
మహబూబాబాద్/బచ్చన్నపేట/రఘునాథపల్లి/ఎల్కతుర్తి, వెలుగు : మహబూబాబాద్ జిల్లా మరిపెడ, చిన్నగూడూరు, నరసింహులపేట, కురవి, జనగామ జిల్లా బచ్చన్నపేట, రఘునాథపల్లి, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలాల్లో శుక్రవారం అర్ధరాత్రి, శనివారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. దీంతో వరి, మామిడి, మక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. గాలులకు తోడుగా వడగండ్లు పడడంతో వడ్లు, మామిడికాయలు రాలిపోగా, చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకూలాయి.
పలు చోట్ల ఇండ్ల పైకప్పులు కొట్టుకుపోగా, స్తంభాలు కూలడంతో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. మహబూబాద్ జిల్లాలో 2,230 ఎకరాల్లో వరి, 825 ఎకరాల్లో మక్కజొన్న, 3,548 ఎకరాల్లో మామిడి, 290 ఎకరాల్లో పెసర, 8 ఎకరాల్లో బొప్పాయి కలిపి 2,700 మంది రైతులకు చెందిన 6,901 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు అంచనా వేశారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం బావోజీగూడెంలో శుక్రవారం అర్ధరాత్రి పిడుగు పడడంతో వుడుగుల శ్రీను (22) చనిపోగా, మరో ఇద్దరు గాయపడ్డారు. ఎల్కతుర్తి మండలంలో పడిన వర్షం కారణంగా రాశులు పోసిన వడ్లు తడిసిపోయాయి.