడలో 7.8, ఎల్బీ నగర్‌‌‌‌లో 7.8, సైదాబాద్‌‌లో 7.7, ఓయూ క్యాంపస్‌‌లో 7.7, అల్వాల్‌‌లో 7.4, ఖైరతాబాద్‌‌లో 7.3, ఉప్పల్‌‌లో 7.1, సికింద్రాబాద్‌‌లో 6.2సెం.మీ. చొప్పున వర్షపాతం నమోదైంది. 

పిడుగులకు ముగ్గురు బలి..  

పిడుగుపాటుకు ముగ్గురు బలయ్యారు. నాగర్‌‌‌‌కర్నూల్‌‌ జిల్లాలో ఇద్దరు మహిళలు, గద్వాల జిల్లాలో మరొకరు చనిపోయారు. నాగర్‌‌‌‌కర్నూల్‌‌ జిల్లా పదర మండలం కోడొనిపల్లికి గాజుల వీరమ్మ (50), సుంకరి సైదమ్మ (40) పదర మండల కేంద్రానికి చెందిన పోతుల వినోద్ చేనులో కూలి పనికి వెళ్లారు. గురువారం మధ్యాహ్నం 1:30 గంటలకు  ఉరుములు మెరుపులతో భారీ వర్షం పడింది. 

అదే సమయంలో పొలంలో పని చేస్తున్న వీరమ్మ, సైదమ్మ మీద  పిడుగు పడడంతో వారిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. మరో మహిళ సుంకరి లక్ష్మమ్మకు గాయాలు కాగా అచ్చంపేట ఏరియా ఆసుపత్రికి తరలించారు. అలాగే గద్వాల జిల్లా మానవపాడు మండలంచంద్రశేఖర్ నగర్ గ్రామంలో పిడుగు పడి మరొకరు చనిపోయారు. గ్రామ శివారులోని పొలాల్లో పశువులను మేపేందుకు వెళ్లిన వెంకటేశ్(45)పై పిడుగు పడింది.

అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. మరోవైపు గజ్వేల్ మండలంలోని జాలిగామ గ్రామంలో నిర్మాణంలో ఉన్న  ప్రైవేటు గోదాం ప్రహరీ కూలి గజ్వేల్​పట్టణానికి చెందిన ఎండీ హిమ్మత్ ఖాన్(52) మృతి చెందాడు. ఈ ప్రమాదంలో మరో ఇద్దరు గాయపడ్డారు. కాగా, పిడుగులు పడి సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఇస్రీతాబాద్‌‌లో 20 మేకలు, వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం ఖాజా​అహ్మద్‌‌పల్లిలో 23 మేకలు చనిపోయాయి. 

విద్యుత్​ సరఫరాకు అంతరాయం..

తాజా వర్షాలకు విద్యుత్​ సరఫరా వ్యవస్థ భారీగా దెబ్బ తింది. కొన్నిచోట్ల గాలి దుమారానికి చెట్లు కూలి విద్యుత్​ స్తంభాలపై పడడంతో కరెంట్​తీగలు తెగిపడ్డాయి. హైదరాబాద్‌‌లో కురిసిన వర్షానికి 449 ఫీడర్ల పరిధిలో విద్యుత్ సరఫరాకు అంతరాయం జరిగింది. రంగంలోకి దిగిన సిబ్బంది 410 ఫీడర్ల పరిధిలో సర ఫరా పునరుద్ధరించారు. మిగిలిన ఫీడర్ల పరిధిలోని ఎర్రమంజిల్, సోమాజిగూడ, -దుర్గానగర్, బీఎస్​మక్తా, బాగ్ లింగంపల్లి, హనుమాన్ టెక్డీ, శ్రీనగర్ కాలనీ, హైదర్‌‌‌‌గూడ, టప్పాచబుత్ర, లంగర్‌‌‌‌హౌస్, కార్వాన్ ప్రాంతాల్లో తీగలపై చెట్లు విరిగి పడటంతో వాటిని తొలగించి సరఫరాను పునరుద్ధరించడానికి చాలా టైమ్ పట్టింది. 

ఇంకో రెండ్రోజులు వానలు..

రాష్ట్రంలో మరో రెండ్రోజుల పాటు వర్షాలు కురుస్తాయ ని వాతావరణ శాఖ తెలిపింది. శుక్ర, శనివారాల్లో ఆదిలాబాద్, కుమ్రంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామా బాద్, నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొం డ, సిద్దిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్​, వికారాబాద్, జనగామ, మహబూబ్‌‌నగర్, నాగర్‌‌‌‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల, భూపాలపల్లి, భద్రాద్రి, ములుగు, ఖమ్మం, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఆయా జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్‌‌లోనూ​మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని, రాష్ట్రమంతటా 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది.  

పంటలు ఆగం

అకాల వర్షాలకు రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు సెంటర్లలో, కల్లాల్లో కుప్పపోసిన వడ్లు, మక్కలు తడిసిపోయాయి. వారం, పది రోజుల క్రితం కురిసిన గాలివానకు 11వేలకు పైగా ఎకరాల్లో పంట నష్టం జరగ్గా, తాజాగా కురిసిన వర్షాలతో నష్టం మరింత తీవ్రంగా ఉన్నట్టు తెలుస్తోంది. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా 17 జిల్లాల్లో కురిసిన వర్షానికి చేతికి వచ్చిన పంటలు దెబ్బతిన్నాయి. 

వికారాబాద్, రంగారెడ్డి, మెదక్, సంగారెడ్డి, మేడ్చల్, సిద్దిపేట, కామారెడ్డి, రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, యాదాద్రి, జనగామ తదితర జిల్లాల్లో పంట నష్టం జరిగింది. వికారాబాద్, మెదక్​జిల్లాల్లో పలుచోట్ల పొలాలు దెబ్బతిన్నాయి. సంగారెడ్డి,  మెదక్, వికారాబాద్​ జిల్లాల్లో పండ్లు, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. యాదాద్రి, జనగామ, సిద్దిపేట, సంగారెడ్డి, వికారాబాద్​ జిల్లాల్లో గాలి దుమారానికి మామిడి కాయలు నేలరాలాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం రావులచెరువు గ్రామంలో ఈదురుగాలులకు 55 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లింది. కామారెడ్డి జిల్లాలో వడగండ్ల వానకు బీర్కూర్, నస్రుల్లాబాద్, నిజాంసాగర్, బాన్సువాడ మండలాల్లో  మక్క పంట నేలకొరిగింది.