కరీంనగర్‌‌ జిల్లాలో వర్షం.. తడిచిన మక్కలు, నేలవాలిన మొక్కజొన్న పంట 

కరీంనగర్‌‌ జిల్లాలో వర్షం.. తడిచిన మక్కలు, నేలవాలిన మొక్కజొన్న పంట 

కరీంనగర్/పెద్దపల్లి/గొల్లపల్లి/మల్యాల, వెలుగు: కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో శుక్రవారం సాయంత్రం, రాత్రి ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. చొప్పదండిలో అరగంటపాటు కురిసిన భారీ వర్షం కారణంగా వ్యవసాయ మార్కెట్ సమీపంలో హైవే రోడ్డుపై వరద నీరు నిలిచింది. వ్యవసాయం మార్కెట్‌‌లో ఆరబోసిన మక్కలు వరదకు కొట్టకుపోయాయి.

మక్కల బస్తాలు తడిచిపోయాయి. మొక్కజొన్న పంట నేలవాలింది. గన్నేరువరంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో విద్యుత్ సప్లైకి అంతరాయం ఏర్పడింది. కొత్తపల్లి, రామడుగు, గంగాధర, తిమ్మాపూర్, మానకొండూరు, శంకరపట్నం, సైదాపూర్, చిగురుమామిడి మండలాల్లో జల్లులు కురిశాయి. 

పెద్దపల్లి జిల్లాలో మోస్తరు వాన

పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా చిరుజల్లులు పడ్డాయి. పెద్దపల్లి, సుల్తానాబాద్​ పట్టణాల పరిధిలో దాదాపు అరగంట సేపు  వడగండ్లతో కూడిన వర్షం పడింది. దీంతో కొంతసేపు రాజీవ్​ రహదారిపై నుంచి వర్షపు నీరు ప్రవహించింది. సుల్తానాబాద్​ మండలం భూపతిపూర్​గ్రామ పరిధిలో తాటిచెట్టుపై పిడుగు పడింది. 

వేములవాడలో భారీ వర్షం.. 

వేములవాడ/రాజన్నసిరిసిల్ల, వెలుగు:  రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో భారీ వర్షం కురిసింది. కొద్దిరోజులుగా ఉక్కపోతతో ఉన్న వాతావరణం పూర్తిగా చల్లబడింది. భారీ వర్షంతో రాజన్న సన్నిధికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడ్డారు. వీర్నపల్లి మండలం అజ్మీరా తండాలో, కోనరావుపేట మండలం వట్టిమళ్లలో  వడగండ్ల వాన కురిసింది. చందుర్తి, రుద్రంగి, కోనరావుపేట, ముస్తాబాద్, ఎల్లారెడ్డిపేట, గంభీరావుపేట, బోయినిపల్లి మండలాల్లో చిరుజల్లులు పడ్డాయి. 

గొల్లపల్లి/మల్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో కురిసిన వర్షంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి పొట్ట దశలో, మామిడి పిందె దశలో ఉండగా రైతులు టెన్షన్‌‌ పడుతున్నారు. మల్యాల మండలంలో శుక్రవారం భారీ వర్షం కురిసింది.